నమస్తేతెలంగాణ నెట్వర్క్ : జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కేయూ వందఫీట్లరోడ్డులోని టీవీ టవర్కాలనీ, అమరావతినగర్, సమ్మయ్యనగర్ కాలనీలు నీట మునిగాయి. కాలనీలోని వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అలాగే, హంటర్ రోడ్డు ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాజీపేటలో కూడా పలు ప్రాంతాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి. ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి సిబ్బందితో పట్టణంలోని సోమిడి చెరువు, దర్గా చెరువు, బంధం చెరువును సందర్శించి, పరిస్థితిని పరిశీలించారు. సోమిడి చెరువు కట్ట మీదుగా సుబ్బయ్యపల్లి వరకు, దర్గా మీదుగా బట్టుపల్లికి వెళ్లే రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ రోడ్లను పోలీసులు మూసివేశారు. సోమిడి చెరువు మత్తడి దూకుతోంది. వరద నీరు సమీపంలోకి వడ్డేపల్లి చెరువులోకి చేరుతోంది. దీంతో పంట పోలాలు నీటితో నిండిపోయాయి. కాగా, వర్షాల నేపథ్యంలో 47వ డివిజన్లో కార్పొరేటర్ సంకు నర్సింగరావు పర్యటించి, సహాయక చర్యలు చేపట్టారు. ఐనవోలు మండలం పున్నేల్ ఎల్లమ్మ చెరువు మత్తడిని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరిశీలించారు.
మత్తడి నీరు గ్రామంలోని రాకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన గొట్టె భిక్షపతి, కోతులనడుమకు చెందిన ఎల్లబోయిన రాజయ్య ఇండ్లు నేలమట్టమయ్యాయి. అలాగే, చింతలపల్లికి చెందిన బొంకూరి ఎల్లయ్య వ్యవసాయ బావి వరదతో పూర్తిగా కూలిపోయింది. కేశవాపూర్ పెద్ద చెరువు మత్తడి పడడంతో గ్రామం నుంచి కమలాపూర్ మండలం అంబాలకు వెళ్లే రహదారి కొట్టుకపోయి, రాకపోకలు స్తంభించాయి. పెంచికల్‌పేటలో విద్యుత్ స్తంభాలు వంగిపోవడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. ఎల్కతుర్తి నుంచి ముల్కనూర్‌కు వెళ్లే రహదారిపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎల్కతుర్తి, కోతులనడుమ వాగులు ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ గుజ్జుల రవీందర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై ఉమ సూచించారు. దామెర మండలంలోని పులుకూర్తి, పసరగొండ గ్రామాల్లోని లోలెవల్ వంతెనలు, లోతట్టు ప్రాంతాలను తహసీల్దార్ రియాజొద్దీన్, ఎంపీపీ కాగితాల శంకర్ పరిశీలించారు. వరదలపై ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఊరుగొండ పెద్ద చెరువు, పసరగొండ మాటు కుంటను ఇరిగేషన్ డీఈఈ అబ్దుల్ ఖాదీర్ పరిశీలించారు. దామెర చెరువు మత్తడి భారీగా పోస్తుండడంతో పరకాల -హుజూరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది.
దీంతో శ్రీనివాస కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. పరకాల శివారులోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు వార్డుల్లో లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి పరిశీలించారు. భీమదేవరపల్లి మండలంలో 16.02 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ఏఎస్వో విజయేందర్ తెలిపారు. వంగర నుంచి రాయికల్ వెళ్లే వాహనదారులు వరదతో ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో ఇల్లు కూలిపోగా ప్రజాప్రతినిధులు పరిస్థితి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ జక్కుల అనితారమేశ్, జడ్పీటీసీ వంగ రవి సూచించారు. కమలాపూర్ మండలంలో 138.6 మిల్లీమీటర్ల వర్షం కురువడంతో 11వ వార్డులో ఇండ్లలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కమలాపూర్-కన్నూరు రహదారి తెగిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. మాదన్నపేట-కంఠాత్మకూర్ రోడ్డులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుడడంతో పరకాల వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. కన్నూరు-కొత్తపల్లి రహదారిపై వర్షపు నీరు నిలువడంతో రాకపోకలు నిలిపివేశారు. కమలాపూర్ పెద్ద చెరువు మత్తడి వద్ద వరద దాటికి పరకాల-హుజూరాబాద్ నాలుగు లైన్ల రోడ్డు కోతకు గురికావడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు వెంటనే టిప్పర్లతో మట్టి పోయించారు. భీంపల్లిలో రెండు, శనిగరంలో ఒకటి, మాదన్నపేటలో మూడు, అంబాలలో రెండు, గుండేడులో ఒకటి, కమలాపూర్‌లో ఒకటి, వంగపల్లిలో రెండు ఇండ్లు వర్షానికి కూలిపోయినట్లు తహసీల్దార్ జాహెద్‌పాషా తెలిపారు.
మరో రెండు రోజులు వర్షాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శ్రీనివాస్, సీఐ కిషన్ సూచించారు. కాగా, మండలంలోని శ్రీరాంలపల్లి గ్రామంలో వర్షానికి దాసి సాంబయ్య, చిట్టిపోతుల రమాదేవిలకు చెందిన ఇండ్లు కూలిపోగా సర్పంచ్ విజేందర్రెడ్డితోపాటు టీఆర్ఎస్ మండల ఇన్చార్జి డాక్టర్ పేర్యాల రవీందర్రావు, తక్కళ్లపల్లి సత్యనారాయణరావు బాధితులకు పరామర్శించి, ఆర్థికసాయం అందజేశారు. నడికూడ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో నడికూడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కంఠాత్మకూర్ లోలెవల్ వంతెనపై వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. నార్లాపూర్ గ్రామంలో వరద పరిస్థితులను తహసీల్దార్ వీ మహేందర్ పరిశీలించారు. ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు పెద్ద చెరువు, కటాక్షపురం పెద్ద చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. కటాక్షపురం పెద్ద చెరువు మత్తడి పోస్తుడడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ములుగు, ఏటూరునాగారం వెళ్లే ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిస్తున్నారు.
కటాక్షపురం పెద్ద చెరువును పరకాల ఏసీపీ శివరామయ్య, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, తహసీల్దార్ సురేశ్‌కుమార్, సీఐ రంజిత్‌కుమార్, ఎస్సై రాజబాబు పరిశీలించారు. శాయంపేటలోని చలివాగు ప్రాజెక్టు వరదలకు ఓవర్‌ఫ్లో అయింది. ప్రాజెక్టు సామర్థ్యం 24 అడుగులు కాగా, మంగళవారం ఉదయం వరకే 22 అడుగులకు నీటిమట్టం చేరింది. ఎగువన కటాక్షపూర్, నీరుకుళ్ల, వసంతాపూర్ చెరువులు భారీగా మత్తడి పోస్తుండడంతో చలివాగులోకి వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు రెండు మత్తళ్లు భారీ ఎత్తున పోస్తున్నాయి. అలాగే, మైలారం గ్రామంలోని పాఠశాల ప్రాంగణం వరద నీటితో నిండిపోయింది. దళిత కాలనీలు ముంపునకు గురయ్యాయి. జోగంపల్లి శివారులో పత్తి, వరి పంటలు మునిగిపోయాయి. శాయంపేట- మైలారం మధ్యలోని కాజ్వే పై వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. కొప్పుల శివారులోని లోలెవల్ వంతెన వరదతో నిండిపోయింది. పెద్దకోడెపాక కాజ్వే నిండి వరి పొలాలు మునిగిపోయాయి.