గిర్మాజీపేట, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనకు ఫిదా అయి.. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవలంబిస్తున్న విధానాలు నచ్చక చాలామంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నగరంలో చేస్తున్న అభివృద్ధిని చూసి తూర్పు నియోజకవర్గంలోని బీజేపీ 33వ డివిజన్ అధ్యక్షుడు నాయకులు కొంక భాస్కర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉచ్చంతుల శిరీష, శక్తి కేంద్ర ఇన్చార్జి ఉచ్చంతుల రాకేశ్, బూత్ అధ్యక్షుడు వీర్ల వేణు, మాజీ అధ్యక్షుడు పొనుగోటి రాజుతో సహా 100 మంది కార్యకర్తలు శనివారం వరంగల్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా 33వ డివిజన్లో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ-సుధాకర్ దంపతుల సమక్షంలో ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నన్నపునేని మాట్లాడుతూ తెలంగాణపై ప్రధాని మోదీ అక్కసు వెల్లగక్కుతున్నాడని, ఆయన ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక, సీఎం కేసీఆర్ తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేస్తున్న తీరుకు ఆకర్షితులై కొంక భాస్కర్ తదితరులు బీజేపీని వీడడం మోదీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు
అందరికీ సముచిత స్థానం
బీఆర్ఎస్లో చేరిన ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటానని, సముచిత స్థానం కల్పిస్తానని ఎమ్మెల్యే నరేందర్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తల శ్రేయస్సే ఎజెండాగా బీఆర్ఎస్ పాలన అందిస్తున్నదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అహర్నిశలు శ్రమించి పార్టీ హ్యాట్రిక్ సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలనను చూసి బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని, నియోజకవర్గంలో రోజురోజుకు బీజేపీ పలచబడుతున్నదని చెప్పడానికి తాజా పరిణామాలే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి, దేశానికి శరణ్యమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ది అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేని దుర్భుద్ధి అని, ఆ రెండు పార్టీలు తెలంగాణకు శనిలా దాపురించాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్కు భారీ మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు, పార్టీ 33, 39 డివిజన్ల అధ్యక్షులు మీరిపెల్లి వినయ్‌కుమార్, ఎర్రోజుల నరేశ్, యూత్ అధ్యక్షులు గుగలోత్ ధర్మేందర్, పూజారి దిలీప్‌కుమార్, రాజశేఖర్, నాయకులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
శ్రావణమాసం సందర్భంగా శనివారం బట్టలబజార్‌లోని శ్రీవేంకటేశ్వరాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్-వాణి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు ఈవో ఎలపాటి రత్నాకర్‌రెడ్డి, చైర్మన్ పరాశరం శ్రీనివాసాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు నూతనవస్ర్తాలు అందించి ఆశీర్వదించారు. అలాగే, నరేందర్ బీఆర్ఎస్ నుంచి తూర్పు టికెట్ పొందిన నేపథ్యంలో డివిజన్ పీఎంపీ, ఆర్ఎంపీ సంఘం సభ్యులు నరేందర్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.