గతం : సమైక్య పాలనలో ఎకరం భూమి ఉన్నా నీళ్లు లేక పది గుంటల భూమిల్లో నాట్లేసేటోళ్లు. తిండి మందం పండించుకునేటోళ్లు. చెరువులున్నా చుక్క నీరు లేక ఆ పంట కూడా గగనమయ్యేది. వ్యవసాయం పెద్దగ లేక చేద్దామన్నా పని ఉండక రైతు కుటుంబాలే కూలీకివోయి పదో.. పర్కో సంపాదించుకుని పొట్ట పోసుకునేటియి. చాలా మంది ఎవుసం విడిచి వేరే పని చూసుకునేటోళ్లు. చివరికి పట్టణాలు, ఇతర రాష్ర్టాలు, దేశాలకు వలసబాట పట్టేటోళ్లు.
ప్రస్తుతం : వ్యవసాయం స్వరూపమే మారింది. మిషన్ కాకతీయతో బాగుపడిన గొలుసుకట్టు చెరువులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, కాలువలతో పంటలకు పుష్కలంగా నీరందుతున్నది. నాడు పడావుపడ్డ భూములు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందడం, సబ్సిడీపై యంత్రాలు అందుతుండడం, ఇతర సర్కారు ప్రోత్సాహకాలతో ఏటా ఒక్క పంటకే దిక్కు లేని పరిస్థితి నుంచి రైతులు రెండు, మూడు పంటలు వేసే స్థాయికి చేరారు. అందరూ సాగు బాట పట్టడంతో కూలీలకు కొరత ఏర్పడి ఇతర రాష్ర్టాల నుంచి కూలి పనులకు వలస వస్తున్నారు.
మానుకోటకు ఏటా సుమారు 7వేల మంది
మానుకోట జిల్లాలో సాగునీటి సమస్య ఉన్నప్పుడు 1.20లక్షల ఎకరాల్లోనే పంట పండిచేవారు. 24గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీ ద్వారా నీటిని తెచ్చి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నింపడం, చెక్‌డ్యాంలను కూడా పూర్తి స్థాయిలో నింపడంతో సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. జిల్లాలో దాదాపు 3లక్షల ఎకరాల్లో వానకాలం, 2.40లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగవుతున్నాయి. సాగు విస్తీర్ణం విపరీతంగా పెరుగడంతో కూలీల కొరత ఏర్పడింది. జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి, మిరప, మక్క, బబ్బెర్లు, పెసర్లు, కూరగాయలు సాగవుతుండగా ఏటా మిరప ఏరేందుకు బీహార్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ నుంచి వేలాది మంది వలస కూలీలు వస్తున్నారు. 2014కు ముందు వందల సంఖ్యలో ఉన్న వలస కూలీల సంఖ్య ఇప్పుడు వేలకు చేరింది. ఏటా ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చి మే మొదటి వారంలో తిరిగి వెళ్తారు. ఇక్కడికి వచ్చేవారికి వసతి, భోజన ఏర్పాట్లు స్థానిక రైతులే చేస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమారు 7వేల మంది కార్మికులు జిల్లాకు వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరంతా మిరప ఏరేందుకు వచ్చారు. కిలో మిరపకు రూ10 నుంచి రూ.15 చెల్లిస్తారు. 2016లో1,600, 2017లో 1,950, 2018లో 2,400, 2019లో 3,200, 2020లో 5వేలు, 2021-7వేల మంది వలస కూలీలు వచ్చారు.
సరిహద్దుల వెంట వలసల వెల్లువ
గోదావరి పరివాహక ప్రాంతం వెంట విస్తరించి ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహదేవ్పూర్, పలిమెల, మల్హర్రావు మండలాలకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల కూలీలు భారీగా తరలివస్తుంటారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు మిరప ఏరే పనులు పూర్తి చేసుకుని వెళ్తారు. గోదావరి నది ఇసుక దిబ్బలపై, ఖాళీ భూముల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో మూడు నెలల పాటు ఇక్కడే ఉంటారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కేవలం వరి మాత్రమే సాగు చేయడం మూలంగా డిసెంబర్, జనవరి వరకు పనులు పూర్తవుతాయి. తర్వాత ఆ రాష్ర్టాల్లో పనులు దొరకవు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రం నుంచి సుమారు 1000 మంది కూలీలు ఇక్కడి వలస వస్తుంటారు. మూడు మండలాల పరిధిలో 5,665 ఎకరాల మేర మిరప సాగవుతున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు.
పెళ్లిళ్లకో పేరంటాలకో వచ్చిపోయే పరిస్థితి నుంచి..
