మొదటి విడుతలో అభివృద్ధి చేసే పాఠశాలల జాబితా సిద్ధం
‘మన ఊరు – మన బడి’ వేగవంతం
ప్రతి బడిలో ఇంగ్లిష్ మీడియం, వసతుల కల్పన
కార్యక్రమం అమలుపై విద్యా శాఖ ఆదేశాలు
ఈనెల 23న ప్రజాప్రతినిధుల సమావేశం
వరంగల్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రతి విద్యార్థికీ కార్పొరేట్‌కు దీటుగా సకల వసతులతో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ వేగవంతమవుతున్నది. మూడు దశల్లో అన్ని స్కూళ్లను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సర్కారు తొలి దశలో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 1,341 స్కూళ్లను ఎంపిక చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు జాబితా అందగా వీలైనంత త్వరగా ఈ బడుల్లో ఏయే పనులు చేయాలనే దానిపై అధికార యంత్రాంగం సర్వే చేస్తున్నది. పాఠశాలల వారీగా పనులను గుర్తిస్తూనే కావాల్సిన నిధుల అంచనాలు రూపొందిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు ప్రక్రియ వేగవంతమవుతున్నది. మూడేళ్లలో.. మూడు దశల్లో రాష్ట్రంలోని అన్ని సర్కారు పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయాల ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడుతలో 35 శాతం, రెండో విడుతలో 35 శాతం, మూడో విడుతలో 30 శాతం స్కూళ్లను తీర్చిదిద్దనుంది. తొలిదశ 2021-22 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 స్కూళ్లను ఎంపిక చేయగా వీటిలో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 1,341 స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్ల జాబితాను విద్యా శాఖ సిద్ధం చేసి కలెక్టర్లకు పంపింది. వీలైంత త్వరగా ఆయా పాఠశాలల్లో ఏ పనులు చేయాలనే దానిపై అధికార యంత్రాంగం సర్వే చేస్తున్నది. స్కూళ్ల వారీగా చేయాల్సిన పనులను గుర్తిస్తున్నది. పనులు పూర్తి చేసేందుకు అవసరమయ్యే నిధుల అంచనాను రూపొందిస్తున్నది. ఈ కార్యక్రమం పక్కాగా అమలైతే పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందనుంది.
బడి అభివృద్ధి ఇలా..
మన ఊరు మన బడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించనుంది. బాల, బాలికలకు నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లను వేర్వేరుగా నిర్మించనుంది. కరెంటు సరఫరా ఏర్పాట్లు చేస్తున్నది. అవసరమైన చోట కొత్త లైన్లు వేయడంతో పాటు కొత్త స్విచ్ బోర్డులు బిగించనుంది. పాడైన ఫ్యాన్ల స్థానంలో కొత్తవి పెడుతారు. మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్లు, నీటి ట్యాంకులు, నల్లాలు ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కావాల్సిన ఫర్నిచర్, డ్యుయల్ డెస్ బల్లాలను సమకూరుస్తారు. లైబ్రరీ, సైన్స్ ల్యాబ్‌లకు అవసరమయ్యే ఫర్నిచర్‌ను అందుబాటులోకి తెస్తారు. వెలసిపోయిన స్కూలు భవనాలకు రంగులు వేస్తారు. దేశ, రాష్ట్ర ప్రముఖుల చిత్రాలు, పాఠ్య సంబంధ అంశాలు, స్ఫూర్తినిచ్చే కొటేషన్లను గోడలపై, క్లాసు రూముల్లో రాయిస్తారు. డిజిటల్ విద్యకు అవసరమయ్యే సదుపాయాలు, పరికరాలు ఏర్పాటు చేస్తారు. నిర్మాణాలు, మరమ్మతులు చేయిస్తారు. ప్రైమరీ స్కూళ్లలో 8X4 అడుగులతో, హైస్కూళ్లలో 10X4 సైజుతో గ్రీన్ చాక్ పీస్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. స్కూలు ప్రాంగణం, ఆట స్థలానికి ప్రహరీలు నిర్మిస్తారు. మధ్యాహ్న భోజనం వండేందుకు వీలుగా కిచెన్ షెడ్లు కడుతారు. శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు, అదనపు తరగతి గదులు నిర్మిస్తారు. హైస్కూళ్లలో మ ధ్యాహ్న భోజనం వడ్డించేందుకు వీలుగా డైనింగ్ హా ల్స్ కడుతారు. మూడేండ్లలో అన్ని స్కూళ్లను పూర్తిగా ఆధునీకరించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
23న సమావేశం..
మన ఊరు మన బడి పథకం అమలుపై ప్రభుత్వ పకడ్బందీగా ముందుకుపోతున్నది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పేరెంట్స్ కమిటీలు, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథ కం అమలు కోసం మంత్రుల ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం.. జడ్పీ చైర్ పర్సన్ల ఆధ్వర్యంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ల సమావేశం.. స్కూళ్ల వారీగా మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా మంత్రుల ఆధ్వర్యంలో బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు, మన బడిలో గ్రామస్తులు, పేరెంట్స్, పూర్వ విద్యార్థులను భాగస్వాములు చేస్తున్నది.