హనుమకొండ సబర్బన్ : హనుమకొండ జిల్లాలో ఈ వానకాలంలో సుమారు 1.55 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇందులో 50 వేల ఎకరాల వరకు బై బ్యాక్ పద్ధతిలో పలు విత్తన కంపెనీలు సాగు చేయిస్తుండగా, మిగతా లక్ష ఎకరాల్లో సాధారణ వరి పండించారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ డీఆర్డీవో, పీఏసీఎస్ ఆధ్వర్యంలో154 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. నెల రోజులుగా జిల్లాలోని ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఐనవోలు, హసన్పర్తి, వేలేరు మండలాల్లో వరి కోతలు జరుగుతున్నాయి.
ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబోసుకోగా, నిర్ణీత తేమ కూడా వచ్చింది. అయితే సెంటర్లు ప్రారంభించి 20 రోజులైనా ఇప్పటి వరకు క్వింటా ధాన్యం కూడా కాంటా జరగలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై నిర్వాహకులను అడిగితే తమకేం తెలియదనే సమాధానం వస్తున్నదని అన్నదాతలు వాపోతున్నారు. సన్న బియ్యానికి బోనస్ నుంచి సాధ్యమైనంత మంది రైతులను తగ్గించేందుకు ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొనుగోళ్లు మొదలవక పోవడంతో విసిగిపోయిన రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఆయా కేంద్రాల్లో కాంటాలు లేనప్పటికీ ధాన్యం నింపేందుకు గన్నీలను మాత్రం సరఫరా చేశారు. దీనికి తోడు ఆయా సెంటర్లకు సంబంధించి మిల్లులను కూడా కేటాయించకపోవడంతో కొనుగోల్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రతిరోజు కురుస్తున్న వర్షంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.