వందల ఏండ్ల క్రితమే అద్భుతంగా రాజధానుల నిర్మాణం
ఆ కాలంలోనే ఇంజినీరింగ్ నైపుణ్యం వినియోగం
సుబేదారిలో ప్రత్యేకంగా ఉన్నత స్థాయి అధికారుల వ్యవస్థ
వరంగల్, హనుమకొండ జిల్లాలతో మరోసారి గుర్తింపు
వరంగల్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక నేపథ్యం, వారసత్వ సంపద, సాంస్కృతిక వైభవం.. ఇలా అన్నింటికీ నెలవైన వరంగల్, హనుమకొండ ప్రాంతాలు వందల ఏండ్ల క్రితమే గొప్ప నగరాలుగా వర్ధిల్లాయి. కాకతీయుల పాలనలో ఈ రెండు రాజధానులుగా ఉండగా రాజ్యరక్షణ కోసం కోటలు, ఆచారాలకు అనుగుణంగా వందలాది ఆలయాలు, రహస్య మార్గాలు, సైనిక స్థావరాలు, ప్రజల అవసరాలకు తగినట్లు వసతులతో ఆ రోజుల్లోనే గొప్ప ఇంజినీరింగ్ నైపుణ్యంతో అందుబాటులో ఉన్నాయి. ఇలా సుబేదారిలో ఉన్నత స్థాయి అధికారి వ్యవస్థతో ప్రత్యేకంగా నిలిచిన ఈ ప్రాంతాలకు నేడు స్వరాష్ట్రంలో మళ్లీ అదేస్థాయి గుర్తింపు వచ్చి పరిపాలనా కేంద్రాలుగా మారాయి.
దేశంలోనే గొప్ప నగరాలుగా వెలుగొందిన హనుమకొండ, వరంగల్ నగరాలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అంతేస్థాయిలో గుర్తింపు ఇచ్చింది. ప్రజల అవసరాల ను తీర్చే విధానాలను అమలుచేసిన కాకతీయుల హ యాంలో రాజధానులుగా ఉన్న వరంగల్, హనుమకొండ పేర్లతో జిల్లాలను ఏర్పాటుచేసింది. అప్పుడు హ నుమకొండ ఆ తర్వాత వరంగల్ కాకతీయుల రాజధానిగా ఉండేది. ఇప్పుడు రెండు ప్రాంతాలు జిల్లా కేంద్రా లయ్యాయి. ఇలా ఒకేసారి వరంగల్, హనుమకొండ పరిపాలనా కేంద్రాలుగా మారి ప్రత్యేకంగా నిలిచాయి.
వరంగల్..
కాకతీయుల రాజధానిగా వరంగల్(ఓరుగల్లు)కు గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. దాదాపు 300 ఏండ్ల కాకతీయుల పరిపాలన కాలంలో 250 ఏండ్ల పాటు వరంగల్ రాజధానిగా ఉన్నది. కాకతీయుల పరిపాలన ఇప్పటికీ మనకు కండ్లకు కట్టినట్లు వరంగల్‌లో కనిపిస్తుంది. విశాలమైన వరంగల్ ఖిల్లా అప్పటి కాకతీయుల చరిత్రను మనకు తెలియజేస్తోంది. కాకతీయుల రాజు రెండవ ప్రోలరాజు 1116-1157 కాలంలో పరిపాలన సాగించారు. కాకతీయలు మొదటి రాజధాని హనుమకొండ. ప్రోలరాజు హయాంలోనే రాజధాని వరంగల్‌కు మారింది. రాజధానిని మార్చింది ప్రోలరాజు అయినా గణపతి దేవుడు ఓరుగల్లును పూర్తిస్థాయిలో రాజధానిగా నిర్మించారు. గణపతి దేవుడు 1199-1262 సంవత్సరాల్లో పరిపాలన సాగించారు. గణపతిదేవుడు చేపట్టిన కొన్ని నిర్మాణాలను రుద్రమదేవి పూర్తి చేసింది. 1262-1289 సంవత్సరాలలో రుద్రమదేవి వరంగల్ కేంద్రంగా పరిపాలన సాగించారు. ఈమె హయాంలోనే సమగ్రంగా వసతుల కల్పన జరిగింది. హనుమకొండ నుంచి వరంగల్‌కు మార్చిన తర్వాత రాజధాని నగరాన్ని ఆధునిక వసతులతో గొప్ప ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించారు. రాజధానిలో రాజులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది నివాసాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. ఇతర రాజ్యాల దండయాత్రలను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఏడు వరుసల్లో కోట నిర్మించారు.
