న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో సూపర్ ఇంటెలిజెంట్ కంప్యూటర్ వ్యవస్థల వల్ల కలిగే ప్రమాదాలను ప్రస్తావిస్తూ, దాని అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని ఆంత్రోపిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డారియో అమోడై చేసిన పిలుపునకు ఓపెన్ ఏఐ బాస్ సామ్ ఆల్ట్మాన్, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చారు. సైబర్ దాడులు, బయోటెర్రరిజం కోసం ఏఐని దుర్వినియోగం చేయడం, దానిపై నియంత్రణ కోల్పోవడం వంటి తీవ్రమైన ప్రమాదాలను ఎత్తిచూపుతూ అమోడై తన వ్యక్తిగత వెబ్సైట్లో ఒక పోస్ట్ చేశారు.
ఆంత్రోపిక్, దాని ప్రత్యర్థి ఓపెన్ ఏఐ సంస్థలు ఈ దశాబ్దం ముగిసేనాటికి మనందరినీ అంతం చేయగల సాంకేతికతలను తయారు చేయడానికి పోటీ పడుతున్నాయని ఆంత్రోపిక్ మాజీ పరిశోధకుడు ఒకరు హెచ్చరించిన తరుణంలోనే అమోడై ఈ పోస్ట్ చేయడం గమనార్హం. దీనిపై ఆల్ట్మాన్ ప్రతిస్పందిస్తూ సరిహద్దు సాంకేతికతల వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉన్నదనే విషయంలో తాను అమోడైతో ఏకీభవిస్తున్నానని, గత కొన్ని వారాలుగా ఓపెన్ ఏఐలో ఇది ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నదని చెప్పారు. స్వతంత్ర విశ్లేషకులకు ఉద్యోగులతో సమానమైన యాక్సెస్ ఇవ్వాలనే అమోడై ఆలోచనను సమర్థిస్తూ.. మేము కూడా అలాగే చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎలాన్‌మస్క్ స్పందిస్తూ డారియో చెప్పింది నిజం అని అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఏఐ డూమ్స్‌డే చర్చ టెర్మినేటర్ సినిమాల్లోని పరిస్థితుల చుట్టూ తిరుగడం లేదని, ఇది ప్రధానంగా మానవులు దీనిని దుర్వినియోగం చేయడం లేదా ఏఐపై నియంత్రణ కోల్పోవడంపైనే దృష్టి సారిస్తున్నదని ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ నివేదించింది. కొన్ని నెలలుగా ఏఐ అభివృద్ధి పుంజుకున్నదని, తదుపరి తరం ఏఐని నిర్మించడంలో ఏఐ స్వయంగా సహాయపడే సామర్థ్యం పెరగడమే ఇందుకు ఒక కారణమని అమోడై తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలా స్వయం సమర్థతను పెంచుకోవడం పట్ల ఆయన హెచ్చరిస్తూ, ఇది ఏఐ వ్యవస్థలను అర్థం చేసుకునే, నియంత్రించే మానవాళి సామర్థ్యాన్ని మించిపోగలదని అన్నారు. ఆంత్రోపిక్ మాజీ పరిశోధకుడు కాక్సన్ వ్యాఖ్యలపై అమోడై మాట్లాడుతూ.. తాను ఆ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు.
అయినప్పటికీ ఆంత్రోపిక్ అత్యంత బాధ్యతాయుతమైన సంస్థ అని అన్నారు. ‘ఆయన మనల్ని వేలెత్తి చూపడం లేదు. పరిశ్రమ మొత్తం చాలా వేగంగా ముందుకు సాగుతున్న తీరుపైనే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు’ అని అమోడై తెలిపారు. నియంత్రణ కోల్పోయే సందర్భానికి వస్తే, స్వయంగా కాపీలు చేసుకోగల, స్వయంగా మెరుగుపడగల అత్యంత తెలివైన ఏఐ ఏజెంట్లు వారి సొంత లక్ష్యాలను వెతుక్కునే ప్రమాదం ఉన్నదనే భయాలు ఉన్నాయి. మరోవైపు సామర్థ్యం ఉన్న ఏఐని మానవులు కూడా వినాశనం సృష్టించడానికి అంటే కొత్తరకం వైరస్‌లను సృష్టించడం లేదా సైబర్ దాడులకు పాల్పడటం వంటి వాటికి ఉపయోగించవచ్చు.

