హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, మే 23 (నమస్తే తెలంగాణ): 94 ఎకరాల భూమి అది. మార్కెట్లో దాని విలువ రూ.700-800 కోట్ల పైమాటే. దశాబ్దాలపాటు వివాదంలో ఉన్నది. అయితే, ఈ విషయాలేమీ పట్టించుకోని ఓ తహసీల్దార్ ఆ భూ రికార్డుల మార్పునకు పూనుకొన్నారు. దీన్ని గమనించిన ‘ముఖ్య’నేత.. ఈ ‘బిగ్’ వ్యవహారంలో తన సోదరుల ప్రమేయం ఉన్నదా? అని వాకబు చేశాడు. లేదని తేలడంతో తహసీల్దార్‌పైకి ఏసీబీని ఉసిగొల్పాడు. అయితే, చివరికి తేలిందేమిటంటే? తన ప్రధాన అనుచరుడైన మైనారిటీ నేతే ఈ తతంగాన్ని నడిపినట్టు తెలుసుకొని ఆ ‘ముఖ్య’నేత షాకయ్యాడు. విషయం బయటకు పొక్కకుండా తహసీల్దార్‌ను బదిలీ చేయించి, ఏసీబీ దాడుల వివరాలను గోప్యం గా ఉంచాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ భూవివాదం గురించే ఈ ఉపోద్ఘాతమంతా!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంపై ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. రెండురోజుల పాటు ఏకధాటిగా భూముల వివరాలపై ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్ రవీంద్ర దత్‌ను రంగారెడ్డి కలెక్టరేట్లోని ఎన్నికల విభాగానికి బదిలీ చేశారు. కానీ ఏసీబీ దాడులకు సంబంధించిన వివరాలేమీ అధికారులు వెల్లడించలేదు. మరోవైపు తహసీల్దార్ బదిలీపైనా కారణాలు బయటికి రానీయలేదు. ఈ వ్యవహారాన్ని లోతుగా ఆరా తీస్తే ఇందులోనూ సర్కార్ పెద్దల కోటరీలోని వ్యక్తుల మధ్య పోటీ, పంచాయితీలే ఉన్నట్టు అర్థమవుతున్నది. విషయం లోతుల్లోకి వెళ్తే.. పెద్దషాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో 172 నుంచి 183 వరకు ఉన్న సర్వేనంబర్లలో (పాత సర్వేనెంబరు 202) సుమారు 170 ఎకరాల భూమి ఉన్నది. దీనిపై చాలాకాలంగా న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ భూములు సీలింగ్ సర్ప్లస్ పరిధిలోకి వస్తాయి. ఇందులో దాదాపు 74 ఎకరాలను సీలింగ్ సర్ప్లస్ కింద ప్రకటించారు. మిగిలిన దానిలో దాదాపు 94 ఎకరాలు నవాబ్ మహ్మద్ వాజుద్దిన్ఖాన్కు చెందినది కాగా, ఆయన 1967లో నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలకు పార్టిషన్ డీడ్ చేశారనేది ఆయన వారసుల వాదన. ఆ మేరకు వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే ఈ భూముల్లో ప్రొటెక్టెడ్ టెనెంట్స్ కింద 44 మంది తాము జీ ఈశ్వరయ్య నుంచి కొనుగోలు చేశామని వాదిస్తూ న్యాయపరంగా పోరాడుతున్నారు. ఇటీవల దీనిపై హైకోర్టు తీర్పు వచ్చిందని ఆ మేరకు శంషాబాద్ తహసీల్దార్ రవీంద్రదత్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న వాజుద్దిన్ వారసులకు ఈ భూమి చెందుతుందంటూ ప్రొసీడింగ్స్ జారీచేశారు. ఇది 7/1958 సూట్ పరిధిలోకి వస్తుందని, ఫైనల్ డిక్రీ కూడా ఉండటంతోపాటు ఇందులో ప్రొటెక్టెడ్ టెనెంట్స్ లేరని ఉత్తర్వుల్లో నిర్ధారించారు.
వాస్తవంగా శంషాబాద్ తహసీల్దార్ ఈస్థాయిలో తన పరిధి దాటి, నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరించడంతో శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్ అధికారులు చెప్తున్నారు. పైగా ఉన్నతాధికారులకు తెలవకుండా ఈ వ్యవహారం జరిగిందనడంలో అనుమానాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అయితే సస్పెండ్ చేయాల్సిన విషయంలో కేవలం బదిలీ చేసి వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు వేయాలంటే అందులో కారణాలు చూపాలి. ఈ క్రమంలో ‘ముఖ్య’నేత ప్రధాన అనుచరుడు తెరపైకి రావాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏసీబీ విచారణలోనూ ఎలాంటి నివేదికలు రూపొందించడంగానీ, రెవెన్యూ శాఖకు నివేదిక ఇవ్వడంగానీ చేయలేదనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆ క్రమంలోనూ అన్ని విషయాలు బయటికొస్తే ‘ముఖ్య’నేత కోటరీకే నష్టం జరుగుతుందని భావించి, అందరూ తేలు కుట్టినట్టు మిన్నకుండిపోయారని స్పష్టమవుతుంది.
