వరంగల్, ఆగస్టు 24: మహా నగర మురుగునీటి శుద్ధిపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి సారించింది. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు ఒక్క ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) లేకపోవడంతో చెరువులు కలుషితం అవుతున్నాయి. దీంతో చెరువుల కలుషితం కాకుండాఉండేందుకు ఎస్టీపీల నిర్మాణాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. మూడు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉర్సు, బంధం చెరువుల్లో ఎస్టీపీల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మరో ఎస్టీపీ టెండర్ ప్రక్రియ పూర్తయినా స్థల వివాదం ఏర్పడడంతో రెడ్డిపురంలో జాప్యం జరుగుతున్నది. రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుని గ్రేటర్ అధికారులు స్థల సేకరణపై దృష్టిసారించారు. నెల రోజుల్లో స్థల సేకరణ ప్రక్రియ పూర్తి చేసి ఎస్టీపీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ నిధులతో మురుగునీటిని శుద్ధి చేయడానికి మూడు ఎస్టీపీల నిర్మాణాలు చేస్తున్నారు. 120 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన మూడు ఎస్టీపీలను రూ.200 కోట్ల నిధులతో నిర్మించనున్నారు.
120 ఎంఎల్డీల సామర్థ్యంతో మూడు ప్లాంట్లు
రెడ్డిపురంలో 100 ఎంఎల్డీలు, ఉర్సు చెరువు వద్ద 5 ఎంఎల్డీలు, బంధం చెరువు వద్ద 15 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అమ్మవారిపేటలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటు చేసిన మొదటి నగరంగా వరంగల్ దేశంలోనే గుర్తింపు పొందింది. దీనికి తోడు నగర మురుగునీరు శుద్ధీకరణ ప్లాంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. బయోవేస్ట్ నీటిని శుద్ధి చేసేందుకు వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఇప్పటికే 150 ఎల్‌ఎండీల సామర్థ్యం కలిగిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేశారు. విస్తరిస్తున్న నగరానికి తోడు జనాభాకు అనుగుణంగా భవిష్యత్‌లో గ్రేటర్లో 500 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెడ్డిపురంలో నెల రోజుల్లో పనులు
రెడ్డిపురంలో ఎస్టీపీ నిర్మాణ పనులు నెల రోజుల్లో ప్రారంభించనున్నారు. 21 ఎకరాల 21 గుంటల భూమి సేకరణ ప్రక్రియను పూర్తి చేసి రెవెన్యూ అధికారులు బల్దియాకు అప్పగించనున్నారు. ఆర్డీవో ఆధ్వర్యంలో స్థల సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. రెవెన్యూ అధికారులు భూమిని అప్పగించగానే టెండర్ దక్కించుకున్న రాంకీ ఇన్ఫ్రా సంస్థ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. అయితే, ప్రస్తుతం ఉర్సు, బంధం చెరువుల వద్ద చేపట్టిన ఎస్టీపీల పనులు వచ్చే ఏప్రిల్ వరకు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
మూడు జోన్లుగా నగరం
మురుగునీటిని శద్ధి చేయడానికి నగరాన్ని మూడు జోన్లుగా విభజించారు. రెడ్డిపురం ఎస్టీపీ ద్వారా హనుమకొండ ప్రాంతం నుంచి వచ్చే మురుగునీటితో పాటు బొందివాగు నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధిచేయనున్నారు. బంధం చెరువు ప్రాంతంలోని ఎస్టీపీలో కాజీపేట, సోమిడి, రెవెన్యూ కాలనీ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధిచేయనున్నారు. ఉర్సు చెరువు వద్ద చేపట్టిన ఎస్టీపీలో అండర్‌రైల్వేగేట్ ప్రాంతం నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధిచేసేలా బల్దియా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
చెరువుల కలుషితానికి అడ్డుకట్ట
నగరంలోని మురుగు నీరు అంతా ముచ్చర్ల నాగారం చెరువులో కలుస్తున్నది. అలాగే, అండర్ రైల్వేగేట్ ప్రాతంలోని మురుగునీరు ఉర్సు రంగసముద్రంలో కలుస్తున్నది. బంధం చెరువులు, కోటి చెరువులు మురుగునీటితో కలుషితం అవుతున్నాయి. నాగారం, ఉర్సు చెరువుల్లో చేపలను పెంచుతున్నారు. ఆ చెరువుల్లో పెంచిన చేపలు తింటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. చెరువులు కలుషితం కాకుండా ఉండేందుకు మూడు ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
రూ. 200 కోట్లతో మూడు ఎస్టీపీల నిర్మాణం
గ్రేటర్ పరిధిలో రూ. 200 కోట్లతో మూడు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టాం. ఉర్సు చెరువు, బంధం చెరువు వద్ద ఎస్టీపీల పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రెండు ఎస్టీపీల నిర్మాణాలు పూర్తవుతాయి. రెడ్డిపురంలో స్థల వివాదం ముగిసింది. రెవెన్యూ అధికారులు నెల రోజుల్లో స్థలం సేకరించి గ్రేటర్‌కు అప్పగించిన వెంటనే ఎస్టీపీ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. రెడ్డిపురంలో 100 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ, బంధం చెరువు వద్ద 15 ఎంఎల్డీలు, ఉర్సు చెరువు వద్ద 5 ఎల్‌ఎండీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీలను నిర్మిస్తాం. ఎస్టీపీల ద్వారా శుద్ధిచేసిన నీటిని గార్డెనింగ్‌కు వినియోగిస్తాం.