సిలిండర్ ధరలు వెయ్యికి పెంచిన బీజేపీ వలలో..
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన బీజేపీ వలలో..
నిత్యావసర ధరలు పెంచిన బీజేపీ వలలో..
నల్ల చట్టాలతో రైతుల ఉసురే తీస్తుండు వలలో..
రాకాసి బీజేపీ వలలో.. వద్దద్దు మనకొద్దే వలలో..
ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేస్తుంది వలలో..
కార్పొరేట్లకు దేశాన్ని అమ్మెయ్య చూస్తున్నది వలలో..
ఉన్న ఉద్యోగాలు వలలో.. ఊడబీకుతున్నది వలలో..
అబద్ధాలతో వలలో..
ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ వలలో..
వద్ద్దద్దు మనకొద్దే వలలో.. బీజేపీ సోపతద్దే వలలో..
కేసీఆర్ సారు మనిషని ఈటలను గెలిపిస్తే వలలో..
నమ్మి చేరదీస్తే నమ్మక ద్రోహం చేసిండే వలలో..
తిన్న కంచాన్ని తన్నుతుండే వలలో..
కోట్లకు పడగెత్తి కుట్రలు చేస్తుండే వలలో..
ఆస్తుల కోసమే బీజేపీల చేరిండే వలలో..
ఇట్లోంటి ఈటల మనకద్దే వలలో..
గెల్లు సీనును గెలిపిద్దామే వలలో..
హుజూరాబాద్/ హుజూరాబాద్ టౌన్/ వీణవంక, అక్టోబర్ 6 : పండుగ వేళ కేంద్రం గ్యాస్ ధరలు పెంచడంపై హుజూరాబాద్ నియోజకవర్గం మహిళలు వినూత్న నిరసన తెలిపారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు కాగా, హుజూరాబాద్ పట్టణంలోని 18వ వార్డులో ఉన్న శివాలయం, వీణవంక మండల కేంద్రంలోని రజక, బీసీ కాలనీల్లో వీణవంకలో వైస్‌ఎంపీపీ రాయిశెట్టి లత ఆధ్వర్యంలో నిరసనగళం విప్పారు. ఆయాచోట్ల బతుకమ్మల మధ్యన సిలిండర్లు ఉంచారు. ‘ధరలు పెంచవట్టే ఉయ్యాలో.. సామాన్యుల నడ్డి విరువవట్టే ఉయ్యాలో.. ఈ బీజేపీ పాలన మనకద్దు ఉయ్యాలో..’ ‘నమ్మి చేరదీస్తే ఉయ్యాలో.. ఈటల కుట్రలే చేసిండు ఉయ్యాలో.. ద్రోహం చేసిన రాజేందర్ మనకద్దు ఉయ్యాలో..’ అంటూ బతుకమ్మ పాటలతో కేంద్రంలోని బీజేపీ వైఫల్యాలను ఎండగట్టారు. ‘మోడీ మనసు కరిగించి ఉయ్యాలో.. ధరలు తగ్గించేలా చూడాలి ఉయ్యాలో..’ అంటూ వేడుకున్నారు. ‘సంక్షేమం వైపు నడిపిస్తున్న టీఆర్ఎస్కు అండగా ఉందాం ఉయ్యాలో.. గెల్లు సీనునే గెలిపిద్దాం ఉయ్యాలో’ అంటూ అవగాహన కల్పించేలా పాటలు పాడారు. హుజూరాబాద్‌లో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, స్థానిక కౌన్సిలర్ ప్రతాప మంజుల, ఇతర కౌన్సిలర్లు, సిలిండర్ ధరలను అదుపు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నుంచి అన్ని ధరలు పెంచుతూనే ఉన్నది. 450 రూపాయలున్న గ్యాస్ ధరను వెయ్యి దాకా చేసింది. సిలిండర్ మీద సబ్సిడీని తొలగించాడనికి ప్రయత్నస్తున్నది. ఇట్లయితే సామాన్యులు ఎట్ల బతుకుతరు? పేదలు సిలిండర్‌కు పైసలు కట్టలేక పొయ్యి మీద వంట చేసుకుంటున్నరు. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం పనిచేయాలె గానీ, కార్పొరేట్ల కోసం కాదు. పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలనే వినూత్నంగా నిరసన తెలిపినం. బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి. సంక్షేమంవైపు నడిపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలువాలి.
-వైస్ ఎంపీపీ శ్రీలత శ్రీనివాస్