అప్పటి ఆచారాలకు అనుగుణంగా శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ ఆలయాలను నిర్మించారు. ఆ రోజుల్లోనే ఆధునిక పద్ధతిలో డ్రైనేజీ వ్యవస్థను, రాజధాని అవసరాలను తీర్చేలా మెట్లబావులను అద్భుతంగా నిర్మించారు. ఇతర ప్రాంతాలతో రాజధానికి సరుకుల రవాణాకు అనుగుణంగా రహదారి మార్గాన్ని ఏర్పాటుచేశారు. కాకతీయుల కట్టడాలన్నీ ఇప్పటికీ వరంగల్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఖిలాలోనే వందల ఆలయాలు ఉంటాయి. ఇండ్ల నిర్మాణాల పునాదులు, రాజ్యరక్షణ కోసం నిర్మించిన కోట, రహస్య మార్గాలు, సైనికుల స్థావరాల నిర్మాణాల ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. అన్ని వసతులు, హంగులతో నిర్మించిన ఓరుగల్లు ఖిలాను అత్యాధునిక రాజధానిగా చరిత్రకారులు విశ్లేస్తుంటారు. ‘కాకతీయ సామ్రాజ్య రాజధాని సప్త ప్రక్రా పరివేష్టితమైన కోటలకు నిలయం’ అని అంటారు. అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్.. కాకతీయుల తర్వాత కూడా అదే గుర్తింపుతో కొనసాగుతోంది. కాకతీయుల తర్వాత వచ్చిన రాజుల పాలనలోనే వరంగల్ పరిపాలనా కేంద్రంగా ఉన్నది. నిజాం రాజుల హయాంలోనూ ప్రాంతీయ పరిపాలన వరంగల్ నగరంలోనే ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలోనే గాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోనూ వరంగల్ ప్రాధాన్యం సంతరించుకున్నది.
హనుమకొండ..
కాకతీయుల రాజధానిగా హనుమకొండకు చారిత్రకంగా గుర్తింపు ఉన్నది. హనుమకొండను మొదట్లో ఆరామకొండ అనేవారు. వాడుక భాషలో మార్పులతో తర్వాత అదే అన్మకొండ, హనుమకొండ, హన్మకొండగా మారింది. కాకతీయుల హయాంలో దాదాపు 50 ఏండ్ల పాటు హనుమకొండ రాజధానిగా ఉన్నది. కాకతీయుల రాజు రుద్రదేవుడు 1257-1299 వరకు హనుమకొండ రాజధానిగా పరిపాలన సాగించాడు. అప్పుడే హనుమకొండ గొప్ప నగరంగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. కాకతి రుద్రదేవ మహారాజు వేయించిన వేయిస్తంభాల గుడి శాసనం చారిత్రకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది. 1163 సంవత్సరం(చిత్రభాను)లో మాఘశుద్ధ త్రయోదశి శనివారం రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులను ప్రతిష్ఠించి త్రికూటాలయాన్ని నిర్మించాడు. ఆ దేవతల పూజా నైవేద్యాలకు మద్దిచెరువుల గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. కాకతీయ సామ్రాజ్య రాజధాని హనుమకొండ గురించి, అకడ నివసించే ప్రజల గురించి, రుద్రదేవుని అశ్వికబలాన్ని గురించి ఈ శాసనంలో ఎన్నో విషయాలు పేర్కొన్నారు. శివుని విలాసాలతో కూడిన అలకాపురి, మన్మథుడి నగరం, రంభాది దేవతలు, విష్ణువు, జిష్ణువు(ఇంద్రుడు)లతో కూడిన ఇంద్రనగరి వలె హనుమకొండ విలాసవంతంగా, దేవతలు నివసించేలా ఉన్నదని వర్ణించారు. యుద్ధ సమయాల్లో చతురంగ బలాల్లో అశ్వదళం ఎంతో ప్రసిద్ధమైంది. ఆ కారణంగా కాకతీయులు వందల కొద్దీ గుర్రాలను పోషించేవారు. ‘విష్ణుమూర్తి నివాసమైన ఆకాశాన్ని, గోవుతో సమానమైన భూమిని, పాదాలతో తాకకుండా.. అంటే పాదాలు నిలపనంత వేగంగా రుద్రదేవ మహారాజు గుర్రాలు ఉండేవని వర్ణించారు.
