నల్లగొండ, సెప్టెంబర్ 13: తెలంగాణ ప్రభుత్వం భూభారతి ద్వారా భూదోపిడీపై దృష్టి పెట్టి డబ్బులు సంపాదిస్తుంటే.. ఏపీ సర్కార్ జలదోపిడీపై కన్నేసి ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా 200 టీఎంసీలు దోచుకెళ్లిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్య కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. భూభారతి పోర్టల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి చర్చలు, బ్లాక్మెయిల్స్తో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి డబ్బులు దండుకునే పనిలో పడ్డారని విమర్శించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టడంతో వారు కూడా గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. 22ఏ ద్వారా ఆదాయ మార్గాలను వెతుక్కునే పనిలో తెలంగాణ ప్రభుత్వం ఉంటే.. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం నుంచి సాగర్‌కు వచ్చే నీళ్లను పోతిరెడ్డిపాడుతోపాటు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా దోచుకుపోతున్నట్టు విమర్శించారు. మిగులు జలాలను మాత్రమే పోతిరెడ్డిపాడుకు తీసుకెళ్లాలనే నిబంధనను గాలికి వదిలిన చంద్రబాబు పోతిరెడ్డిపాడు షట్టర్ సైతం పగులగొట్టి ఇప్పటి దాక సుమారు 200 టీఎంసీలు తీసుకెళ్లినా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం కనీసం కేఆర్ఎంబీకి లెటర్ రాయలేదని దుస్థితిలో ఉన్నారని మండిపడ్డారు.
వెలిగొండకు ట్రయల్ రన్ మాత్రమే చేస్తామన్న ఏపీ సర్కార్.. నీళ్లు దోచుకెళ్తున్నా రేవంత్‌రెడ్డి పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. పలు కారణాలతో బీఆర్ఎస్ సర్కార్ పదిలక్షల ఎకరాలు ధరణిలో బీ క్యాటగిరీలో పెడితే కాంగ్రెస్ సర్కార్ మాత్రం 22ఏ కింద కోటి ఎకరాలు బ్లాక్ చేసిందని.. ప్రధానంగా హైదరాబాద్ సమీపంలో పెద్ద ఎత్తున నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ఎల్ నినో వల్ల వర్షాలు లేక నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు గొంతు తడుపుకోవటానికి ఇబ్బందులు పడుతుంటే సాగర్‌లో నీళ్లున్నా ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.
కనీసం 30టీఎంసీలు ఇచ్చినా పంటలు పండటంతోపాటు తాగునీటి సమస్య కూడా తీరుతుందని చెప్పారు. తెలంగాణ సర్కార్ ఇక్కడి రైతుల రక్తం తాగుతూ.. ఏపీ సర్కార్‌కు అమ్ముడుపోయిందని విమర్శించారు. ప్రస్తుతం రెండు పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నదని, అయితే సర్కార్ మాత్రం ఒక్క పంటకైనా ఇచ్చే ఆలోచన చేయడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి వస్తే వారి అవినీతిపై మాట్లాడుతామోనన్న భయంతో తమను అకారణంగా బహిష్కరించిందని అన్నారు. అందుకోసమే మాక్ అసెంబ్లీ నిర్వహించినట్టు తెలిపారు. ఈ సర్కార్ తీరు మారకపోతే ఊరూరా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.