గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టి, తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ లక్ష్యం దిశగా సాగుతున్నది. పైలట్ ప్రాజెక్టు కింద జయశంకర్ జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నది. తమతో పాటు తమ పిల్లల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న మేలు మరువలేనిదని, ఇంత బాధ్యతాయుత ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని, కిట్‌లో అందించే పౌష్టికాహారం ఎంతో బాగుందని లబ్ధిదారుల్లో కృతజ్ఞతాభావం వ్యక్తమవుతున్నది.
– జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ)
కేసీఆర్ సారు మంచిపని చేస్తుండు
నాకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండ్రు. ఇందులో నెయ్యి, పాలపొడి, ఐరన్ టానిక్, మాత్రలు, ఖర్జూర ఉన్నయి. మహిళల కోసం కేసీఆర్ సారు మంచిపనులు చేస్తుండు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంటున్నది. నా బిడ్డ కూడా బాగుందని డాక్టర్లు చెప్పారు. ఇంతకుముందు కాన్పు కోసం ప్రైవేట్ దవాఖానకు పోయేటోళ్లం. లక్షలు ఖర్చయ్యేది. ఇప్పుడు సర్కారు దవాఖానల్లో మంచిగ పరీక్షలు చేసి మందులిస్తాండ్రు. మంచి డాక్టర్లు ఉన్నరు. కాన్పు అయినోళ్లకు కేసీఆర్ కిట్ పైసలు సుత వస్తున్నయ్.
– వేల్పుల స్రవంతి, అన్సాన్పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
లక్ష్యం దిశగా ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’
జయశంకర్ జిల్లాలో వంద పడకల ప్రభుత్వ దవాఖాన, చిట్యాల, మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక వైద్యశాల, 13 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 4వేల మంది గర్భిణులు ఉన్నారు. జిల్లాకు 3,931 కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు రాగా ఇప్పటివరకు 2,288 కిట్లను గర్భిణులకు తొలి, రెండో విడుతల్లో వైద్యశాఖ అందజేసింది. ఇంకా 1,643 కిట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది.
ఆరోగ్యం బాగుంది
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లో బలాన్నిచ్చేవి ఉన్నయి. ఇప్పుడు వాటిని తింటు న్న. నా ఆరోగ్యం, నా కడుపులో ఐదు నెలల బిడ్డ ఆరోగ్యం బాగుందని డాక్టర్లు చెప్పిన్రు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లో ఉన్న ఆహా రం మేమే తినాలని ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ఎప్పటికప్పుడు వచ్చి చెప్తాన్రు. కేసీఆర్ సర్కా రు అందరికీ మేలు చేస్తున్నది. తల్లీబిడ్డలను మంచిగ చూసుకుంటున్న కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– అజ్మీరా లలిత, కృష్ణకాలనీ, భూపాలపల్లి
మంచి బలాన్చిచ్చింది
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లో ఉన్న పోషకాహారం మాకెంతో బలాన్నిస్తున్నది. కడుపుల బిడ్డ కూడా మంచిగుందని డాక్టర్లు చెప్పిన్రు. నా ఆరోగ్యం, నా బిడ్డ ఆరోగ్యం బాగున్నదంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వం దయవల్లనే. ఇంతమంచి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. న్యూట్రిషన్ కిట్‌లో ఆహారాన్ని మేమే తినాలని ఆశవర్కర్లు వచ్చి చెప్పిపోతున్నరు.
– మామిడి అనూష, గర్భిణి, జంగేడు, భూపాలపల్లి మండలం
కిట్ల పంపిణీ ఇలా..
గర్భిణులకు మొదటి విడుత 13 వారాల నుంచి 27 వారా ల వరకు, రెండో విడుత 28 నుంచి 38 వారాల మధ్యలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నారు. మొదటి విడుతలో సంబంధిత పీహెచ్‌సీల్లో, రెండో విడుతలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల, చిట్యాల ప్రభుత్వ సామాజిక కేంద్రంలో 28 నుంచి 34 వారాల మధ్య గైనకాలజిస్టులతో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి అందిస్తున్నారు.
గర్భిణులకు ఎంతో ప్రయోజనం
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నది. జిల్లాలోని గర్భిణుల్లో 63శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రధానంగా మైల్డ్ ఎనీమియాతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ ఉంది. గర్భిణులు తీసుకునే ఆహారంతో పాటు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను తీసుకోవడం వల్ల రక్తహీనత పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతి నెలా హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందనే విషయమై గర్భిణులను సంబంధిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేస్తున్నాం.
– డాక్టర్ శ్రీరామ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ప్రత్యేక అవగాహన
గర్భిణులకు ఇచ్చిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లో పోషకాహారాన్ని గర్భిణులే తినేలా సంబంధిత ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఇండ్లకు వెళ్లి చెబుతున్నారు. కిట్‌లోని పోషకాహారం తినడం వల్ల రక్తహీనత ఉండదని, ఆరోగ్యం బాగుంటుందని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు.
కిట్‌లో ఏముంటాయంటే..
నూట్రీమిక్స్ పౌడర్ : అవసరమైన శక్తి, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాల కోసం రోజూ పాలు లేదా నీళ్లలో కలిపి రెండు సార్లు తాగాలి.
ఐరన్ సిరప్ : రోజూ ఐరన్, ఫోలిక్ యాసిడ్ సిరప్ తీసుకోవడం వల్ల రక్తహీనతను అదుపుచేయవచ్చు. ప్రసవ సమయంలో వచ్చే క్లిష్ట సమస్యలను, తక్కువ బరువుతో ఉండే శిశు జననాలను తగ్గించవచ్చు.
ఖర్జూర : ఇది విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇందులోని ఫోలేట్ గర్భంలో బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది.
నెయ్యి : నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఏ, ఈ, డీ ఉంటాయి. తద్వారా గర్భంలో బిడ్డకు పోషకాలతో పాటు శక్తి అందుతుంది.
అల్బెండజోల్ : ఈ మాత్ర రెండో త్రైమాసికంలో వేసుకోవాలి. దీనిద్వారా నులి పురుగులు నశిస్తాయి. దీంతో రక్తహీనతను అరికట్టవచ్చు.
కప్పు : న్యూట్రిషన్ డ్రింక్ తాగేందుకు కొలతలతో కూడిన కప్పు కిట్‌లో ఉంటుంది.