హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను సైతం దగా చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. వెయ్యి మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు, గద్దెనెకి మూడేండ్లు గడుస్తున్నా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.
ఇచ్చిన మాటను తుంగలో తొకి కళాకారుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి కల్పించాలని కడుపు మండిన కళాకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, సమాధానం చెప్పే ధైర్యం లేక ముఖ్యమంత్రి, మంత్రులు ముఖం చాటేస్తూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. కళాకారులకు ఎన్నికల వేళ వారికి ఇచ్చిన వెయ్యి ఉద్యోగాల హామీని తక్షణమే అమలు చేయాలని గురువారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.