వాజేడు, నవంబర్ 23 : ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టలపై నివసిస్తున్న పెనుగోలు గ్రామస్తులు కిందికి వస్తేనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. మండల కేంద్రానికి దూరంగా గుట్టలపై 15 గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ, రాజకీయ, కుల సర్వేలో వీరి వివరాలు ఇప్పటి వరకు నమోదు చేయలేదు.
ఇప్పటికే మండలంలో సేకరించిన సర్వే వివరాలను మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అయితే ఎన్యుమరేటర్లు గుట్టపై ఉన్న గిరిజనుల వివరాల సేకరణపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ ఎంపీవో శ్రీకాంత్‌నాయుడు, కొంగాల గ్రామ పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి చాట్ల ప్రభాకర్‌ను వివరణ కోరగా, భద్రతా కారణాల వల్ల గుట్టపైకి వెళ్లలేదని, అక్కడున్న వారిని కిందకు రావాలని కబురు పంపామని, వారు వస్తే వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.