హనుమకొండ, ఏప్రిల్ 11 : తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఆయా విద్యుత్ కార్యాలయాల ఎదుట ఏర్పాటు చేసిన శిబిరాల్లో కూర్చొని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.
ఆయా శిబిరాలను పలు యూనియన్లు, సంఘాల నాయకులు సందర్శించి మద్దతు తెలిపాపరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) ప్రధాన ద్వారం వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్టిజన్ల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. డిప్యూటీ సీఎం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, పాల్వంచ కేటీపీఎస్ ముట్టడికి వెళ్లకుండా పలువురు కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.