జులై 2026లో జరిగిన ఓపెన్ ఏఐ హగ్గింగ్ ఫేస్ ఘటన ఏఐపై నియంత్రణ కోల్పోతామనే ఆందోళనలను మరింత పెంచింది. ఈ ఘటనను అమోడై కూడా ప్రస్తావించారు. ఇది ఒకే ఒక్క ఘటన కాదని, ఆంత్రోపిక్ సహా పరిశ్రమలోని ఇతర సంస్థల్లో కూడా ఇలాంటి చిన్నచిన్న ఘటనలు జరిగాయని చెప్పారు. ఈ కేసులో ఓపెన్ ఏఐ ద్వారా కొన్ని ఏఐ ఏజెంట్ల సమూహాన్ని అంతర్గతంగా పరీక్షిస్తున్నారు. ఇవి ‘సాండ్‌బాక్స్’ అనే ఒక ప్రత్యేకమైన సురక్షిత వాతావరణంలో ఉండాల్సి ఉన్నది. కానీ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేయడానికి ఉపయోగించే అంతర్గత సేవలో ఇవి ఒక లోపాన్ని కనుగొని, దానిని ఉపయోగించుకుని బహిరంగ ఇంటర్నెట్ను చేరుకున్నాయి. అక్కడినుంచి, ఆ పరీక్షకు సంబంధించిన హగ్గింగ్ ఫేస్ సిస్టమ్‌లోకి చొరబడ్డాయి. పోటీలో ఎక్కువ స్కోర్ చేయడానికి ఉపయోగపడే సమాచారాన్ని పొందాయి.
అభివృద్ధి వేగాన్ని నియంత్రించాలని సూచించిన అమోడై మూడు దశల ప్రణాళికను వెల్లడించారు. ఏఐని అభివృద్ధి చేయకపోతే మానవాళికి దాని ప్రయోజనాలు దక్కకుండా పోతాయని, అయితే దానిని అతివేగంగా అభివృద్ధి చేయడం బాధ్యతారాహిత్యం అని అమోడై తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఏఐ మోడళ్ల సామర్థ్యాలను మెరుగుపరిచే వేగాన్ని తగ్గించాలని సూచించారు. ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను పూర్తిస్థాయిలో పరిష్కరించడంలో మరింత జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. మోడల్స్ ప్రమాదకర స్థాయి సామర్థ్యాన్ని చేరుకోవడానికి ముందు వేగాన్ని తగ్గించడం ద్వారా మనకు కనీసం ఒకట్రెండు సంవత్సరాల అదనపు సమయం లభిస్తే పెద్ద విపత్తులు సంభవించే ప్రమాదాన్ని చాలావరకు తగ్గించవచ్చని తాను నమ్ముతున్నట్టు అమోడై తెలిపారు.
‘అధునాతన ఏఐ టెక్నాలజీ’పై ఆందోళన వ్యక్తం చేస్తూ గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకుడు జోష్ ఎంగెల్స్ ఏఐ సేఫ్టీ టీమ్‌ను వీడారు. ఏఐ ఏజెంట్లు అదుపుతప్పటం, అనూహ్య ప్రవర్తనకు సంబంధించి కీలక ఘటనలు చోటుచేసుకుంటున్నా, ఏఐ టెక్నాలజీ అభివృద్ధి ఇలాగే కొనసాగితే రాబోయే ఐదేండ్లలో మానవాళికి భయంకరమైన ముప్పు వాటిల్లే అవకాశముందని ఆయన హెచ్చరించారు. తాను మూడు వారాల క్రితమే ‘డీప్‌మైండ్’ను వీడినట్టు ‘ఎక్స్’ వేదికగా తాజాగా ప్రకటించారు. ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి ప్రముఖ సంస్థలు భద్రతా చర్యలను పట్టించుకోకుండా అత్యంత శక్తివంతమైన సూపర్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు తీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆర్ఎస్ఐ తరహా ఏఐ సిస్టంలలో తనను తాను మెరుగుపర్చుకుంటూ, తనకంటే తెలివైన తదుపరితరం వ్యవస్థలు తయారవుతాయి. ఈ తరహా ఏఐ వ్యవస్థలతో మానవాళికి తీవ్ర ముప్పు పొంచివుంది. ఇవి మానవాళి ఉద్దేశాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా ? అనేది ఎలా నిర్ధారించాలో పరిశోధకులకు సైతం తెలియదు’ అని ఎంగెల్స్ అన్నారు.
కృత్రిమ మేధ(ఏఐ) పరిశ్రమ అభివృద్ధిని నెమ్మదించాలని, లేదా దానిపై మరింత కఠినమైన నియంత్రణలు విధించాలన్న డిమాండ్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఏఐ సాంకేతికతపై భయాలను కొన్ని ప్రతికూల శక్తులు పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు. అదే సమయంలో చైనాపై అమెరికా ఆధిక్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఏఐలో మేం చైనా కంటే ముందున్నాం. ప్రపంచంలోనే అత్యంత అధునాతన దేశం మాదే. నిజాయితీగా చెప్పాలంటే ఏఐలో ఎవరు గెలిస్తే వాళ్లే నిజంగా గెలిచినట్లు’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు. ఏఐ విషయంలో అధికారులు కొన్ని రక్షణ చర్యలను ప్రవేశపెట్టవచ్చని ట్రంప్ అంగీకరించారు. అయితే ఏఐపై ప్రస్తుతం వ్యక్తమవుతున్న కొన్ని ఆందోళనలు అతిగా ఉన్నాయని ఆయన వాదించారు. ఏఐ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సాంకేతికత అభివృద్ధి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్న వైఖరికి మద్దతు ఇస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.