తొర్రూరు, మార్చి 29 : మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో ఈ ప్రాంతంలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటుకు రూ.200 కోట్లు మంజూరు చేసినా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌లో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఆ దిశగా అడుగులు వేయడం లేదని రైతులు మండిపడుతున్నారు.
ఆయిల్‌పామ్ తోటలను విస్తారంగా పెంచి జిల్లాలోని రైతులకు అండగా ఉండేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామంలో 111 సర్వే నంబర్లో 45 ఎకరాల స్థలాన్ని కేటాయించి సుమారు రూ.200 కోట్లతో అత్యాధునిక ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. పంట సాగుకు ప్రోత్సాహం అందుతున్నా, కళ్లముందే నిధులున్నా.. పరిశ్రమ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు.
స్థానిక సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే చూపిస్తున్న ఉదాసీనత ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. 2020-21 నుంచి 2025-2026 వరకు 2,500 మందికి పైగా రైతులు 9,007 పై చిలుకు ఏకరాల్లో ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తుండగా, ఈసారి మరో 2 వేల ఎకరాల సాగు పెరుగనున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల తర్వాత దిగుబడి ప్రారంభమై రైతులకు నిత్యం పంట చేతికి వస్తుంది.
అయితే ఇప్పటికే తొర్రూరు మండలం కంఠాయపాలెం, కురవి, నెల్లికుదురు మండలాలకు చెందిన కొందరు రైతులు చేతికొచ్చిన పంటను సిద్దిపేట తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. 2028 నాటికి గోపాలగిరిలో పరిశ్రమ ప్రారంభమైతే ఇక్కడి రైతులకు అనుకూలంగా ఉండడమే కాకుండా సుమారు 3,000 మందికిపైగా స్థానిక యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పనులు ప్రారంభించినా పూర్తవడానికి సుమారు మూడేళ్లు పట్టనున్నది. ఈ క్రమంలో పరిశ్రమను నిర్మిస్తారా? లేదా? అనే అపోహ రైతుల్లో నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశ్రమ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎక్కడిపనులు అక్కడే ఉన్నాయి. 2025-26 సంవత్సరానికి పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నా, కనీసం టెండర్లు కూడా పిలువలేదు. మరో రెండేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికంగా పంట చేతికి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశ్రమ పనులు త్వరగా ప్రారంభించాలి.
– తూర్పాటి చిన్న అంజయ్య, ఆయిల్‌పామ్ రైతుల అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