హనుమకొండ, సెప్టెంబర్ 20 : దళితుల అభ్యున్నతికే దళితబంధు పథకం ప్రవేశపెట్టినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు అన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో దళిత బంధు పథకంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం ప్రారంభించిన సందర్భంగా 15 మంది లబ్ధిదారులతో తొలి జాబితా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో హనుమకొండ జిల్లాలోని కమలాపుర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన నాంపల్లి రాజేందర్ అనే పేద కూలీ ఉన్నారన్నారు. అతడి ఖాతాలో రూ.పది లక్షలు జమ చేసినట్లు చెప్పారు. నాంపల్లి రాజేందర్ కోరిక మేరకు నాలుగు ముర్రా జాతి పశువులను కొనుగోలు చేయడానికి హర్యానా రాష్ర్టానికి జిల్లా అధికారులు వెళ్లారన్నారు. వీరితో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ముగ్గురు లబ్ధిదారులు కూడా వెళ్లారని కలెక్టర్ తెలిపారు. పశువుల షెడ్లు నిర్మించుకోడానికి రూ.లక్ష చొప్పున మంజూరు చేశామని తెలిపారు. లబ్ధిదారులు తమకు నచ్చిన పాడి గేదెలను కొనుగోలు చేసుకున్నారని, రెండు, మూడు రోజుల్లో వారు హర్యాన నుంచి జిల్లాకు వస్తారని కలెక్టర్ వివరించారు. దళిత బంధు పథకం కింద కమలాపూర్ మండలంలో 3788 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించి, వారి ఖాతాలో రూ.పది లక్షల చొప్పున జమచేసినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వివరించారు.