సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలో ఎల్ఈడీ వీధి దీపాల సరఫరా, నిర్వహణ టెండర్ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును ఓ నిర్దిష్ట సంస్థకు కట్టబెట్టేందుకు అధికారులు టెండర్ నిబంధనలను అడ్డగోలుగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ షరతులపై ఇతర సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వెలుగులు నింపాల్సిన రూ. 1,341 కోట్ల మెగా ప్రాజెక్టులో అక్రమాల చీకట్లు కమ్ముకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టెండర్ల కేటాయింపులో పోటీతత్వాన్ని పెంచేలా, అర్హత ఉన్న ప్రతి సంస్థకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా సీవీసీ మార్గదర్శకాలు ఉంటాయి. జీహెచ్ఎంసీ వర్గాలు మాత్రం ఒక నిర్దిష్ట కంపెనీని మాత్రమే విజేతగా నిలిపేందుకు నిబంధనల గ్రాఫ్‌ను దారుణంగా మార్చేశాయనే విమర్శలొస్తున్నాయి. ఈ రూల్స్ సడలించడం వెనుక కోట్లాది రూపాయల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పీఠం నీడలో ఉన్న సినీ నిర్మాత, ముఖ్య నేత అనుచరుడికి లాభం చేకూర్చేందుకే ఈ కోట్ల రూపాయల టెండర్ల షరతులను చక్రం తిప్పారనే చర్చ జరుగుతున్నది.
క్యూర్ పరిధిలోని మూడు (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) మున్సిపల్ కార్పొరేషన్లలో వీధి దీపాల సమగ్ర నిర్వహణ, ఆధునీకరణకుగానూ రూ.1341 కోట్ల పనులను జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. రాబోయే 10 సంవత్సరాల పాటు వీధి దీపాలు, సీఎంఎంఎస్ ప్యానెళ్లు, అనుబంధ మౌలిక వసతుల సమగ్ర నిర్వహణ కోసం నిపుణులైన సంస్థల నుంచి బిడ్డలను ఆహ్వానిస్తూ జీహెచ్ఎంసీ గత నెల 21న ప్రతిపాదనల అభ్యర్థన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఐతే 10 ఏళ్ల కాలపరిమితికిగానూ కేటాయించనున్న ఈ సమగ్ర నిర్వహణ టెండర్లలో మొదటి నుంచీ పారదర్శకత కొరవడిందనే విమర్శలు లేకపోలేదు. ఈ ప్రాజెక్టును దకించుకోవడానికి సాంకేతికంగా, ఆర్థికంగా కనీస అర్హతలు లేని ఒక కార్పొరేట్ సంస్థకు మార్గం సుగమం చేసేందుకు రాత్రికి రాత్రే నిబంధనలను మార్చేశారనేది ప్రధాన ఆరోపణ. గతంలో ఉన్న టర్నోవర్, అనుభవం వంటి కఠినమైన షరతులను సదరు ప్రియమైన కంపెనీకి సరిపోయేలా కుదించి వేశారని టెం డర్ పోటీదారులు మండిపడుతున్నారు. మిగతా ఏజెన్సీలను డిస్ క్వాలిఫై చేసేందుకు సరికొత్త మెలికలు పెట్టి, ఒకే ఒక కంపెనీకి రెడ్‌కార్పెట్ పరిచారన్న ప్రచారం జరుగుతున్నది.
ఈ మెగా టెండర్లో పాల్గొనే ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ అర్హతా ప్రమాణాలను నిర్దేశించింది. టెండర్లో పాల్గొనే ప్రధాన బిడ్డర్ గత మూడేళ్లలో (2023-24, 20 24-25, 2025-26) సగటున రూ. 400 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగి ఉండా లి. అలాగే గత మూడేళ్లలో కనీసం 10% వార్షిక కాంపౌండ్ గ్రోత్ రేట్ సాధించి ఉండాలి. సంస్థ పేరు మీద రూ. 134.16 కోట్లకు తగ్గకుండా బ్యాంక్ బాలెన్సీ సర్టిఫికెట్ సమర్పించాలి. గత ఏడేళ్లలో ఏదైనా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా పురపాలక సంఘాలలో కనీసం 2 ఏళ్ల సంతృప్తికర నిర్వహణ అనుభవం ఉండాలి. రూ. 30 కోట్ల విలువైన ఒకే పని, లేదా రూ. 20 కోట్ల విలువైన రెండు పనులు, లేదా రూ. 15 కోట్ల విలువైన మూడు పనులను విజయవంతంగా నిర్వహించి ఉండాలి.
