నాదర్గుల్.. మంచిరేవుల.. గోపన్‌పల్లి.. పుప్పాలగూడ.. వట్టినాగులపల్లి.. శామీర్‌పేట.. ఫోర్త్‌సిటీ.. ఇలా ఒక్క చోటు అని కాదు! ప్రభుత్వ భూములు.. ప్రైవేట్ భూములు.. దేవాదాయ భూములు.. వక్ఫ్ భూములు.. అసైన్డ్ భూములు.. అదీ ఇదీ అనే తేడా లేదు. నగరం చుట్టూ విలువైన భూములపై పెద్దలు గద్దల్లా వాలుతున్నారు. రేపనేది ఉన్నదో.. లేదో? అనే పద్ధతిలో భూములను చెరబట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు. కత్తులు నూరుతున్నారు. దీంతో తెలంగాణలో భూ దందా మాఫియాగా మారుతున్నది. తెర వెనుక, తెర ముందు సర్కార్ పెద్దలే సూత్రధారులై, పాత్రధారులై గురి పెడుతుండటంతో వాళ్ల సోదరులు, బంధువులు, చివరికి ప్రధాన అనుచరులు సైతం పోటీపడి మరీ భూములను కబ్జా పెడుతున్నారు. ప్రైవేట్ భూ వివాదాల్లోనూ తలదూర్చి అధికారులను నయానో, భయానో దారికి తెచ్చుకొని రాత్రికిరాత్రే రికార్డులను తారుమారు చేస్తున్నారు. ఇది ఎక్కడిదాకా పోయిందంటే, ఆశ అత్యాశై, అత్యాశ పేరాశై, పేరాశ దురాశై చివరికి తమ అనుకున్న వాళ్లను తామే మోసం చేసేంతవరకు! రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యగా మారేంత వరకు! రాజకీయంగా ఒకరి పదవులు ఒకరు ఊడగొట్టేలా వార్తలు వేయించుకునేంత వరకు! ఏకంగా నకిలీ జీవోలు జారీ చేసేంతవరకు! ఒకరి పేరు చెప్పుకొని మరొకరు సాగిస్తున్న రియల్ దందాలు బూమరాంగై బజారుకు ఎక్కుతున్నాయి.
మొన్నటికి మొన్న మంత్రి కొండా సురేఖ కూతురు ఇచ్చిన క్లూతో మంచిరేవుల భూ కుంభకోణం బయటపడగా, దాని సైడ్ ఎఫెక్ట్ పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు వడదెబ్బలా తాకింది. ఆయన మీద ముఖ్యనేత సన్నిహిత మీడియా దుమ్మెత్తి పోసేంతవరకూ వెళ్లింది. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామ పరిధిలోనూ అంతకంటే పెద్ద విచిత్రం జరిగింది. అక్కడ ఏకంగా 94 ఎకరాల భూ వివాదం కాస్తా ముఖ్యనేత సోదరులు, వారి అనుచరుల నడుమే చిచ్చు పెట్టింది. వాస్తవానికి మొదట్లో పెద్దలంతా కలిసి దందా మొదలు పెట్టినా, తర్వాత పక్కవాడికి వాటాలిస్తే నాకేమొస్తది? అనే స్వార్థం పుట్టి, ఆశతో ఒకరికి తెలియకుండా ఒకరు దందాలు మొదలుపెట్టారు.
ఇపుడా ఆ దశ కూడా దాటిపోయి ఆశ దురాశగా మారింది. దుర్బుద్ధి తోడైంది. తాము భూదందాలు చేస్తూ దాన్ని వివిధ మాధ్యమాల ద్వారా ఇతరుల మీదికి తోసివేయడం మొదలైంది. ఒకరికి తెల్వకుండా ఒకరు విచ్చలవిడిగా భూ దందాలు చేస్తుండటంతో, ఏది ఎవరు చేశారో క్లారిటీ లేక, వేరే ఇంకెవరైనా చేశారేమో అనుకొని, తహసీల్దార్ మీద ఏసీబీ దాడి చేయిస్తే, తీరా ఆ దందా చేసింది తమ ప్రధాన అనుచరుడేనని బయటపడింది. దీంతో చప్పున నాలిక కరుచుకొని, గమ్మున నోరుమూసుకొని డాక్యుమెంట్లు మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. భూ దందాల దౌర్జన్యం ఎక్కడిదాకా పోయిందంటే, వక్ఫ్ భూముల కోసం పోరాడుతున్న ఓ న్యాయవాదిని పట్టపగలు హైదరాబాద్‌లో కారుతో గుద్ది చంపేశారు. దీని వెనుక కాంగ్రెస్ నేత హస్తం ఉన్నదని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ భూ మాఫియా దౌర్జన్యం ఎక్కడిదాకా వెళ్తుందో, ఇంకా ఏ విపరిణామాలకు దారి తీస్తుందో!