‘ఆవు చేలో మేస్తే… దూడ గట్టున మేస్తుందా?’ అన్నట్టు ప్రభుత్వ పెద్దల అనుచరులే రంగంలోకి దిగి భూ వివాదాల్లో దూరడం.. ఆపై ప్రభుత్వస్థాయిలో విచారణ జరిగినా అధికారులపై చర్యలు లేకపోవడంతోనే అధికార యంత్రాంగంలో విచ్చలవిడితనం పెరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ఇదే శంషాబాద్ తహసీల్దార్ రవీంద్ర దత్ కొన్నిరోజుల కిందట ఏకంగా పదెకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తికి ధారాదత్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 626/2లో 176.05 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో అటవీ శాఖ గెజిట్‌లో 626/2 కింద 166 ఎకరాల భూమి ఉన్నట్టుగా నమోదై ఉన్నది. 626/2లో మిగిలిన 10.05 భూమి ప్రభుత్వానిది. ఇందులో 9.05 ఎకరాలకు తజముల్ మొయినొద్దీన్ ఖాన్ అనే వ్యక్తికి డిక్రీ ఉన్నదని, అందులో ఒక గదితోపాటు చుట్టూ ప్రహరీ ఉన్నందున (వాస్తవానికి అందులో ఏమీ లేదు) అతనికే చెందుతుందని తేదీ, ఫైల్ నంబరు, ఏమీ లేకుండానే ఎండార్స్మెంట్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకోసం తెర వెనుక పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టు తెలిసింది. దీనిపై ఆరా తీస్తే.. స్థానిక ప్రజాప్రతినిధి అల్లుడు బినామీనే సదరు దరఖాస్తుదారుడిగా ప్రచారం జరుగుతున్నది. కాగా తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్‌మెంట్‌ను పట్టుకొని సదరు వ్యక్తి ఏకంగా అందులో కంటెయినర్ వేసి, లేఅవుట్ చేసి, అందమైన బ్రోచర్లు రూపొందించి చదరపు గజం రూ.30-40 వేలకు మార్కెట్లో ఉంచాడు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్, ఇతరులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడుతుందని ఇదే తహసీల్దార్ హైడ్రాకు ఫిర్యాదు చేసి, హైడ్రా యంత్రాంగం సహాయంతో దగ్గరుండి కంటెయినర్, ఇతర నిర్మాణాలను కూల్చివేయించారు. అంటే తహసీల్దార్ స్వయంగా ఉత్తర్వులు ఇస్తారు, ఆయనే హైడ్రాకు ఫిర్యాదు చేసి కూల్చి వేయించారంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి సీలింగ్ సర్ప్లస్ పరిధిలోకి వచ్చే భూములైనందున ఈ ప్రక్రియ అంతా ఆర్డీవో ట్రిబ్యునల్ చూసుకోవాల్సి ఉంటుంది. అత్యంత కీలకమైన విషయమేందంటే? భూ వివాదాలకు సంబంధించి టైటిల్ (యాజమాన్య హక్కులు)ను నిర్ధారించే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఇంత పెద్ద విస్తీర్ణంలో, ఏండ్ల తరబడి న్యాయవివాదంలో ఉన్న అత్యంత విలువైన భూములకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఉన్నతాధికారుల ద్వారా తహసీల్దార్ తన పరిధి మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. పైగా 44 మంది ప్రొటెక్టెడ్ టెనెంట్స్ కూడా న్యాయ పోరాటం చేస్తున్నందున వివాద పరిష్కారంలో భాగంగా కనీసం వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేయడం సహజ న్యాయసూత్రం. కానీ ఇవేవీ పట్టించుకోకుండా.. ఉన్నతాధికారుల పాత్రను సైతం తనే పోషించి ఏకంగా 94 ఎకరాల టైటిల్, రికార్డుల మార్పును తన భుజాన వేసుకొని తహసీల్దార్ దత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంత పెద్ద విస్తీర్ణంలో దాదాపు రూ.700-800 కోట్ల విలువైన భూములపై ఉత్తర్వులు రావడంతో విషయం కాస్తా ‘ముఖ్య’నేత దృష్టిలో పడింది. ఈ ‘బిగ్’ వ్యవహారాన్ని ఎవరు నడిపారని ప్రాథమికంగా ఆరా తీస్తే తన సోదరులు దీని వెనుక ఉన్నట్టుగా ‘ముఖ్య’ నేత తెలుసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో సోదరులను వాకబు చేయగా, అలాంటి దానిలో తమ పాత్ర ఏమీలేదని వాళ్లు నిర్ధారించడంతో ‘ముఖ్య’నేతకు అనుమానం వచ్చింది. ప్రభుత్వంలోని ఇతర పెద్దలెవరైనా తనకు తెల్వకుండా తన సోదరుల పేరు చెప్పి తహసీల్దార్‌తో ఈ పని చేయించారనే నిర్ణయానికొచ్చి ఏసీబీని రంగంలోకి దింపినట్టు తెలిసింది. రెండురోజుల పాటు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించడంతో పాటు తహసీల్దార్‌ను విచారించగా దిమ్మతిరిగే, ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. వేరెవరో కాదు… సాక్షాత్తూ ‘ముఖ్య’నేతకు అత్యంత సన్నిహితుడైన మైనార్టీ నేత, ఒక సొసైటీ వైస్ చైర్మన్ ఈ తతంగాన్ని నడిపినట్టు వెల్లడైంది. తహసీల్దార్‌తో మంతనాలు జరిపే క్రమంలో సదరు మైనారిటీ నేత బిగ్ బ్రదర్స్ పేరును వాడటంతోపాటు భవిష్యత్తులో ఏం జరిగినా.. తాను ప్రభుత్వపరంగా అన్నిరకాల రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. దీంతోపాటు పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టు కూడా సమాచారం వస్తుంది. కాగా పూర్తి సమాచారం ‘ముఖ్య’నేతకు చేరడంతో తన కోటరీలోని వాళ్లే ఒకరి పేరు ఒకరు చెప్పుకొని వ్యవహారాన్ని నడిపిస్తున్నారని తెలిసి, విషయం బయటికొస్తే బాగుండదని గుట్టుగా ఉంచినట్టు తెలుస్తున్నది.