గత 7 ఆర్థిక సంవత్సరాల్లో ఒకే కాంట్రాక్ట్ ద్వా రా కనీసం 7,000 సీఎంఎంఎస్ యూనిట్లను సరఫరా చేసి, అమర్చిన అనుభవం ఉండాలి. ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్, ఓ అండ్ ఎం నిర్వహించే లీడ్ బిడ్డర్ లేదా జేవీ భాగస్వామికి తప్పనిసరిగా గ్రేడ్-ఏ ఎలక్ట్రికల్ లైసెన్స్ ఉండాలి. జాయింట్ వెంచర్ భాగస్వాముల్లో ఒకరు గత ఏడేళ్లలో కనీసం 7,000 సీసీఎంఎస్ యూనిట్లను తయారు చేసిన ఓఈఎం(తయారీదారు) అయి ఉండాలి. అంతేకాకుండా ఆ తయారీదారు టర్నోవర్ మూడేళ్లలో ఏదో ఒక ఏడాది లైటింగ్ బిజినెస్ నుంచి రూ. 400 కోట్లు దాటి ఉండాలి. పౌరులకు క్వాలిటీ స్ట్రీట్ లైటింగ్ అందించేందుకు, పారదర్శక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయాలి.
ఈ ప్రాజెక్టులో టెండర్ల నిబంధనల సవరణలపై అంతర్జాతీయ సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. బిడ్డర్ల అర్హత నిబంధనల్లో మాత్రం అధికారులు విచిత్రమైన షరతులు విధించారు. సెంట్రలైజ్డ్ కమాండ్ అండ్ మోనిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్) ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యానుఫ్యాక్చరర్ (ఓఈఎం) క్రెడెన్షియల్స్ తప్పనిసరి చేయడమే కాకుండా… ఒకే ఒక కాంట్రాక్టు కింద ఏకంగా 7,000 క్వాంటిటీ (పరిమాణం) కలిగి ఉండాలని నిబంధన విధించారు. సీసీఎంఎస్ అనుభవాన్ని ఒకే ఆర్డర్ ద్వారా చూపించమనడం సరైంది కాదని, వివిధ ప్రాజెక్టుల ద్వారా సాధించిన ‘సమీకృత అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నా యి. ఈ క్లిష్టమైన షరతులన్నీ ‘ఫిలిప్స్’, ‘విన్సీ’ సంస్థల జాయింట్ వెంచర్ (జేవీ)కి లబ్ధి చేకూర్చేందుకే కావాలని చేర్చారని ప్రీ బిడ్ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సదరు జేవీకి ముందస్తుగానే కాంట్రాక్టు కట్టబెట్టేలా టెండర్ డాక్యుమెంట్ తయారు చేశారని ఆరోపించినట్లు సమాచారం.
కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) , పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ (జీఎఫ్ఆర్) మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ టెండర్లలో గరిష్ఠ పారదర్శకత, విసృ్తత భాగస్వామ్యానికి అవకాశం కల్పించాలి. కానీ జీహెచ్ఎంసీ వైఖరి వీటికి పూర్తి విరుద్ధంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. అర్హత కలిగిన ప్రతినిధులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా సీసీఎంఎస్/ఓఈఎం క్రెడెన్షియల్స్ కోసం సమీకృత అనుభవాన్ని అ నుమతించాలని, 7,000 క్వాంటిటీ సింగి ల్ కాంట్రాక్ట్ నిబంధనను తక్షణమే సడలించాలని పలు సంస్థలు జీహెచ్ఎంసీని డిమాండ్ చేస్తున్నాయి. పోటీ తగ్గించి, ఖజానాకు గండికొట్టేలా ఉన్న ఈ నిబంధనలను సవరించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అర్హతల సడలింపు కోసం ప్రీ-బిడ్ సమావేశంలో పలువురు సంస్థల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పో తుందని, సంస్థల ఆందోళనలను, అభ్యంతరాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా, ప్రస్తుత రూపంలోనే టెండర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి మొండిగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. టెండర్ సవరణలు జరపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ నెల 3న బిడ్లు తెరిచాక ముఖ్య నేత అనుచరుడి జాయింట్ వెంచర్ ప్రాజెక్టుకి పనులు కట్టబెడతారా? లేక అభ్యంతరాల నేపథ్యంలో టెండర్ల ప్రక్రియపై రగడ ముదిరి విచారణకు దారితీస్తుందా? అనేది వేచి చూడాల్సిందే..!