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌పై ముఖ్యనేతకు చెందిన మీడియా ఎందుకు దాడి చేస్తున్నది? ఆయన ఒక విఫల అధ్యక్షుడని (డిజాస్టర్ ప్రెసిడెంట్), ఆయనది ఫ్లాప్ షో అంటూ ఘాటుగా కథనాలు ప్రసారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతిపక్షాలను మించి సొంత పార్టీ అధ్యక్షుడిని టార్గెట్ ఎందుకు చేస్తున్నట్టు? ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. దీనిపై లోతుగా ఆరా తీయగా మంచిరేవులలో వెలుగులోకి వచ్చిన భూకుంభకోణమే కారణమని తేలింది. ఈ వివాదానికి కూడా ఆ 16 ఎకరాలే కేంద్ర బిందువనే విషయం బయటికొచ్చింది. ఇప్పటికే సినిమాను మించిన ట్విస్టులతో సాగిపోతున్న వేణుగోపాలస్వామి ఆలయ భూకుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంలో ఇప్పటికే బిగ్ బ్రదర్స్, ముఖ్యనేతతోపాటు జూబ్లీక్లబ్ పెద్దలు, ఓ టీవీచానల్ యజమాని, దేవాదాయ శాఖ మంత్రి, హెచ్ఎండీఏ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాత్రధారులుగా ఉండగా.. తాజాగా నార్సింగి ఏసీపీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పాత్రలూ వచ్చి చేరాయి. కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ముఖ్యనేత, టీపీసీసీ చీఫ్ మధ్య ఈ కుంభకోణం అగ్గి రగల్చిందని, ఉప్పు, నిప్పులా మార్చేసిందనే ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘గన్ గేమ్.. పేలిన భూస్కామ్’ వరుస కథనాలు ప్రభుత్వంలో, పార్టీలో సంచలనంగా మారాయి. ఆ వివరాలు తెలియాంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
మంచిరేవులలోని 293 సర్వే నంబర్లో ఉన్న ఆలయ భూముల్లోని 12.13 ఎకరాల భూమిపై వివాదం ఉన్న సంగతి తెలిసిందే. సంజీవరెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ 2018లో దేవాదాయ శాఖ ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. అకస్మాత్తుగా 2024 డిసెంబర్లో దేవాదాయ శాఖ అధికారులు ట్రిబ్యునల్‌లో కేసును ఉపసంహరించుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత 2025 డిసెంబర్లో దేవాదాయ శాఖ అధికారులు సంజీవరెడ్డి కుటుంబంపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ కుటుంబానికి చెందిన పలువురు సభ్యులను ఒక రోజంతా స్టేషన్లోనే ఉంచినట్టు తెలిసింది. ఇలా ఎందుకు చేశారని ఆరా తీయగా.. బిల్డర్‌తో జరిగిన ఒప్పదంలో భాగంగా ఏపీసీ తన పని మొదలుపెట్టినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే కాసులవేటలో భాగంగా 30 ఫీట్ల రోడ్డును 100 ఫీట్ల మాస్టర్‌ప్లాన్ రోడ్డుగా మార్చి, దాన్ని అష్టవంకరలు తిప్పి మొత్తం 114 ఎకరాల దేవాదాయ భూమిని కొట్టేసేందుకు స్కెచ్ వేసిన బిగ్ బ్రదర్స్‌కు నార్సింగ్ ఏపీసీ వ్యవహారం తెలిసిందట.
ఏసీపీ స్థాయి అధికారి నేరుగా రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చి, ఆయన కొడుకుకు సంబంధించిన కంపెనీ పేరు మీద 16 ఏకరాల భూమి డెవలప్మెంట్ ఒప్పందం చేసుకోవడం బిగ్ బద్రర్స్‌కు మింగుడు పడనట్టు సమాచారం. ఏసీపీ ఇంత ధైర్యం ఎలా చేశారని ఆరా తీయగా ఆయన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు బావ అని తేలిందట. దీంతో వారు నేరుగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పిలిపించి 16 ఎకరాల భూమి జోలికి రావద్దని హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బిల్డర్‌తో చేసుకున్న ఒప్పంద పత్రాలను కూడా తమకు అప్పగించాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇది జరిగిన కొన్నిరోజులకే నార్సింగి ఏపీసీ దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో బిగ్‌బ్రదర్స్ ఆగడాలను టీపీసీసీ చీఫ్ నేరుగా ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్తున్నారు. అయినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో అంతర్గతంగా రగిలిపోయినట్టు సమాచారం.
