పరకాల/నడికూడ, ఆగస్టు 30 : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని వరికోల్ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలోనే 1,113 మందికి వైద్య సిబ్బంది మొదటి డోస్ టీకా వేసి, గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. దీంతో జిల్లాలోనే వందశాతం మొదటి డోస్ పూర్తయిన గ్రామంగా నడికూడ మండలంలోని వరికోల్ నిలిచింది. గ్రామంలో మొత్తం 4200 పైగా జనాభా ఉండగా 18 ఏళ్లు నిండిన వారు 3200 మంది ఉన్నారు. వీరందరికి మొదటి డోస్ టీకా వేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి తెలిపారు. నాలుగు రోజుల పాటు గ్రామ ప్రజలకు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా క్యాంపు నిర్వహించి, టీకాలు వేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామమైన వరికోల్ ఇప్పటికే అభివృద్ధితో పాటు పలు కార్యక్రమాలతో జిల్లాలో ప్రత్యేక గుర్తింపు సాధించుకోగా, ఇప్పుడు జిల్లాలోనే వంద శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి గ్రామంగా నిలిచింది. కాగా, ఇప్పటి వరకు గ్రామంలో 30శాతం మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు సహకరించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పోరెడ్డి వాసుదేవరెడ్డి, డీఎంహెచ్‌వో లలితాదేవికి సర్పంచ్ సాధు నిర్మలా సమ్మిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
వంద శాతం వాక్సినేషన్‌కు కృషి చేయాలి
వరంగల్ : కరోనా నియంత్రణకు వైద్యాధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసి, వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి సూచించారు. సోమవారం ఆమె జిల్లాలోని రాయపర్తి పీహెచ్సీ, వరికోల్ ఉపకేంద్రం, పరకాల పీపీ యూనిట్, బ్లడ్ బ్యాంక్‌ను తనిఖీ చేశారు. పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ రేట్, వ్యాక్సినేషన్ తీరుపై వైద్యాధికారులతో సమీక్షించారు. కుటుంబ నియంత్రణ, ఇంటింటి జ్వర సర్వే, ఎన్సీడీ సర్వే తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ప్రదీప్‌కుమార్, రణధీర్ పాల్గొన్నారు.