TGMC | మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో ఓ బాలుడికి వేసిన ఇంజక్షన్ వికటించిన ఘటనపై తెలంగాణ వైద్య మండలి తీవ్రంగా స్పందించింది. ఇటీవల మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందిన 14 ఏళ్ల బాలుడు ఇంజక్షన్ వేసిన కొద్ది సేపటికే మృతి చెందాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ వైద్య మండలి.. సంబంధిత దవాఖాన నిర్వాహాకులకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై తెలంగాణ వైద్య మండలి అధికారులు రిజిస్ట్రార్ డాక్టర్ డీలాలయ్య, డాక్టర్ మహేష్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. చికిత్స అందించిన డాక్టర్ పీ వికాస్, కన్సల్టెంట్ డాక్టర్ బాల్నే పూర్ణిమ, బాలాజీ నర్సింగ్ హోమ్ మెడికల్ డైరెక్టర్ లకు నోటీసులు జారీ చేశారు. ఈ ముగ్గురూ వారం రోజుల్లోగా వ్యక్తిగతంగా హాజరై లిఖిత పూర్వక వాంగ్మూలం, బాలాజీ నర్సింగ్ హోమ్ అనుమతిపత్రాలు, డాక్టర్ల నమోదిత ధృవపత్రాలు (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు) సమర్పించాలని ఆదేశించారు.
నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీజీఎంసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ శ్రీనివాస్ హెచ్చరించారు. కొంత మంది మెడికల్ స్టోర్ల యాజమాన్యులు నకిలీ వైద్యులను నియమించుకుని లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం, అవసరం లేని వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయడం,అక్రమ గర్భస్రావాలు (అబార్షన్లు) ప్రోత్సహించడం, నకిలీ వైద్యులకు బహుమతులు, విహారయాత్రలు, కమిషన్లు ఇవ్వడం,వంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. అటువంటి నమోదిత వైద్యుల (రిజిస్టర్డ్ డాక్టర్ల)పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నకిలీ వైద్యులపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసి)చట్టం ప్రకారం తెలంగాణ వైద్య మండలి కేసులు నమోదు చేస్తోంది. బాధితులు ఫిర్యాదు చేయడానికి antiquackerytsmc@onlinetsmc.in. అనే ఈ-మెయిల్‌కు ఫిర్యాదు చేయాలి. వాట్సాప్ నంబర్: 9154382727కు ఫిర్యాదు అందించాలి. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంటాయని టీటీఏంసీ ప్రజాసంబంధాల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ కుమార్ వెల్లడించారు.