ప్రతి పేద ఇంట్లోనూ కల్యాణ మంజీరాలు మోగాలని, ప్రతి నిరుపేద కుటుంబంలోనూ కల్యాణ కాంతులు వెల్లివిరియాలని స్వప్నించిన ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిష్ఠతో, నిజాయితీగా అమలుచేసిన అద్భుత సామాజిక పథకం కల్యాణలక్ష్మి. దీనినే ముస్లిం మైనారిటీల కోసం షాదీముబారక్ పేరుతో అమలు చేశారు.ఒక పేదింటి ఆడబిడ్డ పెండ్లి అంటే ఆ ఇంటికి పండుగే కాదు..ఒక పెద్ద పరీక్ష కూడా. ఏండ్ల తరబడి కూడబెట్టుకున్న సొమ్ము చాలదు. అప్పులు చేయాలి. ఉన్న కొద్దిపాటి ఆస్తిని తాకట్టు పెట్టాలి. బంధువుల సాయం కోరాలి. చివరికి తల్లిదండ్రుల గుండెల్లో జవాబు దొరుకని ప్రశ్న..
‘నా బిడ్డ పెండ్లి గౌరవంగా ఎలా చేయాలి’? అలాంటి సందర్భంలో..ఆ కుటుంబానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కేవలం ఒక నగదు పథకం మాత్రమే కాదు. సమాజంలో అది ఒక తండ్రికి ధైర్యం, ఒక తల్లికి భరోసా, ఒక ఆడబిడ్డకు గౌరవం. ఒక కుటుంబానికి పరువు ప్రతిష్టల అంశం! అదే కల్యాణలక్ష్మి/షాదీముబారక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో, 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తొలుత ఈ పథకం కింద రూ.51 వేలుగా ఉన్న ఆర్థిక సహాయం తర్వాత రూ.75,116కు, ఆపై రూ.1,00,116కు పెంచారు.
పేద కుటుంబాలపై బిడ్డ పెండ్లి భారం తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. కల్యాణలక్ష్మి పన్నెండేండ్ల ప్రయాణం పూర్తవుతున్న సందర్భంగా..ఈ పథకాన్ని మరోసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన, సమీక్షించుకోవాల్సిన సమయమిది. ఎందుకంటే..ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం కథ మాత్రమే కాదు. లక్షలాది పేద కుటుంబాల ఆశలు, ఆందోళనలు, ఆనందాలతో ముడిపడిన ఒక సామాజిక కథ.
కల్యాణలక్ష్మి ఆవిర్భావం వెనుక కేసీఆర్ చెప్పిన ఒక దయనీయ ఘటనను, మానవీయ అనుభవాన్ని ఈ సందర్భంలో తప్పకుండా గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో..ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ వందలాది గ్రామాల్లో పర్యటించి ఉద్యమ చైతన్యాన్ని రగిల్చారు.
అలాంటి సందర్భంలో ఒక ఊరిలో పర్యటిస్తుండగా..ఒక పేద కుటుంబం అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన ఘటన ఆయన దృష్టికి వచ్చింది. ఆడబిడ్డ పెండ్లికి దాచుకున్న సొమ్ము, వస్తువులు అగ్నికి ఆహుతైన సందర్భం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఆ అమ్మాయి పెండ్లి చేయలేక ఆమె తల్లిదండ్రులు పడిన మనోవేదన ఆయనలో కొత్త ఆలోచను రేకెత్తించింది. ఆ ఆలోచన ఫలితమే కల్యాణలక్ష్మి ఆవిర్భావానికి కారణమని కేసీఆర్ తన ప్రసంగాల్లో ప్రస్తావించారు.
ఒక ఆడబిడ్డ పెండ్లి కేవలం డబ్బుల్లేక ఆగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? పేద కుటుంబం తమ కుమార్తె పెండ్లిని సగౌరవంగా జరుపుకోలేని పరిస్థితి ఎందుకు ఉండాలి? అనే ఆలోచన నుంచే ఈ పథకానికి రూపకల్పన జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. మైనారిటీ కుటుంబాల కోసం షాదీముబారక్ పేరుతో ఇదే తరహా సహాయాన్ని అందించారు. పన్నెండేండ్లలో 16.78 లక్షల మందికి సాయం! ఒక పథకం ఎంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందో తెలుసుకోవాలంటే ఈ గణాంకాలే ప్రధాన ఆధారం.