వేయిస్తంభాల ఆలయం నిర్మించే సమయంలో పెద్ద బండరాళ్లను, శిల్పాలను తరలించేందుకు ఏనుగులును వినియోగించారు. ఆ ఏనుగులను వరంగల్ చౌరస్తా ప్రాంతంలో నిలిపేవారు. అలా ఆ ప్రాంతానికి ఏనుగులగడ్డ అని పేరు వచ్చింది. కాకతీయుల నిర్మాణాల్లో ఎక్కువగా హనుమకొండలోనే ఉన్నాయి. వెయ్యి స్తంభాల ఆలయం, అగ్గలయ్యగుట, సిద్ధేశ్వర, పద్మాక్షీ ఆలయాలు, మెట్టుగుట్టతో పాటు అప్పటి జీవనశైలి విషయాలను తెలిపే అనేక నిర్మాణాలు హనుమకొండలోనే ఉన్నాయి. కాకతీయుల తర్వాత క్రమంగా హనుమకొండకు ప్రాధాన్యత తగ్గింది. నిజాం రాజుల హయాంలో వరంగల్ నగరం కీలక ప్రాంతంగా ఉన్నది. ప్రాంతీయ పరిపాలనా కేంద్రం వరంగల్ నగరం అయినా కార్యాలయాలన్నీ హనుమకొండలోనే ఉండేవి. సుబేదారి ప్రాంతంలోనే ఉన్నత స్థాయి అధికారుల వ్యవస్థ ఉండేది. నిజాం హయాంలో ప్రాంతీయ పరిపాలకులుగా సుబేదార్ పని చేసేవారు. అలా ఆ ప్రాంతానికి సుబేదారి అని పేరు వచ్చింది. సుబేదారిలోనే ఆ తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఇతర అధికారుల ఆఫీసులు కొనసాగాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వంలో హనుమకొండకు మరోసారి పూర్తిస్థాయి పరిపాలనా కేంద్రంగా గుర్తింపు వచ్చింది. హనుమకొండ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ఏర్పాటు చేసింది.
పూర్వవైభవం..
హనుమకొండ, వరంగల్ జిల్లాల పేర్ల మార్పుతో రెండు చారిత్రక ప్రాంతాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుంది. హనుమకొండకు చారిత్రకంగా, సాంసృతికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఇన్నేండ్లు వరంగల్‌లో ఒక భాగంగానే మిగిలిపోయింది. ఇప్పుడు జిల్లాల పేరు మార్పుతో కాకతీయ తొలి రాజధానిగా ఉన్న హనుమకొండకు పూర్వవైభవం వస్తుంది. వరంగల్ రూరల్ పేరును వరంగల్‌గా మార్చడం చారిత్రక నగరం గుర్తింపును కొనసాగించినట్లు అవుతోంది.