న్యూయార్క్ ఏషియా సొసైటీ వేదిక మీద భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రానున్న ఆహార సంక్షోభం గురించి చేసిన హెచ్చరికను ఏదో సాధారణ వ్యాఖ్యగా తీసుకోలేం. ఆయన చేసిన హెచ్చరిక కొత్తగా పుట్టుకు వచ్చింది కాదు. కొన్నాళ్లుగా దానిపై దేశంలో చర్చ నలుగుతూనే ఉన్నది. గోడదెబ్బ, చెంపదెబ్బ అన్నట్టుగా అంతర్జాతీయ సమస్యలు ఓ వైపు, పర్యావరణ క్షీణత మరోవైపు నుంచి తరుముతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఇరాన్‌పై అమెరికా యుద్ధం, అంతర్జాతీయంగా చమురు, ఎరువుల సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నాయి.
అమెరికా విధిస్తున్న పరిహార ఆంక్షలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, ఇంధన ధరల అస్థిరత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ సంక్షోభం భారత్ మీద ఎంత ప్రభావం చూపుతున్నదో నిర్ణయించేది మన దేశీయ సంసిద్ధత, విధానాల పటిష్టత, రాజకీయ విజ్ఞత మాత్రమే. దిగుమతులపై అధికంగా ఆధారపడటం భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాన బలహీనత. ఇంధనం, ఎరువులు, ముడిసరుకుల విషయంలో విదేశీ మార్కెట్లపై ఆధారపడటం వల్ల అంతర్జాతీయ ధరలు పెరిగితే దేశీయంగా ఆ భారం మోయక తప్పదు. మరోవైపు సబ్సిడీలు పెంచాల్సి రావడం సహజం, ఆర్థిక లోటు పెరుగుదల, పరిమిత ఆదాయ వనరులు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సామర్థ్యానికి పరీక్షలుగా మారాయి.
ఇక ఎల్ నినో ప్రభావం ఈ సవాళ్లకు మరొక అదనపు ముప్పును జోడిస్తున్నది. సాధారణంగా ఎల్ నినో వల్ల వర్షపాతం తగ్గిపోయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. దీనివల్ల పంటలు దెబ్బతిని ఆహార కొరత ఏర్పడుతుంది. మహారాష్ట్రలో ఇప్పటికే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మన రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తంగా చూస్తే వర్షపాతం సాధారణ స్థాయిలో ఉన్నట్టు చెప్తున్నప్పటికీ, 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఇటీవలి వర్షపాతం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగస్టులోనే సుమారు 38 శాతం వరకు వర్షాభావం నమోదవడం, మొత్తం మాన్సూన్ కూడా సాధారణ స్థాయికి తగ్గిపోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఏర్పడిన వర్షాభావంలో భాగమే ఇది. దేశం మొత్తం గత దశాబ్దంలోనే కనిష్ఠ వర్షపాతం నమోదవడం ఈ సమస్యకు స్పష్టమైన సూచన. నాగార్జునసాగర్ వంటి కీలక జలాశయాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో నిండలేదు. ప్రవాహాలు అస్థిరంగా ఉండటం వల్ల భవిష్యత్ నీటి లభ్యతపై స్పష్టత లేదు. ముఖ్యంగా సెప్టెంబర్అక్టోబర్లో వచ్చే ప్రవాహాలపై ఆధారపడే పరిస్థితి గతంలో ఉన్నా, ఇప్పుడు వర్షాల అస్థిరత కారణంగా ఆ నమ్మకం తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నది. దక్షిణ భారత రాష్ర్టాల రిజర్వాయర్లు కేవలం సుమారు 50 శాతం సామర్థ్యంతోనే ఉండటం సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అందుబాటులో ఉన్న ప్రాజెక్టులను పడావుపెట్టి, పెండింగ్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల సాగునీరు తగిన స్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. భూగర్భ నీటిమట్టాలు భారీగా పడిపోతున్నాయి. మరోవైపు పంట పెట్టుబడుల సమస్య వేధిస్తున్నది. ఇవన్నీ వెరసి సాగును సంకటంలో పడేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆహార కొరత లేకపోయినప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరల పెరుగుదల సమస్య మాత్రం తీవ్రంగానే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
బహిరంగ మార్కెట్లో ఈసరికే రూ.70 దాటిన బియ్యం ధరలు సెంచరీ కొడతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉల్లిగడ్డల ధరలు కూడా కిలో రూ.60 దాటిపోయాయి. ఇక కూరగాయలు, ఇతర సరుకుల ధరలు సామాన్యులకు మోయరాని భారంగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆహార సమస్య తీవ్రరూపం దాల్చవచ్చని విదేశాంగమంత్రి చేసిన హెచ్చరిక ప్రాముఖ్యం సంతరించుకున్నది. ధరల సమస్య స్థానంలో తీవ్రమైన ఆహార కొరత ఎదురుకాకుండా చూడటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెనుసవాల్‌గా ఉంటుంది. తక్షణం వ్యవసాయరంగ సమస్యలపై అవి సమన్వయంతో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. అంతకన్నా ముందు ధరల తగ్గుదలకు చొరవ తీసుకోవాల్సి ఉన్నదని చెప్పక తప్పదు.