వరంగల్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి):చారిక్రత, వారసత్వ ప్రాధాన్యత ఉన్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యాటక రంగం పుంజుకుంటున్నది. కరోనా పరిస్థితుల నుంచి మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. ప్రస్తుతం నెలకు సగటున లక్ష మంది సందర్శకులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఆగస్టులో ఏకంగా 96 వేల మందికిపైగా వచ్చారు. సెప్టెంబరులో ఇప్పటికే 90 వేల మంది వివిధ ప్రాంతాలకు వచ్చారు. గతేడాదితో పోలిస్తే మూడు నెలలుగా పర్యాటకుల సంఖ్య మూ డు రెట్లు ఎక్కువగా ఉంది. గతేడాది ఏప్రిల్, మే, జూ న్, ఈ ఏడాది మే 15 నుంచి జూన్ 15 వరకు లాక్డౌన్ అమలులో ఉంది. గత లాక్డౌన్కు నెల ముం దు వెనుకా టూరిస్టుల సంఖ్య చాలా తక్కువ ఉంది. ఈ ఏడాది మాత్రం లాక్డౌన్ కాలంలో మినహా అన్ని నెలల్లోనూ టూరిస్టులు ఎక్కువగానే వస్తున్నారు. టూరిజం ఊపందుకోవడంతో దీనిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలకు ఉపాధి దొరుకుతున్నది. పర్యాటక రంగాన్ని మరింత వృద్ధి చేయడం చేసే లక్ష్యంతో ఆ శాఖ ముందుకు పోతున్నది. ఉమ్మ డి జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో కాకతీయులు, చాళుక్యుల కట్టాడాలు, బౌద్ధ నిర్మాణాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. రామప్పకు వెళ్లే క్రమం లో వేయి స్తంభాలగుడి, భద్రకాళిగుడి, ఓరుగల్లు కోట, పద్మాక్షి ఆలయం, మెట్టుగుట్ట, అగ్గలయ్య గుట్ట, ఐనవోలు, పాలకుర్తి, కుర వి, గోవిందరాజుల గుట్ట, కోటగుళ్లతోపాటు లక్నవరం, పాకాల, బొగత, తాడ్వాయి అభయారణ్యం ప్రదేశాలను సందర్శిస్తున్నారు.
నేటి నుంచి పర్యాటక ఉత్సవాలు
ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాట క దినోత్సవం జరుపుతారు. కరోనా నేపథ్యంలో మం దగించిన ఈ రంగానికి పూర్వవైభవం తెచ్చే లక్ష్యంతో ఈ నెల 24 నుంచి 27 వరకు పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించినట్లు పర్యాటక ఉమ్మడి జిల్లా అధికారి ఎం.శివాజీ తెలిపారు. 24న వరంగల్లో స్వచ్ఛ పక్వాడా, హెరిటేజ్వాక్ నిర్వహిస్తున్నారు. ‘రామప్ప’పై ఈ నెల 25న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ఈనెల 26న రామప్ప, గణపురం కోటగుళ్లు, రెడ్డిగూడెంగుడి పర్యటనతో హెరిటేజ్ టూర్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రామప్పలో హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. 27న హనుమకొండలో పర్యాటక రంగంపై సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.