రెండు ప్రపంచ యుద్ధాలు, అణుబాంబుల విధ్వంసం, సామ్రాజ్యవాద దురహంకారం రాజ్యమేలిన ఇరవయ్యో శతాబ్దంలో.. చేతిలో ఊతకర్ర, ఒంటిపై కొల్లాయి, పక్కన రాట్నం తప్ప మరేమీ లేని ఒక బక్కపలుచని మనిషి, ఒక్క తూటా కూడా పేల్చకుండా సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. ఆయనే మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.
1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్లో జన్మించిన ఆ మహాత్ముడి 157వ జయంతి నేడు. 1893లో దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్లో, మొదటి తరగతి టికెట్ ఉన్నప్పటికీ తెల్లజాతీయుడు కాదన్న కారణంతో యువ న్యాయవాది అయిన గాంధీని రైలు నుంచి బయటకు నెట్టేశారు. ఆ అవమానానికి ఆయన ప్రతీకారంతో కాదు, ఒక సిద్ధాంతంతో సమాధానం చెప్పారు.
గాంధీజీ 1906లో దక్షిణాఫ్రికాలో ‘సత్యాగ్రహం‘ అనే సరికొత్త పోరాట రూపానికి ప్రాణం పోశారు. సత్యాన్ని ఆయుధంగా, అహింసను కవచంగా, స్వీయ త్యాగాన్ని శక్తిగా మలిచిన ఆ ప్రయోగం అంతకుముందు ఏ రాజకీయ ఉద్యమంలోనూ కనిపించదు. 1920లో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమం దేశమంతటా ఉవ్వెత్తున ఎగసిపడింది. 1922లో చౌరీచౌరాలో ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఉద్యమం విజయపు అంచున ఉన్నా, హింస చోటుచేసుకున్నదన్న కారణంతో గాంధీజీ మొత్తం ఉద్యమాన్నే నిలిపివేశారు.
సొంత సహచరులే విస్తుపోయారు, విమర్శించారు. కానీ లక్ష్యం ఎంత గొప్పదైనా మార్గం పవిత్రంగా ఉండాలన్నది ఆయన అచంచల విశ్వాసం. గెలుస్తున్న ఉద్యమాన్ని నైతిక విలువల కోసం ఆపివేసిన నాయకుడు చరిత్రలో మరొకరు కనిపించరు.1930లో పేదవాడి వంటింట్లో ఉండే అతి సాధారణ వస్తువు ఉప్పును ఆయన ఆయుధంగా ఎంచుకున్నారు. శాసనోల్లంఘన ఉద్యమం దేశమంతటా వ్యాపించింది. 1942 ఆగస్టు 8న ‘క్విట్ ఇండియా‘ ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారు. ఆ ఒక్క నినాదం దేశాన్ని ఏకం చేసింది.
బ్రిటిష్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని స్పష్టం చేసింది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. 1948 జనవరి 30న ప్రార్థనా సభకు వెళ్తుండగా గాడ్సే తూటాలకు నేలకొరిగిన క్షణంలోనూ ఆయన పెదవులపై ‘హే రామ్” అనే రామనామమే ఉన్నది. జీవితాన్నంతా దేశానికి అర్పించిన కర్మయోగి ఆయన.
గాంధీ సిద్ధాంతం ఎంత సజీవమైనదో చెప్పడానికి తెలంగాణ మలిదశ ఉద్యమమే నిలువెత్తు సాక్ష్యం. 2001లో కేసీఆర్ ప్రారంభించిన ప్రత్యేక రాష్ట్ర పోరాటం ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ, శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నది. నా దృష్టిలో ఆ ఉద్యమంలోని ప్రతి కీలక ఘట్టం గాంధీ మార్గానికి ప్రతిబింబమే. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే ఆయన నినాదం, క్విట్ ఇండియా వేళ గాంధీజీ ఇచ్చిన ‘డూ ఆర్ డై‘ నినాదానికి ప్రతిధ్వని. ఆ దీక్ష ఫలితంగానే 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉపవాసాన్ని నైతిక ఒత్తిడికి ఆయుధంగా మలచడం అచ్చంగా గాంధీ పద్ధతే.
సహాయ నిరాకరణ ఉద్యమం తరహాలోనే 2011లో సకల జనుల సమ్మె జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్‌డౌన్ చేశారు. ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది, న్యాయవాదులు, విద్యార్థులు అందరూ కదిలారు. పాలనా యంత్రాంగం స్తంభించిపోయింది. గాంధీజీ చూపిన దారిలోనే తెలంగాణ సమాజం ఆచరించి చూపించింది. దండి యాత్రలాగే 2011 మిలియన్ మార్చ్, 2012 సాగరహారం లక్షలాది మందిని ఒక్కచోటికి చేర్చాయి. వంటావార్పు, రైల్ రోకో, రాస్తారోకో, ధూంధాం ఆటాపాటలు.. ఇవన్నీ ఆయుధం లేని ఆందోళనలే. ఆరు దశాబ్దా ల ఆకాంక్ష, అంతులేని వివక్ష ఉన్నప్పటికీ ఉద్య మం విధానాలపైనే గురిపెట్టింది తప్ప మనుషులపై కాదు. ఉద్యమం శాంతియుతంగానే సాగింది. చివరకు పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
గాంధీ మార్గం మన దేశానికే పరిమితం కాలేదు. 1959లో భారత్‌ను సందర్శించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికా పౌరహక్కుల ఉద్యమానికి గాంధీ పోరాట పంథానే ఎంచుకున్నారు. జాతి వివక్షపై పోరాడిన నెల్సన్ మండేలాకు గాంధీజీ స్ఫూర్తిగా నిలిచారు.
ఎం దరో మహనీయులు ఇదే బాటలో నడిచారు. 2007లో ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. గాంధీ మార్గం చరిత్రలో ఒక అధ్యాయం మా త్రమే కాదు.. ప్రపంచానికి ఒక విజయవంతమైన నమూనా. ఆయన సిద్ధాంతాన్ని యువత అధ్యయనం చేసి, ఆ బాటలో నడుస్తామని ప్రతి జ్ఞ చేయడమే మనం అర్పించే నిజమైన నివా ళి.
(వ్యాసకర్త: న్యాయవాది)
-కారుపోతుల రేవంత్ 8985771375