వరంగల్, సెప్టెంబర్ 7(నమస్తేతెలంగాణ) : ఎడతెరిపి లేని వర్షం జిల్లాలో బీభత్సం సృష్టించింది. వరద నీటితో గ్రామాలు, కాలనీలు జలమయమయ్యాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెనలు, కాజ్‌వేల మీదు గా నీరు ప్రవహిస్తుండడంతో పలు రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రమైన వరంగల్‌లో డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక్కడ జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీల ప్రజలను సురక్షితంగా బయటకు చేర్చాయి. జిల్లాలో మంగళవారం సగటు వర్షాపాతం 15.18 సె.మీ నమోదైంది. జిల్లావ్యాప్తంగా పదమూడు మండలాల్లో 1975.8 మిమీ వర్షం కురిసింది. అత్యధికంగా నల్లబెల్లి మండలంలో 25.87 సెంటీమీటర్ల వర్షం పడింది. ఖానాపురంలో 22.7, దుగ్గొండిలో 22.1, సంగెంలో 20.4, నర్సంపేటలో 19.1, చెన్నారావుపేటలో 17.5, గీసుగొండలో 17.4, వరంగల్‌లో 13.6, వర్ధన్నపేటలో 11.7, పర్వతగిరిలో 10.7, నెక్కొండలో 10, రాయపర్తిలో 6.1 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. లోలెవల్ కాజ్‌వేల మీదుగా వరద నీరు ప్రవహించడంతో నర్సంపేట- నెక్కొండతో పాటు జిల్లాలో వివిధ రూట్లలో రా కపోకలు నిలిచిపోయాయి. నెక్కొండ మండలం అప్పల్రావుపేట- హరిశ్చంద్రతండా మధ్య వాగు దాటే ప్రయత్నంలో రైతు బీమ్లా నీటి ప్రవాహంలో చిక్కుకోగా, స్థానికులు అతడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. వరద నీరు ఇళ్లలోకి చేరిన నేపథ్యంలో కలెక్టర్ బీ గోపి పర్వతగిరి, సంగెం మండలాల్లోని వివిధ గ్రామాల్లో పర్యటించి రాకపోకలు ఆగిపోయిన కాపులకనపర్తి లోలెవల్ కాజ్‌వేను పరిశీలించారు. అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ ఖానాపురం మండలంలోని పాకాల సరస్సును సందర్శించి నష్టం వాటిల్లకుండా జల వనరుల శాఖ ఇంజినీర్లకు సూచనలు చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాదన్నపేట పెద్దచెరువును సందర్శించి మత్తడి వద్ద పూజలు చేశారు.
వరంగల్‌లో పునరావాస కేంద్రాలు..
వరంగల్‌లో పలు కాలనీలు నీట మునిగాయి. ఇందిరానగర్, ఎస్ఆర్నగర్, మైసయ్యనగర్, బీఆర్‌నగర్, ఎన్ఎన్నగర్, సీఆర్ నగర్, సాకరాశికుంట, ఎన్టీఆర్నగర్, సంతోష్మాతకాలని, రామన్నపేట, లక్ష్మీగణపతికాలని, బృందావన్కాలనీతో పాటు ఇక్కడ పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఎన్టీఆర్నగర్, పద్మావతినగర్‌లోని జలదిగ్బంధంలో చిక్కుకున్న సుమారు 150 మంది ప్రజలను డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు, లైవ్ జాకెట్లు, రోప్‌ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్‌లోని శివనగర్, మైసయ్యనగర్తోపాటు 18, 19, 28 తదితర డివిజన్లలో ముంపునకు గురైన గాంధీనగర్, దళితకాలనీల్లో పర్యటించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్మసూద్, కార్పొరేటర్లు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య వరంగల్‌లోని బృందావన్‌కాలనీలో బోట్ల ద్వారా పర్యటించి ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. ముంపు ప్రాంతాల ప్రజల కోసం జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్, సంతోషిమాత గార్డెన్, కీర్తి గార్డెన్, కాశికుంట కమ్యూనిటీ హాలులో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 500 మందిని తరలించినట్లు తెలిపారు.
దెబ్బతిన్న పంటలు..
భారీ వర్షాలతో జిల్లాలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లో 3,120 మంది రైతులకు చెందిన 4,397 హెక్టార్లలోని వరి, వేరుశనగ, పత్తి తదితర పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ వెల్లడించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శా ఖ ఇంజినీర్లు వర్షంతో రాకపోకలు నిలిచిపోయిన రహదారుల్లో వాహనాల రాకపోకలను పునరుద్ధరించే పను లు చేపట్టారు. జల వనరుల శాఖ ఇంజినీర్లు చెరువు కట్టలు, మత్తళ్ల వద్ద రక్షణ చర్యలు తీసుకున్నారు.