ఖిలావరంగల్, ఏప్రిల్ 26 : గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 100 మందికి ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతిలోని వివిధ అంశాలపై ఎంపీడీవో, ఎంపీవోలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో లేబర్ మొబైలైజేషన్ ఇంప్రూవ్ కావాలన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రతి జీపీలో వంద మందికి తక్కువ కాకుండా ఉపాధి హామీ కూలీలతో పనులు జరగాలన్నారు. కూలీలకు డబ్బులు సమయానికి అందజేయాలని, పనికి సంబంధించిన బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, కూలీల కోసం షెడ్డు, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం నర్సరీల గురించి అధికారులతో చర్చించారు. ప్రతి నర్సరీలో ఏ మొక్కలు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని మొకలు ఇచ్చారు అనే వివరాలను ఎప్పటికప్పుడు పకాగా రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. నర్సరీల్లోని అన్ని బ్యాగుల్లో మొక్కలు ఉండాలని సూచించారు. పల్లె ప్రకృతి వనంలోని మొకలను కాపాడాలన్నారు. మొకలు ఏపుగా ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలోని ప్రజలు, పిల్లలు క్రీడా ప్రాంగణాలను ఎప్పటికప్పుడు సందర్శించేలా పర్యవేక్షించాలని చెప్పారు. సమావేశంలో డీఆర్డీవో పీడీ సంపత్‌రావు, డీపీ కల్పన తదితరులు పాల్గొన్నారు.
మొదటి విడుత ఈవీఎం ప్రిపరేషన్‌పై చర్యలు తీసుకోవాలి
మొదటి ఈవీఎం ప్రిపరేషన్‌పై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టీ రవికిరణ్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో ఓటర్ జాబితాలో ఎఫ్ఎల్సీ, పీఈటీ తొలగింపు, గుర్తింపు కార్డుల జారీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సైబర్ ఫేక్ న్యూస్ గురించి పోలీసు, ప్రైవేట్ సాఫ్ట్వేర్, మీడియా ప్రతినిధులతో బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆర్వో ప్రపోజల్స్‌ను త్వరితగతిన పూర్త చేయాలన్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనింగ్ పొందిన వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. వచ్చే శనివారం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ఈ నెల 30 వరకు అన్ని నివేదికలు పూర్తి చేయాలి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులలు పాల్గొన్నారు.