మహబూబాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : మానుకోటకు మహర్దశ పట్టింది. జిల్లాకేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత పట్టణంలో చాలా మార్పులొచ్చాయి. అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. జిల్లాగా మారిన తర్వాత పట్టణ రోడ్లన్నీ రద్దీగా మారి వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందిపడ్డారు. జిల్లా ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, రోడ్ల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మానుకోట మున్సిపాలిటీకి నిధులు కేటాయించింది. దీంతో జిల్లా కేంద్రంలో అన్ని ప్రధాన రోడ్లను అధికారులు విస్తరించారు. పట్టణంతా ఇప్పుడు కొత్తరూపును సంతరించుకున్నది. రోడ్లతోపాటు మధ్యలో డివైడర్లు నిర్మించి, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల నుంచి తాళ్లపూసపల్లి రోడ్డును విస్తరించారు. మదర్‌థెరిస్సా సెంటర్ నుంచి జిల్లా బస్టాండ్ వరకు, బస్టాండ్ నుంచి ఏటిగడ్డతండా వరకు, వైఎస్సార్ విగ్రహం నుంచి నర్సంపేట రోడ్ వరకు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ముత్యాలమ్మ గుడి వరకు, ముత్యాలమ్మ గుడి నుంచి వయా మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం మీదుగా జిల్లా వైద్యశాల వరకు, ముత్యాలమ్మ గుడి నుంచి వయా మార్కెట్ మీదుగా రామాలయం వరకు, కూరగాయల మార్కెట్ నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రోడ్లను విస్తరించారు. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని బస్‌స్టేషన్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు, శ్రీనివాస టాకీస్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు రోడ్లు విస్తరించడంతో పాటు కొత్తవి వేశారు. నెహ్రూ సెంటర్ నుంచి సాయిబాబా గుడి వరకు రోడ్డు విస్తరణ పనులు ముగిశాయి. ఇప్పటివరకు మొదటి విడుతలో రూ.15 కోట్లు, రెండో విడుతలో రూ.15 కోట్లతో రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేశారు. రూ.2.5 కోట్లతో అండర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధ జలాలు అందించేందుకు రూ.54కోట్లతో ఇంటింటికీ నల్లాల బిగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
పట్టణ ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఏర్పాటు
2019లో మానుకోట మున్సిపాలిటీలో విలీనమైన అనంతారం, గాంధీపురం, బేతోలు, రజాల్పేట, శనిగపురంలో కోటి రూపాయలతో చేపట్టిన వైకుంఠధామాల పనులు తుదిదశకు చేరాయి. పట్టణంలోని యాదవనగర్, రాంచంద్రాపురంలో రూ.2కోట్లతో వైకుంఠధామాలు, నిజాం చెరువు వద్ద రూ.30లక్షలతో వైకుంఠధామాలు నిర్మాణ దశలో ఉన్నాయి. నిజాం చెరువు సుందరీకరణ, కట్టపై రోడ్డుతోపాటు అభివృద్ధి పనుల కోసం రూ.5కోట్లు నిధులు కేటాయించగా, పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలో 36 డివిజన్లు ఉండగా ఇప్పటి వరకు 30 వార్డుల్లో 30 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వీటిలో వాకింగ్ ట్రాక్‌తోపాటు పిల్లలు ఆడుకునేందుకు ఆట పరికరాలు, ఒపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నందినగర్‌లో 10 ఎకరాల్లో పట్టణ ప్రకృతివనంతోపాటు నర్సరీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక వర్షాలతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా కాల్వలు నిర్మిస్తున్నారు. పట్టణంలో రూ.20 లక్షలతో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం భవనాన్ని నిర్మించి ఇటీవల ప్రారంభించారు. ఇప్పటి వరకు పట్టణంలోని 800 కుక్కలకు కు.ని. ఆపరేషన్లు చేసినట్లు వైద్యులు తెలిపారు.
విశాలమైన రోడ్లు
మానుకోట పట్టణం గతంలో అస్తవ్యస్తంగా ఉండేది. రోడ్లన్నీ ఇరుకుగా ఉండి ఇబ్బందిపడినం. జిల్లా అయిన తరువాత రోడ్లను విస్తరించారు. సీసీ, బీటీ రోడ్లు వేశారు. జిల్లా కేంద్రంలో ఇప్పుడు రోడ్లన్నీ విశాలంగా మారాయి. ట్రాఫిక్, పార్కింగ్ కష్టాలు తప్పాయి. పట్టణ ప్రకృతి వనాలు, వైకుంఠధామాలతో కొత్తకళ వచ్చింది. రోడ్ల మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు.
రూ.70కోట్లతో అభివృద్ధి పనులు
మానుకోట పట్టణంలో రూ.70కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని పనులు పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లా కేంద్రంలో రూ.4.5 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 30 పట్టణ ప్రకృతి వనాలు, 10 వైకుంఠధామాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇవి కాకుండా పట్టణంలో రూ.54 కోట్లతో ఇంటింటికీ స్వచ్ఛమైన భగీరథ నీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయి. మానుకోట జిల్లాగా ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది.