దేవరుప్పుల, జూన్ 22: ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పక్షం రోజులైనా మరమ్మతు చేయకపోవడంతో పంటలకు నీరందని దుస్థితి మండల కేంద్రంలో నెలకొంది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేస్తే పంపుసెట్లు పనిచేసేవని, విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో వరినార్లు ఎండిపోతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరుప్పులలోని గడ్డ చెలుకకు వెళ్లే దారిలో ఎస్ఎస్ 39 నంబర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పక్షం రోజులైంది. దీంతో ఐదుగురు రైతులకు చెందిన సుమారు 15 ఎకరాలకు మోటర్ల ద్వారా నీరు పెట్టలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు దున్నిన దుక్కులు ఎండుతున్నా యని, నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో వారం రోజుల క్రితమే తామే స్వయంగా ట్రాన్స్ఫార్మర్ను సింగరాజుపల్లిలోని రిపేరింగ్ సెంటర్‌కు తరలించినట్లు వారు తెలిపారు. దీనిపై పలుమార్లు విద్యుత్ అధికారులను సంప్రదించగా వస్తదని చెప్పి పంపుతున్నారు తప్ప పరిష్కారం కావడం లేదని పలువురు వివరించారు. కేసీఆర్ పాలనలో ట్రాన్స్ఫార్మర్ కాలిన వెంటనే మరొకటి అమర్చేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనికి భిన్నంగా ట్రాన్స్ఫార్మర్ కాలితే మరొకటి రావడానికి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ట్రాన్స్ఫార్మర్ విషయమై ఏఈ సుధాకర్‌ను వివరణ కోరగా రెండు రోజుల్లో కొత్తది తెచ్చి బిగిస్తామని వివరించారు.
ఇప్పట్ల రాదని చెప్పిండ్రు..
ఎన్నోసార్లు ఆఫీసుకు పోయి ట్రాన్స్ఫార్మర్ కోసం అడిగితే రెండు రోజుల్లో వస్తుందని చెప్పి పంపిస్తుండ్రు. శనివారం మరోసారి పోతే ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ నంబర్ ఇచ్చారు. అక్కడికి ఫోన్ చేసి విషయం అడిగితే ఇప్పట్ల రాదన్నరు. నారుమడి, దున్నిన దుక్కి ఎండింది. 15 రోజుల నుంచి నీరు లేక వానకాలం నాట్లు ఆలస్యమైతయి. రెండు నెలల కింద ఒకసారి కాలింది. వారం రోజులకు ఇచ్చిండ్రు. నెల కింద మళ్ల కాలింది. 15 రోజుల నుంచి సాగు నీళ్లు లేక తిప్పలు పడుతున్నం.
– సుంకరబోయిన యాదయ్య, రైతు
బకీట్లల్ల నీళ్లు మోసుకొస్తున్నం..
ట్రాన్స్ఫార్మర్ కాలి 15 రోజులైతున్నది. నార్లు ఎండితున్నయ్, దుక్కులు పక్కున పలిగినయ్. వానకాలం నెత్తిమీదికి వచ్చింది. నార్లు పోసినం. నీళ్లు లేక నాట్లు లేటయితున్నయ్. ఇక రెండు ఆవులకు తాగడానికి నీళ్లు లేకుంటె దూరం నుంచి బకీట్లల్ల తెచ్చి తాపుతున్నం. కరెంటాఫీసు చుట్టు తిరిగి తిరిగి యాష్టకొస్తాంది. దబ్బున కొత్తది తెచ్చి ఫిట్ చేస్తే దుక్కులు దున్నుకుంటం. ఎన్నడు లేంది కరెంటోళ్లు ఇంత ఆలస్యం చేస్తుండ్రు. – వల్లాల ఎల్లయ్య, రైతు