నర్సంపేట, అక్టోబర్ 26: రక్తదాతలే ప్రాణదాతలని నర్సంపేట ఏసీపీ ఫణీందర్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రక్తం విలువ వెలకట్టలేనిదని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అవసరం ఎంతో ఉంటుందని గుర్తుచేశారు. అలాంటి సందర్భాల్లో బ్లడ్ బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. యువత రక్తదానం చేయడం వల్ల బ్లడ్ బ్యాంకుల్లో నిల్వ చేసి అవసరం ఉన్న వారికి అందిస్తారన్నారు. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని కోరారు. 23వ సారి రక్తదానం చేసిన నర్సంపేటలోని ఏఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎర్రబోయిన రాజశేఖర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఏసీపీ కోరారు. ఈ సందర్భంగా 150 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం పోలీసు సంక్షేమ నిధికి ఐఎంఏ నర్సంపేట అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి రూ. 25 వేలు అందించారు. ఈ మేరకు చెక్కును ఏసీపీలు ఫణీందర్, కరుణసాగర్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఏసీపీ తిరుమల్‌రావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, ఎస్సైలు రాంచరణ్, రవీందర్ పాల్గొన్నారు.
రక్తదానం మరొకరికి ప్రాణదానం
చెన్నారావుపేట: రక్తదానం మరొకరికి ప్రాణదానం అని ఎస్సై శీలం రవి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నర్సంపేటలో ఏసీపీ ఫణీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎస్సై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని లింగాపురం, ఉప్పరపల్లి, చెన్నారావుపేట, గురిజాల, అమృతండాతోపాటు పలు గ్రామాలకు చెందిన 60 మంది రక్తదానం చేశారన్నారు. లింగాపురం నుంచి సర్పంచ్ తప్పెట రమేశ్‌తోపాటు 15 మంది యువకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అమృతండా నుంచి టీఆర్ఎస్ నాయకుడు బోడ వెంకన్ననాయక్ రక్తదానం చేయగా, ఏసీపీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.