‘ఈ రోజు నేనేం తిన్నానో చూడండి!’ అంటూ వస్తున్న రీల్స్.. ఈమధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ఎవరిదో లంచ్ బాక్స్, అందులోని ఆహారం, వాళ్లు తినే వీడియోలు.. మనల్ని మాయలో పడేస్తున్నాయి. వాటిని చూస్తుంటే.. మన నోట్లో నీళ్లూరుతున్నాయి. రోజంతా ఆ రీల్స్‌కే కట్టిపడేస్తున్నాయి. అలా, పక్కింటి పుల్లకూరకు రుచే కాదు.. వ్యూస్కూడా ఎక్కువే వస్తున్నాయి. పనిలోపనిగా.. మనలోని పని ఒత్తిడినీ తగ్గిస్తున్నాయి. అయితే.. ఈ ‘What I Eat In A Day’ వీడియోల వెనక.. ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి.
వేరొకరి దినచర్యను, వారి వ్యక్తిగత జీవితాన్ని కిటికీలోంచి చూస్తున్న ఫీలింగ్‌ను కలిగిస్తాయి ఈ వీడియోలు. ముఖ్యంగా ఆఫీస్ సెటప్‌లో వారు లంచ్ బాక్స్ సర్దుకోవడం, సహోద్యోగులతో కలిసి తినడం చూస్తుంటే.. అది మన సొంత జీవితానికి దగ్గరగా అనిపిస్తుంది. మనకి తెలియకుండానే మనం ఆ వ్యక్తితో ఒక ‘పారాసోషల్ రిలేషన్షిప్’ని ఏర్పర్చుకుంటాం. అందుకే.. ఆ వీడియోలు మనల్ని అంతలా కట్టిపడేస్తాయి.

మనసుకు సంతృప్తి : ఇలాంటి వీడియోలు చూసేందుకు చాలా ఆర్గనైజ్డ్గా, పద్ధతిగా కనిపిస్తాయి. అందమైన లంచ్ బాక్సులు, రంగురంగుల సలాడ్లు చూస్తుంటే.. మన మెదడులో ‘డోపమైన్’ విడుదలవుతుంది. మనసుకు ఒక రకమైన సంతృప్తిని ఇస్తుంది. ‘మన జీవితం కూడా అంత పద్ధతిగా ఉంటే బాగుండు!’ అనే ఆశను కలిగిస్తుంది.
డిజిటల్ మెనూ: ‘రేపు ఆఫీసుకి ఏం వండుకొని వెళ్లాలి?’ అనే డైలీ టెన్షన్‌కి ఈ వీడియోలు పరిష్కారంలా కనిపిస్తాయి. కొత్త రెసిపీలు, ఆరోగ్యకరమైన ఆప్షన్లు తెలుసుకోవడానికి ‘డిజిటల్ మెనూ కార్డ్స్’లా పనిచేస్తాయి.

రిలాక్సేషన్ థెరపీ: ఇళ్లు, ఆఫీసుల్లో ఒంటరిగా భోజనం చేసేవారు, పని ఒత్తిడిలో ఉన్నవారు, బోర్‌గా ఫీలయ్యేవారు.. ఎక్కువగా ఈ వీడియోలు చూస్తున్నారు. ఎవరో తమకు తోడుగా తింటున్నారనే ఫీలింగ్ పొందుతున్నారు. అలా, ఈ వీడియోలు ఒక రకమైన ‘రిలాక్సేషన్ థెరపీ’లా పనిచేస్తున్నాయి.
సంస్కృతిలో భాగం: ఆహారం అంటే కేవలం తినే పదార్థాలే కాదు. అది ఒక గుర్తింపు, సంస్కృతి, సౌకర్యంతో ముడిపడి ఉంటుంది! ఎవరో ఒకరు టిఫిన్‌లో ఏం తీసుకువచ్చారో చూస్తే.. వాళ్ల కల్చర్, లైఫ్ స్టయిల్ గురించి తెలుస్తుంది. అదే సమయంలో.. ‘అరే! నేను కూడా ఇలాగే చేస్తాను!’ అనిపిస్తుంది. అలా.. సామూహిక అనుబంధాలనూ పెంచుతుంది.

మాటలు లేని మాయాజాలం: ఈ రకమైన వీడియోల్లో మాటలు ఉండవు. కేవలం స్పూన్ తగిలే శబ్దం, బాక్స్ మూత తీసే సౌండ్, నమిలేటప్పుడు వచ్చే శబ్దాలు మాత్రమే ఉంటాయి. జెన్-జెడ్ ‘ఏఎస్ఎమ్ఆర్’గా పిలుచుకునే ఈ ఎఫెక్ట్స్ వినడానికి చాలా హాయిగా అనిపిస్తాయి. మనల్ని ఆ వీడియోకి అడిక్ట్ అయ్యేలా చేస్తాయి. ఈ రీల్స్‌లో మనం చూసేది కేవలం ఆహారాన్ని కాదు.. ఆ వ్యక్తి లైఫ్ స్టయిల్లోని కిక్‌ని. అది మనకి తెలియని ఊరటనిస్తుంది. అందుకే ఎంత వద్దనుకున్నా.. ఆ వీడియోలను స్కిప్ చేయలేం. అలా.. ఈ ‘What I Eat In A Day’ వీడియోలు తెగ వ్యూస్ సాధిస్తున్నాయి.
చూసేందుకు ఈ వీడియోలు సరదాగానే ఉంటాయి. కానీ, అతిగా చూస్తే అసలుకే ఎసరు తెస్తాయి. వీటి మాయలో పడితే.. కొన్ని రిస్కులూ ఉంటాయి.
అప్పటి వరకే: వీడియోలో కనిపించే ఇన్ఫ్లూయెన్సర్.. రోజుకు ఐదారు రకాల పండ్లు, ఖరీదైన డైట్ తింటుంటే.. మనం కూడా అలా చేయలేకపోతున్నామే?! అని కుంగిపోకూడదు. అవి కేవలం కొన్ని సెకన్ల పాటు రికార్డ్ చేసిన ‘కలలు’ మాత్రమే అని గుర్తించాలి.
పోలిక వద్దు: వారి లంచ్ బాక్స్ అందంగా ఉందని, మన స్టీల్ బాక్స్ బాగోలేదని ఫీల్ అవ్వకూడదు. అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. అందుకే, వీడియోల్లోని వ్యక్తులతో మనల్ని పోల్చుకోకూడదు.
వినోదం మాత్రమే: ‘వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే’ వీడియోలు ఒకరకమైన డిజిటల్ వినోదం మాత్రమే. వాటిని చూసి మంచి రెసిపీలు నేర్చుకోవచ్చు. అంతేకానీ, మన తిండిని వారి ఆహారంతో పోల్చుకోవద్దు. ఎందుకంటే.. మన ప్లేటులో ఉన్న ఆవకాయ అన్నం ఇచ్చే తృప్తి.. స్క్రీన్‌పై కనిపించే ‘అవకాడో టోస్ట్’ ఇవ్వలేదు కదా! అందుకే.. పక్కింటి పుల్లకూర వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. కానీ, మీ సొంతింటి ఆహారం రుచిని మిస్ కాకండి!