న్యూఢిల్లీ: దేశంలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాల కోసం ఒకే విధమైన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఉదంతం నేపథ్యంలో పరీక్షా విధానాల్లో సంస్కరణలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి అధికారులు ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించే పరీక్షల్లో సంస్కరణల కోసం ఈ కమిటీ ఒక సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకురానున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే జేఈఈ, నీట్ వంటి పరీక్షలను ఒకే ఫ్రేమ్‌వర్క్ కింద నిర్వహించవచ్చు. ఈ ఆలోచనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు మద్దతు తెలిపారు.