హనుమకొండ, జూన్ 10 : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ఇష్టారాజ్యంగా భూముల ధరల పెంపు నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతం కంటే రిజిస్ట్రేషన్ల సంఖ్య సగానికి తగ్గింది. భూముల విలువను భారీగా పెంచడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో దాదాపు 50 శాతం వరకు పడిపోయింది. గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ భూం తగ్గడంతో క్రమంగా పడిపోతూ వస్తున్న రిజిస్ట్రేషన్లు ఇప్పుడు మరింత పడిపోయాయి. ఫలితంగా ప్రభుత్వాదాయం కూడా తగ్గిపోనుంది. మారెట్లో ఇప్పటికే భూముల ధరలు అధికంగా ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన కొత్త మారెట్ విలువతో అదనపు భారం పడుతున్నదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న మండల కేంద్రాల్లో భూముల విలువ గణనీయంగా పెరగడంతో రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన మొత్తం కూడా అధికమైందని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇండ్ల రిజిస్ట్రేషన్లు తప్పించి సాధారణ కొనుగోళ్లు జరగడం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న మందగమనం కూడా రిజిస్ట్రేషన్లపై ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు భారంగా మారడంతో సాధారణ ప్రజలకు కొనుగోలుకు దూరమవుతున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. కాగా, రిజిస్ట్రేషన్ అధికారుల సమాచారం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 13 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ పరిధిలో గతంలో రోజుకు సుమారు 110 స్లాట్స్ బుక్ అవ్వగా ప్రస్తుతం 60 నుంచి 70 మాత్రమే అవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి మినహా, మిగతా అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సైతం 50 శాతం మేరకు రిజిస్ట్రేషన్లు తగ్గాయి. గత ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ పుంజుకొందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కుదేలయ్యిందని రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం వంద గజాల ప్లాట్ కూడా అమ్మలేని దుర్భర స్థితిలో ఉన్నామని, ప్రభుత్వ నిర్ణయంతో అంతంత మాత్రంగా సాగుతున్న రియల్ వ్యాపారంపై మరింత ప్రభావం పడే ప్రమాదం ఉందంటున్నారు.
ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతున్నది. అసలే మార్కెట్ పరిస్థితి బాగాలేదు. ఇలాంటి సమయంలో భూముల ధరలు పెంచడం కరెక్టు కాదు. రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలకు అన్ని రకాల ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారు తప్ప అక్కరకొచ్చే పనులేవీ చేయడం లేదు.
– రావుల వేణుగోపాల్, ప్రకాశ్రెడ్డిపేట, హనుమకొండ
ములుగు, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో 50 నుంచి 75 శాతం మేర రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. గతంలో రోజుకు 15 నుంచి 25 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా 10 రోజుల నుంచి కేవలం 5 నుంచి 6 మాత్రమే అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో వెంకటాపూర్, గోవిందరావుపేట, ములుగు, మల్లంపల్లి మండలాల్లో మాత్రమే గృహ అవసరాల భూముల క్రయ విక్రయాలు జరుగుతాయి. దీంతో ఎస్ఆర్వోలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ప్రభుత్వం మార్కెట్ విలువలను భారీగా పెంచడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోతున్నది. ములుగు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూమి గజం విలువ గతంలో రూ.1,700 ఉండగా దానిని ఏకంగా రూ. 2,600 పెంచారు. రహదారులను ఆనుకొని ఉన్న భూముల విలువ గతంలో రూ. 2.100 ఉండగా రూ. 4,700కు సవరించారు. జాతీయ రహదారి పక్కనున్న భూమి రూ .6,100 ఉండగా దానిని రూ. 9,200గా ఖరారు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోనే కాకుండా గ్రామాల్లో సైతం గజం భూమి ధర సగటున రూ.500 ఉండగా రూ. 900కు పెంచారు. ఎకరం వ్యవసాయ భూమి విలువ రూ.2.40 లక్షలుండగా ప్రస్తుతం రూ. 3.40 లక్షలకు చేరింది. మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీలు కూడా భారీగా పెరగడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయింది.
