భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం/ చర్ల/ దుమ్ముగూడెం/ బూర్గంపహాడ్/ మణుగూరు టౌన్/ అశ్వాపురం, జూలై 31: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజుల వ్యవధిలోనే సుమారు 50 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు 52.30 అడుగుల వద్ద వేగంగా ప్రవహిస్తూ మూడో ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులకు చేరువ అవుతోంది. శనివారం సాయంత్రానికి 55 అడుగులకు చేరుతుందంటుందని, ఎగువ నుంచి ప్రవాహం నెమ్మదించడంతో క్రమేణా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం – వెంకటాపురం మార్గంలో రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలోని వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపును గోదావరి వరద చుట్టుముట్టింది.
అక్కడి గోదావరి పాయలోని ఇసుక ర్యాంపులో లారీ డ్రైవర్లతోపాటు 46 మంది ర్యాంపు సిబ్బంది చుక్కుకుపోయారు. లారీలు కూడా అందులోనే ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. ఆ బృంద సభ్యులు యంత్రాలు, తెప్పలపై వెళ్లి ర్యాంపు సిబ్బందిని, డ్రైవర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే, ర్యాంపు సిబ్బందిని రక్షించేందుకు తెప్పపై వెళ్తున్న చర్ల సీఐ రాజువర్మకు తృటిలో ప్రమాదం తప్పింది.
వరదలో కొద్దిదూరం వెళ్లాక తెప్ప తిరబడింది. దీంతో సీఐ చాకచక్యంగా అదే తెప్పను పట్టుకొని సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అయితే, గోదావరి వరదల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. భద్రాద్రి కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట సహా ఇతర ఉన్నతాధికారులందరూ భద్రాచలంలోనే ఉండి వరద ఉధృతిని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పరీవాహకంలో ఉన్న పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు.

గోదావరి వరదల కారణంగా భద్రాచలం – వెంకటాపురం మార్గంలో వివిధ గ్రామాల్లోకి, రహదారులపైకి వరద నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి. భద్రాచలం వద్ద గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 29.70 అడుగులున్న గోదావరి.. వేగంగా పెరుగుతూ శుక్రవారం ఉదయం 8 గంటలకు 40.20 అడుగులకు చేరుకుంది. ఉదయం 10:14 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను, మధ్యాహ్నం 3:40 గంటలకు 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్‌శ్రేష్ట జారీ చేశారు. రాత్రి 11 గంటల వరకు 52.30 అడుగుల వద్ద ప్రవహిస్తోంది.
ప్రస్తుతం భద్రాచలం వద్ద 14,44,645 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లోని జలాశాయాల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండడంతోపాటు గోదావరి ఉప నదులైన ఇంద్రావతి, ప్రాణహిత, తాలిపేర్ల భారీగా వరద నీరు వస్తోంది. దీంతో శనివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగుల వరకు చేరే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఎగువన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షం కురుస్తుండడంతో గోదావరికి భారీగా వరద నీరు వస్తోంది.
మైనింగ్ శాఖ నుంచి టెండరు పొందిన కొందరు కా్రంటాక్టర్లు.. చర్ల మండలం వీరాపురంలో ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. ర్యాంపులో ఇసుక లోడింగ్ కోసం లారీలు వచ్చాయి. లోడింగ్ చేసే సిబ్బందితోపాటు లారీల డ్రైవర్లు కలిపి మొత్తం 46 మంది అక్కడే ఉన్నారు. ఇంతలో వరద ఉధృతి పెరగడంతో గోదావరి పాయ ఒకటి ఆ ఇసుక ర్యాంపు చుట్టుముట్టింది. దీంతో వారంతా ఆ వరదలో చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న చర్ల తహసీల్దార్ మొగిలి శ్రీనివాసరావు, సీఐ రాజువర్మ తమ సిబ్బందితోపాటు రెస్క్యూ బృందాన్ని వెంటబెట్టుకొని హుటాహుటిన గోదావరి ఒడ్డుకు వెళ్లారు. యంత్రాలు, తెప్పల ద్వారా రెస్క్యూ బృందాలను పంపి పాయలో చిక్కుకున్న అందరినీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే, ర్యాంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తెప్పపై వెళ్తున్న చర్ల సీఐ రాజువర్మ.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన వెళ్తున్న తెప్ప.. ఒక్కసారిగా తిరిగబడింది. దీంతో వెంటనే ఆయన చాకచక్యంగా అదే తెప్పను పట్టుకొని ఒడ్డుకు చేరారు.
దుమ్ముగూడెం హెడ్ లాకుల ప్రాంతంలో 26 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. పుణ్యక్షేత్రమైన పర్ణశాల నారచీరల వద్ద సీతాకుటీరం ప్రదేశం పూర్తిగా నీట మునిగింది. అక్కడ ఉన్న దుకాణ సముదాయాలను అధికారులు, యజమానులు మూసివేశారు. పర్ణశాల రహదారిపైకి వరద నీరు రావడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పర్ణశాలకు వెళ్లకుండానే వెనుదిరుగుతున్నారు. బైరాగులపాడు, సున్నంబట్టి గ్రామాల మధ్య ఉన్న రహదారిపైకి వరద నీరు చేరడంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. తూరుబాక వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం – చర్ల ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మణుగూరు చినరావిగూడెం పుష్కర ఘాట్ వద్ద వరదనీరు పైకి తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది.
గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట సూచించారు. వరద ఉధృతిని తమ యంత్రాంగమంతా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని అన్నారు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ప్రవహిస్తుండడంతో కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు శుక్రవారం గోదావరి కరకట్టపైకి వచ్చి వరద ఉధృతిని పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ స్లూయిజ్ వద్ద వరద నీటి పారుదల పరిస్థితి, మోటర్ల పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్నానఘాట్ల వద్ద పరిస్థితిని పరిశీలించారు. గోదావరిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను అనుమతించవద్దని స్పష్టం చేశారు.

నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. కూనవరం – భద్రాచలం ప్రధాన రహదారిపై గోదావరి వరద నీరు ఎకడ వరకు చేరిందనే వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వరద పెరిగినా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భద్రాచలం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ 24 గంటలపాటు పనిచేస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 08744-241950, 08743- 232444 నంబర్లకు ఫోన్ చేయొచ్చునని, 9392919743 నంబరుకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించొచ్చునని సూచించారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని సూచించారు. సెల్ఫీలు, వీడియోల కోసం వరద వద్దకు వెళ్లవద్దని; అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలని ఎస్పీ సూచించారు.
ప్రవాహం పెరుగుతుండడంతో పరీవాహక ప్రాంతాలను వరద చుట్టుముడుతోంది. దీంతో ప్రాంతాల్లో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక బ్రిడ్జి వద్ద వరద రోడ్డుపైకి రావడంతో భద్రాచలం – చర్ల దుమ్ముగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల – వెంకటాపురం మధ్యలో వీరభద్రవరం బ్రిడ్జి వద్ద రోడ్డు మునిగిపోవడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాలను గోదావరి చుట్టుముట్టింది. సున్నంబట్టి గ్రామం వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరుకోవడంతో ఆ గ్రామస్తులను అధికారులు ఖాళీ చేయించి మంగువాయిబాడువ ఆశ్రమ పాఠశాలకు తరలిస్తున్నారు. భద్రాచలంలో సైతం అశోకనగర్ కొత్తకాలనీ, సుభాశ్‌నగర్ కాలనీవాసులను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. వరద పెరిగితే పునరవాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.