తాజాగా వెల్లడైన ప్రభుత్వ వివరాల ప్రకారం, 2014లో ప్రారంభమైనప్పటి నుంచి కల్యాణలక్ష్మిషాదీముబారక్ పథకాల కింద 16,78,347 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. ఈ పథకాల కోసం రూ.16,375.87 కోట్లు ఖర్చయ్యాయి. ఇందులో..వర్గాల వారీగా ఎస్సీలు 2,73,164 మంది, ఎస్టీలు 1,79,939 మంది, బీసీలు 7,79,401 మంది, ఈబీసీలు 83,074 మంది, మైనారిటీలు 3,62,769 మంది ప్రయోజనం పొందారు. అంటే దాదాపు 16.78 లక్షల కుటుంబాల వివాహ జీవితాల్లోకి ఈ పథకం చేరింది. కొందరు ఈ సహాయాన్ని తమకు దేవుడిచ్చిన అన్న కానుకగా భావించారు. మరికొందరు తమకు మేనమామ ఇచ్చిన బహుమతిలా చూశారు. అలా కేసీఆర్ పేదల గుండెల్లో, గుడిసెల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు!
ఈ రోజుల్లో ఒక మధ్యతరగతి కుటుంబమే కుమార్తె వివాహానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితిలో, ఒక నిరుపేద కుటుంబానికి రూ.1,00,116 సహాయం చిన్న విషయం కాదు. అది పెండ్లి ఖర్చులో ఒక ముఖ్యమైన భాగాన్ని భరించే అండ కావచ్చు. అప్పు కొంత తగ్గించవచ్చు. తల్లిదండ్రుల ఆందోళనను కొంతైనా తగ్గించవచ్చు. అందుకే ఈ పథకాన్ని సామాజిక భరోసా కార్యక్రమంగా కూడా చూడాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకంలో భాగంగా లక్షా నూట పదహారు రూపాయలతో పాటు అదనంగా ఒక తులం బంగారం కూడా ఇస్తామని వాగ్దానం చేసింది. గెలిచిన తర్వాత ఆ హామీని నిస్సిగ్గుగా తుంగలో తొక్కింది.
తులం బంగారం మాట దేవుడెరుగు.. చివరికి రూ.1,00,116లకు కూడా దిక్కు లేకుండా పోయింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన, నిధుల విడుదల, చెల్లింపుల్లో జాప్యాలపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కొంతమంది లబ్ధిదారులు పెండ్లి అయిన తర్వాత, పిల్లలు పుట్టినరోజు తర్వాత కూడా సహాయం కోసం ఎదురుచూస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి.
కల్యాణలక్ష్మి విజయాన్ని ఒక పార్టీ విజయంగా మాత్రమే చూడటం ఎంత పరిమిత దృష్టో, దానిని ఏదో కారణంగా కొట్టిపారేయడం, రద్దు చేయడానికి ప్రయత్నించడం కూడా కూడా అంతే పరిమిత దృష్టి. దుర్బుద్ధి! పన్నెండేండ్ల తర్వాత కల్యాణలక్ష్మిని గుర్తుచేసుకోవడమంటే గతాన్ని మాత్రమే కాదు..ఒక సామాజిక ఆలోచనను, విప్లవ భావనను గుర్తు చేసుకోవడం. ప్రభుత్వం ఏదైనా కావచ్చు. పాలకులు ఎవరైనా కావచ్చు. కానీ పేదింటి ఆడబిడ్డ పెండ్లి విషయంలో ప్రభుత్వ చేయూత మాత్రం సమయానికి, పారదర్శకంగా, అర్హులందరికీ అందాలి.. కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకం కేసీఆర్ మానసపుత్రిక. అది ఆయన సృష్టించిన చరిత్ర. అది కేసీఆర్ చేవ్రాలు మాత్రమే కాదు ఆనవాలు!
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-వీరేంద్ర కాపర్తి