నర్సింహులపేట, అక్టోబర్ 1: శాంతిభద్రతల పరిరక్షణలో తలమునకలై ఉండి నిత్యం బిజీగా ఉండే పోలీసులు తమకు దొరికిన ఖాళీ సమయాన్ని మొక్కల పెంపకం, సంరక్షణకు వినియోగిస్తున్నారు. హరితహారంలో భాగంగా పోలీస్‌స్టేషన్ చుట్టూ యాప, జామ, నేరడు, మామిడి, దానిమ్మ లాంటి మొక్కలు విరివిగా నాటారు. అప్పటి ఎస్సైలు వై వెంకటప్రసాద్, సీహెచ్ నగేశ్ సొంతంగా వివిధ ప్రాంతాల నుంచి పండ్ల మొక్కలను తెప్పించారు. మొక్కలకు నీరు పెట్టేందుకు ప్రత్యేకంగా ఒకరిని ఏర్పాటు చేశారు. అదే స్ఫూర్తితో సంతోష్‌కుమార్, రియాజ్‌పాషా, ప్రస్తుతం పనిచేస్తున్న నరేశ్ సైతం నాటిన పండ్ల మొక్కలకు నీరు అందించడంతోపాటు ఎరువులు వేయిస్తున్నారు.
ఎనిమిదేళ్లుగా..
ఠాణా ఆవరణలో సుమారు ఎనిమిదేళ్లుగా మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఎవరు ఎస్సైగా వచ్చినా సామాజిక బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. అప్పట్లో నాటిన పలు రకాల మొక్కలు చెట్లుగా ఎదిగాయి. కొన్ని నీడనిస్తుండగా, మరికొన్ని పండ్లను ఇస్తున్నాయి. ఠాణాకు వచ్చే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు అదనపు అకర్షణగా నిలుస్తున్నాయి.
కేంద్ర బృందం సభ్యుల ప్రశంస..
మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో నాటిన మొక్కలు చాలా బాగున్నాయని హరితహారానికి సంబంధించిన కేంద్ర బృందం సభ్యులు మెచ్చుకున్నారు. మొక్కలు పెంచేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యల ను అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం
ఠాణా సిబ్బంది ప్రత్యేక చొరవ తో మొక్కలను కాపాడుతున్నాం. గతం లో విధులు నిర్వర్తించిన ఎస్సై లు శ్రద్ధ కనబర్చారు. పచ్చదనం కోసం మొక్కల్ని పెంచుతూ నిరంతరం సంరక్షిస్తాం. వేసవిలో వాడి పోకుండా చూసుకుంటు న్నాం. ప్రస్తుతం మొక్కల చుట్టూ పాదు లు చేయించి ఎరువులు వేయించాం. విధులు నిర్వర్తించే చోట మొక్కలు, చెట్లు ఉంటే ఒత్తిడిగా అనిపించదు.