రవీంద్రభారతి, సెప్టెంబర్ 13: ఎక్సైజ్‌శాఖలో ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన సీఐ, ఎస్ఐ బదిలీలపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాచాల మాట్లాడుతూ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కమిషనర్ హరికిరణ్ తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆయనను రాష్ట్రం నుంచి సాగనంపాలని డిమాండ్ చేశారు. సీఐ, ఎస్ఐల బదిలీల్లో నిబంధనలకు పాతరేస్తూ డబ్బులు ఇచ్చినవారికే మంచి పోస్టింగ్స్ ఇచ్చారని విమర్శించారు. ఒక్కో పోస్టుకు రూ. 30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ముడుపులు తీసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతోపాటు ఖమ్మం జిల్లా భద్రాచలంలో గంజాయి కేసులో ఫోర్జరీ సంతకాలు చేసిన సీఐపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
పట్టుకున్న గంజాయిని తక్కువగా చూపించి మిగిలింది అమ్ముకుని కోట్లు దండుకున్నాడని ఆనేక ఆరోపణలు ఉన్నాయని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించిన అవినీతి అధికారులను కమిషనర్ ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. కమిషనర్ హరికిరణ్‌ను తిరిగి ఆంధ్రా ప్రాంతానికి సాగనంపే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖలో ఇంత జరుగుతున్నా సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.