జనగామ చౌరస్తా, ఆగస్టు 28 : వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ అన్నదాతలను ఆదుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఉచితంగా నిరంతర విద్యుత్ అందిస్తూనే ‘రైతుబంధు’లో ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తుండగా, రైతుబీమా పథకంతో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మృత్యువాతపడినా, సహజమరణమైనా కుటుంబానికి బీమా వర్తింప చేస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ 2018లో రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలోని 12 మండలాల్లో 407 రైతు కుటుంబాలకు రూ.20.35 కోట్లు అందించారు. ప్రస్తుతం ఈ పథకంలో 1,22,397 మంది రైతులుండగా, ఈ సంవత్సరం కొత్తగా 18,975 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయశాఖ ద్వారా ఎల్ఐసీకి ప్రీమియంను చెల్లిస్తుండడంతో అన్నదాతలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ఇంటిల్లిపాదికి ఆర్థిక ‘ధీమా’నిస్తుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులు దీనికి అర్హులు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ (ఎల్ఐసీ)కు ప్రీమియం చెల్లిస్తోంది. ఈ పథకంలో చేరిన రైతులు ఏ కారణంతోనైనా మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. అది కూడా వారం, పది రోజుల్లోనే ఎలాంటి ఫైరవీలు లేకుండా రైతు భాగస్వామి (నామినీ) లేదా కుటుంబీకుల బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి గత జూలై 10వ తేదీ నుంచి ఈ నెల ఆగస్టు 5వ తేదీ వరకు జిల్లాలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ‘బీమా’కు దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
దీంతో జిల్లా వ్యాప్తంగా 18,975 మంది రైతులు ‘రైతుబీమా’కు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఆయా మండల పరిధిలో పనిచేసే ఏఈవోలను సంబంధిత రైతులు నేరుగా కలిసి రైతుబీమా పథకానికి దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్‌లను వ్యవసాయశాఖ అధికారులకు అందజేశారు. జిల్లాలో కొత్త వారితో పాటు బీమా రెన్యూవల్ అయిన రైతులందరూ కలిపి ఈ ఏడాది మొత్తం 1,22,397 మంది అర్హత పొందారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయశాఖ ద్వారా ఎల్ఐసీకి ప్రీమియంను చెల్లించింది. ఈ నెల ఆగస్టు 14వ తేదీ నుంచి బీమాలో కొత్తగా చేరిన (ఎన్రోల్మెంట్), రెన్యువల్ అయిన రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. గత 2018 నుంచి 2022 వరకు ఈ ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా 407 రైతు కుటుంబాలు రూ.20 కోట్ల 35 లక్షల ఆర్థిక సాయం పొందారు. గుంట వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు కావడంతో క్షేత్రస్థాయిలో ‘బీమా’కు విశేష స్పందన లభిస్తుంది.
రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా..
‘రైతుబీమా’ పథకం వ్యవసాయదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న గొప్ప పథకం. రాష్ట్ర ప్రభు త్వం మరోసారి ఇచ్చిన అవకాశంతో ఈ ఏడాది జిల్లాలో కొత్తగా 18,975 మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. మొత్తం 1,22,397 మంది రైతులు బీమాకు అర్హత పొందారు. గత నెల 10 నుంచి ఈ నెల 5 వరకు రైతులు తమ మండల పరిధిలోని ఏఈవోలను సంప్రదించి దరఖాస్తు చేసుకున్నారు. బీమాకు అర్హత పొందిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వమే ఎల్ఐసీకి ప్రీమియాన్ని చెల్లించింది. ఈ నెల ఆగస్టు 14వ తేదీ నుంచి బీమా వర్తిస్తుంది.
–వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, జనగామ