ప్రజాపాలన గ్రామ, వార్డు సభలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం హామీల్లో భాగంగా మహాలక్ష్మి, రైతుభరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నేటి(గురువారం) నుంచి జనవరి 6 వరకు ఈ సభలను నిర్వహించనున్నది. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ సభలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేయగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు 100 మందికి ఒకటి చొప్పున కౌంటర్ల ఏర్పాటు, సభల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాకు నోడల్ ఆఫీసర్‌గా వాకాటి కరుణను కేటాయించడంతో పాటు నియోజకవర్గాలకు, మండలాలకు ప్రత్యేక అధికారులను కేటాయించింది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని, రద్దీ లేకుండా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో దరఖాస్తులు స్వీకరించాలని, అందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.
ప్రజాపాలన కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. ఈమేరకు బుధవారం సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు నోడల్ అధికారిగా వాకాటి కరుణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రజాపాలన సభల నిర్వహణ తీరును పరిశీలిస్తూ యంత్రాంగానికి సూచనలు చేస్తూ కార్యక్రమం విజయవంతానికి ఆమె కృషి చేయనున్నారు.
వరంగల్ జిల్లాలో 391 గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించేందుకు 1,756 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలు, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 24, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 12, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 32 వార్డుల్లో సభల నిర్వహించనున్నారు. జిల్లాలో 2,65,323 ఇండ్లు ఉన్నందున 391 గ్రామ, వార్డు సభల్లో కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ పీ ప్రావీణ్య ఓ ప్రకటనలో తెలిపారు. 323 గ్రామ పంచాయతీల పరిధిలో 1,32,228 ఇండ్లు ఉన్నందున 1,283, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 12,724 ఇండ్ల కోసం 120, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 3,619 ఇండ్ల కోసం 33, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 32 వార్డుల్లో గల 1,16,752 ఇండ్ల కోసం 320 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో అభయ హస్తం గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈమేరకు ప్రతి డివిజన్లో 10 చొప్పున కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు 6, వృద్ధులు, వికలాంగులకు 1, జనరల్‌గా 3 బల్దియా అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో ప్రజా పాలన కేంద్రం పరిధిలో 2 వేల నుంచి 4500 కుటుంబాలు ఉన్నాయి. ప్రజా పాలన సమర్థంగా నిర్వహించేందుకు ఇప్పటికే గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అదేశించారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా 8 బృందాలను ఏర్పాటు చేశారు.
సభల నిర్వహణకు మండలానికి 2 నుంచి 4 టీమ్‌ల చొప్పున బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏవోలు నియమితులయ్యారు. గురువారం నుంచి ఎనిమిది పనిదినాల్లో సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఒక్కో బృందం పని దినాల్లో రోజూ పద్ధతిన రెండు గ్రామ, వార్డుసభలను నిర్వహించనున్నది.
గ్రామసభకు ముందు రోజే ఆయా గ్రామ పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు, ఇతర అధికారులు దరఖాస్తు ఫారాలను ప్రజలకు అందజేస్తారు. వాటిని నింపి ఆయా తేదీల్లో నిర్వహించే సభల్లో అధికారులకు కలెక్టర్లు సూచించారు.
రోజుకు రెండు గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంట ల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామసభల ఏర్పాటుతో తగిన కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తులో ఉన్న ఐదు పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తు ద్వారా స్వీకరించాలని తెలిపారు.
తప్పనిసరిగా హెల్ప్‌డెస్ ఏర్పాటు చేసి రాయడం రాని వారికి దరఖాస్తులు పూరించేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, దరఖాస్తులు స్వీకరణలో వృద్ధులకు, దివ్యాంగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
దరఖాస్తు స్వీకరించిన వెంటనే రశీదు ఇవ్వాలని కలెక్టర్లు స్పష్టం చేశారు. సభలో మైక్, టెంట్, కుర్చీలు, టేబుల్స్, క్యూలైన్ బారికేడ్స్, దరఖాస్తులు, తాగునీటి సౌకర్యం తదితర వసతులు కల్పించాలని సూచించారు.
జిరాక్స్ సెంటర్ల యజమానులు దరఖాస్తుల ప్రతుల కోసం ఎకువ రుసుము వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతిరోజూ సాయంత్రంలోగా నిర్ణీత ప్రొఫార్మాలో రిపోర్టులు అధికారులు సమర్పించాలని ఆదేశించారు.
ప్రజాపాలన కార్యక్రమం తిరిగి నాలుగు నెలలకోసారి నిర్వహిస్తామని, దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.
గ్రామసభల ఏర్పాట్లను మండల ప్రత్యేక అధికారులు ముందురోజే వెళ్లి పరిశీలించి దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లను పర్యవేక్షించాలని, టామ్ టామ్, ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలిసేలా కార్యాచరణ ఉండాలని కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య ఆదేశించారు.