వాస్తవానికి ఏడాదికాలంగా ముఖ్యనేతకు, టీపీసీసీ చీఫ్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. బీసీ వాదం బలపడుతున్న నేపథ్యంలో బీసీ నాయకుడిగా తనకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని మహేశ్‌కుమార్‌గౌడ్ పలు సందర్భాల్లో ప్రస్తావించినట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. దీంతో మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు పక్కలో బల్లెంలా మారారని ముఖ్యనేత భావించారని, అప్పటినుంచి ఆయన్ను రాజకీయంగా తొక్కడం మొదలుపెట్టారని ప్రచారం జరుగుతున్నది. మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదని చెప్తున్నారు. దీనికితోడు మంచిరేవులలో తన బంధువుల భూమినే లాక్కోవడం, తనకే వార్నింగ్ ఇవ్వడాన్ని మహేశ్‌కుమార్‌గౌడ్ సీరియస్‌గా తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నది. మొత్తం నాలుగు అంశాలపై సమగ్రంగా వివరాలు సేకరించి అధిష్టానానికి నివేదికలు పంపినట్టు ముఖ్యనేత వర్గం అనుమానిస్తున్నది. ముఖ్యనేత, ఆయన సోదరుల వ్యవహారశైలితోపాటు మంచిరేవులలోని 293 సర్వేనంబర్‌లో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయ భూములను కొల్లగొట్టేందుకు బిగ్‌బ్రదర్స్ వేసిన స్కెచ్, అసలు కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి వలస కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇండ్లను కూల్చి భూములను ఆక్రమించేందుకు చేసిన కుట్రలు, పాలనాపరమైన వైఫల్యాలతో యువత, రైతులు పార్టీకి దూరం అవుతున్న తీరుపై సమగ్ర వివరాలతో అంతర్గత నివేదికలు తయారుచేసి, ఢిల్లీ పెద్దలకు పంపినట్టు ముఖ్యనేత వర్గం భావిస్తున్నదట. ఇదే సమయంలో నమస్తే తెలంగాణలో ‘గన్గేమ్.. పేలిన భూస్కామ్’తో మొదలైన వరుస కథనాల క్లిప్పులను కూడా టీపీసీసీ చీఫ్ అధిష్టానానికి నివేదించినట్టు ముఖ్యనేత క్యాంపు కలవరపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మహేశ్‌కుమార్‌గౌడ్‌పై ముఖ్యనేతకు చెందిన మీడియా ఎదురుదాడిని ప్రారంభించిందని, ఆయన్ను టార్గెట్చేస్తూ ‘బిగ్’ కథనాలు వండి వార్చిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మంచిరేవులలోని 16 ఎకరాలకు రోడ్డు వ్యవహారం ఓ టీవీచానల్ యజమాని ద్వారా మంత్రికి చేరిందని, అక్కడే ‘భూమికి భూమి’ ప్రతిపాదికన ఫైల్ సిద్ధమైందని, బిగ్‌బ్రదర్స్ ఫిర్యాదు మేరకు ముఖ్యనేత ఆ ఫైల్‌ను నిలిపివేయించారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే భూమిలో జూబ్లీక్లబ్ పెద్దలు రెసిడెన్షియల్ టవర్స్ నాటకం ఆడటం మరోకోణం. ఇందులోకి మహేశ్‌కుమార్‌గౌడ్ ఎక్కడి నుంచి వచ్చారో? తెలుసుకోవాలంటే ఇంకా ముందుకెళ్లాలి. ఆలయ భూముల నుంచి తన 16 ఎకరాలకు రోడ్డు తీయడానికి బిల్డర్ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పటి నార్సింగి ఏసీపీని కలిసినట్టు సమాచారం. మంచిరేవుల నార్సింగి ఏసీపీ పరిధిలోకి వస్తుండటం, ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు బావ కావడంతో తన పని అవుతుందని బిల్డర్ భావించారట. ఏసీపీ ద్వారా అయితే అటు పోలీస్ అండ, ఇటు అధికార పార్టీ అధ్యక్షుడైన ఆయన బామ్మర్ది ద్వారా రాజకీయ అండ దొరుకుతుందని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు బిల్డర్ 30 ఫీట్ల రోడ్డు ప్రణాళికను ఏసీపీకి వివరించినట్టు సమాచారం. దీనికి ఏసీపీ సమ్మతించారని, ఇందుకు ప్రతిఫలంగా తన కొడుకుకు సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీకి ఆ 16 ఎకరాలు డెవలప్మెంట్కు ఇచ్చేలా ఒప్పదం కుదిరిందని తెలిసింది.