వరంగల్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తు నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 300 మందిని తరలించేందుకు అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు నియోజకవర్గానికో ఆరు ఆర్టీసీ బస్సులను సమకూర్చే పనిలో తలమునకలయ్యారు. సమన్వయం కోసం శాసనసభ నియోజకవర్గానికి, ఆర్టీసీ బస్సుకో నోడల్ అధికారిని నియమించారు. ఆయా మండల కేంద్రం నుంచి ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్గమధ్యంలో భువనగిరి ప్రాంతంలో లంచ్, డిన్నర్‌కు ఏర్పాట్లు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రపంచమే అబ్బురపడేలా ఉండాలని ఆయన సూచించారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే గొప్పగా, అంబేద్కర్ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండాలని మంత్రులు, అధికారులకు స్పష్టం చేశారు.
కార్యక్రమానికి అంబేద్కర్ ముని మనువడు ప్రకాశ్ అంబేద్కర్‌ను ముఖ్య ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించారు. విగ్రహ ఆవిష్కరణ సభకు రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున ఆహ్వానించాలని ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకోసం అవసరమైన ఆర్టీసీ బస్సులను ముందుగానే బుక్ చేసుకోవాలని ఆదేశించారు. విగ్రహ ఆవిష్కరణ సభకు తీసుకొచ్చే వారికి బయల్దేరేటపుడు అల్పాహారం, హైదరాబాద్ చేరుకునేలోపే 50 కిమీ దూరంలోనే భోజనం ఏర్పాట్లు చేయాలని, సభ అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు కూడా రాత్రి భోజనం ఏర్పాట్లు చూసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. బస్సుల్లో వాటర్, సల్ల, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో పెట్టాలని అన్నారు. ఈ మేరకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సూచనల మేరకు ఏర్పా ట్లు చేయాలని చెప్పారు. అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్విని తానాజీవాకడే జిల్లాలోని అధికారులతో పలుమార్లు ఏర్పాట్లపై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నోడల్ అధికారుల నియామకం
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాలకు నోడల్ అధికారులను నియమించారు. వరంగల్ తూర్పు నోడల్ అధికారిగా వరంగల్ ఆర్డీవో మహేందర్‌జీ, నర్సంపేట నోడల్ అధికారిగా ఆర్డీవో శ్రీనివాసులు, వర్ధన్నపేట నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి కల్పన నియమితులయ్యారు. ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జిల్లా స్థాయి అధికారుల్లో బస్సుకు ఒకరిని నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు. తాసిల్దార్లు, ఎంపీడీవోలు వీరికి సహకరిస్తారు. బస్సుకు 50 మంది చొప్పున ప్రతి నియోజకవర్గం నుంచి 6 ఆర్టీసీ బస్సుల్లో 300 మందిని హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ప్రతి బస్సు వెంట నోడల్ అధికారితో పాటు ఒక పోలీసు కానిస్టేబుల్ ఉంటారు. వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ప్రాథమిక మెడిసిన్ కూడా ప్రతి బస్సులో ఉంచుతారు. బస్సులో ఒక ఏఎన్ఎం కూడా ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
14న ఉదయం బస్సు బయల్దేరే పాయింట్లను అధికారులు గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో మాత్రం మండల కేంద్రం నుంచి బయల్దేరేలా సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు బస్సు బయల్దేరే సమయంలో పాయింట్ వద్దే బ్రేక్‌ఫాస్ట్ సమకూర్చాలని, మార్గమధ్యంలో ఆలేరు, భువనగిరి మధ్యన వెళ్లేటప్పుడు లంచ్, తిరిగి వచ్చేటపుడు డిన్నర్ ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. లంచ్, డిన్నర్ ఒకేచోట పెద్ద హాలులో ఏర్పాటు చేసే పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. భోజన ఏర్పాట్ల ఇన్చార్జి బాధ్యతలను డీఆర్డీవో ఎం సంపత్‌రావుకు కలెక్టర్ అప్పగించారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు హైదరాబాద్‌లో జరిగే డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అరగంట ముందు 1.30 గంటల వరకు సభ స్థలానికి చేరుకునేలా అధికారులు ప్లాన్ చేశారు. ఆయా నియోజకవర్గం నుంచి విగ్రహ ఆవిష్కరణ సభకు హాజరయ్యే 300 మంది పేర్లతో జాబితాలు సిద్ధం అవుతున్నాయి.
నేడోరేపో నియోకజకవర్గ నోడల్ అధికారి ద్వారా బస్సుల నోడల్ అధికారుల చేతికి ఈ జాబితాలు అందనున్నాయి. ప్రతి బస్సు నోడల్ అధికారి, పోలీసు కానిస్టేబుల్ తమకు అందిన జాబితాలోని 50 మందిని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేర్చేవరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రతి నియోజకవర్గంలో అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కూడా అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్విని తాజాజీ వాకడే నియోజకవర్గం, బస్సుల నోడల్ అధికారులు, భోజనం ఏర్పాట్ల ఇన్చార్జితో పాటు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలైన అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై సమీక్షించారు.