జనగామ జిల్లాలోని బచ్చన్నపేట, నర్మెట, లింగాలగణపురం, రఘునాథపల్లి, దేవరుప్పుల, జనగామ మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలు ఉన్నచోట ఉపాధి కరువై పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకే కాకుండా ఆంధ్రా ప్రాంతాలకు వలస వెళ్లిపోయేవారు. దశాబ్దాల తరబడి ఆయా ప్రాంతాల్లో నిర్మాణ రంగాల్లోనో, వ్యవసాయ కూలీలుగానో స్థిరపడ్డారు. పెండ్లిళ్లకో పేరంటాలకో చుట్టపుచూపుగా స్వగ్రామాలకు వచ్చిపోయే వారు. స్వరాష్ట్రం వచ్చాక ప్రభుత్వం పల్లెల్లోనే బతుకు భరోసా కల్పించడంతో ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా తిరిగి స్వస్థలాలకు చేరారు. అంతేకాకుండా పొరుగున ఉన్న ఆంధ్రా నుంచి ప్రతి సీజన్లో జిల్లాకు వలస కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారు. ఇలా లింగాలఘనపురం, దేవరుప్పుల, తరిగొప్పుల, నర్మెట మండలాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస కూలీలు వచ్చి పత్తి, మిర్చి ఏరే పనులతో ఉపాధి పొందుతున్నారు. ‘కేసీఆర్ పుణ్యమా అని చెర్లు నిండి, డ్యాములల్ల నీళ్లొదిలిండు కాబట్టి ఆయింత మొకాలు తెరుపైనయ్.. లేకుంటే తిప్పలే అయితుండె.. ఉపాధి కూలి పనులు చేసుకునేటోళ్లం.. వాళ్లు వాళ్లకు నచ్చినోళ్లను పిలుచుకునేటోళ్లు. కానీ మూడేండ్ల సంది కాలం ఎట్లున్నా చెర్లునిండి చేతినిండా పనులు దొరుకుతున్నయ్..’ అని ఆంధ్రా వలస కూలీలు చెబుతున్నరు.
ములుగుకు 30వేల మంది
రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాకు ఛత్తీస్‌గఢ్ నుంచి కూలీల వలసబాట పడుతున్నారు. జిల్లాలోని వెంకటాపురం(నూగూరు), వాజేడు, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో గోదావరి నది తీర ప్రాంతాల్లో మిర్చి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుండగాఉపాధి కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇలా సరిహద్దుల్లోని గ్రామాలకు ఏటా సుమారు 30వేల మంది వలస వస్తున్నారు. ఫిబ్రవరిలో వచ్చి మే వరకు మిర్చి ఏరుతారు. వీరికి రైతులు అడ్వాన్స్‌తో పాటు పనిచేసిన రోజులకు కూలి లెక్కగట్టి చెల్లిస్తున్నారు. పురుషులకు రూ.250, మహిళలకు రూ.200 చొప్పున ఇస్తున్నారు. మిర్చి, పత్తి, పసుపు పండించిన క్రమంలో కూలీల అవసరం ఎక్కువైంది. జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 80 గొత్తికోయగూడేలకు చెందిన గిరిజనులు కూడా వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. మిర్చి నారు మోసేందుకు, గుంటుక తోలేందుకు, పోగుంటలు పెట్టేందుకు గొత్తికోయగూడేల కూలీలు పనులు చేస్తున్నారు. గతేడాది మిర్చికి అధిక మద్దతు ధర లభించడంతో ఈసారి అదనంగా 25 నుంచి 26శాతం రైతులు మిర్చి వేశారు. ప్రస్తుతం జిల్లాలో 29,124 ఎకరాల్లో మిర్చి సాగవుతండగా వచ్చే ఫిబ్రవరి నుంచి మూడు నెలల పాటు వలస కూలీలకు మెరుగైన ఉపాధి దొరికే అవకాశం ఉంది.
ఒక్కో కుటుంబానికి రూ.50వేలు
ఏటూరునాగారం మండలానికి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, బీజాపూర్ ప్రాంతాల్లోని సుమారు 40 గ్రామాల నుంచి నాలుగు వేల నుంచి 5వేల మంది కూలీలు వస్తుంటారు. కుటుంబంతో కలిసి వచ్చి.. సీజన్లో రూ.50వేల వరకు సంపాదిస్తారు. ముఖ్యంగా రామన్నగూడెం గ్రామానికి చెందిన రైతులు ఎక్కువగా గొత్తికోయ కూలీలను ఛత్తీస్‌గఢ్ నుంచి పిలిపిస్తారు. ఇటు వచ్చేటప్పుడు వాహన చార్జీలు రైతు భరిస్తే, వెళ్లేటప్పుడు కూలీలు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. వలస వచ్చిన కూలీలు గోదావరి ఇసుక తిన్నెల్లో తాత్కాలికంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇలా వందలాది కుటుంబాలు ఒకే చోట చేరడంతో తీరమంతా ఒక చిన్నపాటి ఊరిని తలపిస్తుంది. గోదావరిలో నీటి పారకం వెంట గుడిసెలు ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులంతా ఉంటారు.
పనులకు కొదువ లేదు
మంగపేటలో మెట్ట చేన్లు, వరి మాగాణాలు ఛత్తీస్‌గఢ్ గొత్తికోయలకు ఉపాధినిస్తున్నాయి. కమలాపురం, రాజుపేట, అకినేపల్లి, మల్లారం వరకు వరి, మిర్చి విస్తృతంగా సాగవుతాయి. జూన్ నుంచి ఏప్రిల్ దాకా కూలి పనులకు కొదువే ఉండదు. ప్రస్తుతం 400మంది గొత్తికోయలు మండల వ్యాప్తంగా 16 గూడారాలు వేసుకొని మిర్చి, వరి సాగు పనులు చేస్తున్నారు. మిర్చి ఏరడం మొదలైతే వేలాది మంది వలస రానున్నారు.