హైదరాబాద్ మెట్రో సేవలపై నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు బోగీల్లో విపరీతమైన రద్దీ, మరోవైపు మౌలిక వసతుల లోపంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవచ్చనే ఉద్దేశమే తప్పా… మెట్రో రైలు కంటే ఆర్టీసీ బస్సుల్లోనైనా కాసేపు కూర్చొనే అవకాశం దొరుకుతుందని అంటున్నారు ప్రయాణికులు. చార్జీలు బాదుడు భారీగా ఉన్నా… దానికి తగ్గట్టుగా సేవలు అందకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): నగరంలో రద్దీ వేళల్లో మెట్రో రైళ్లలో ప్రయాణించడం నరకప్రాయంగా మారింది. పీక్ అవర్స్‌లో బోగీల సంఖ్య, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచకపోవడంపై ప్రయాణికులు తోపులాట మధ్యనే ప్రయాణించాల్సి వస్తోంది. పలు స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు కనీసం మరమ్మతులు కూడా నోచుకోవడంలేదు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు మెట్రో స్టేషన్లకు వెళ్లాలంటే వీల్చైర్లు, హెల్పింగ్ సిబ్బంది లేక అవస్థలు పడుతున్నారు. ఇక పార్కింగ్ తిప్పలు మెట్రో ప్రయాణికులకు అనివార్యం కాగా, టికెట్ కౌంటర్ల భారీ క్యూలైన్లు నిత్యకృత్యమవుతున్నాయి.
గడిచిన రెండేళ్లలో మెట్రో నిర్వహణ అధ్వాన్నంగా మారింది. ముఖ్యంగా మెట్రోను గతేడాది బ్రేక్‌డౌన్ సమస్యలు చుట్టుముట్టాయి. బ్రేక్‌డౌన్ కారణంగా మెట్రో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. టికెట్ల ధరలను పెంచడంపై ఉన్న ఆసక్తి… సౌకర్యాల విషయంలో ఎందుకు లేదని మెట్రో ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రద్దీ ఎక్కువ ఉండే సమయాలోనైనా ఎలాంటి నియంత్రణ చర్యలను తీసుకోవడంపై ఇప్పటివరకు మెట్రో నిర్వహణ సంస్థ దృష్టి పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. మెట్రో సేవల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదని, అదనపు బోగీలు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. మెట్రో ప్రయాణమే కష్టతరంగా మారిందని విమర్శస్తున్నారు.
మెట్రో సంస్థ నిర్వహణ ముగ్గురు అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నా.. మెట్రోలో ప్రయాణికులకు ఎలాంటి మెరుగైన సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అధికారులు చేసే సమీక్షలు కూడా ప్రతిపాదనలకే పరిమితం చేయకుండా కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు. రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడం, మౌలిక వసతులను కల్పించడం, మహిళా ప్రయాణికులకు భద్రత విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు.