నమస్తే నెట్వర్క్: గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో కొలువైన విఘ్నేశ్వరుడికి శనివారం రెండో రోజు భక్తులు విశేష పూజలందించారు. భక్తులు ఏకదంతుడికి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు చేయడంతోపాటు రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే, నర్సంపేట మండలంలోని 27 గ్రామాలు, శివారు పల్లెలు, తండాల్లో వినాయక చవితి సందర్భంగా గణనాథులు కొలువుదీరారు. ఖానాపురం మండలవ్యాప్తంగా శుక్రవారం గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలకేంద్రంలో శనివారం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, పద్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్సై సాయిబాబు, సర్పంచ్‌లు లావుడ్యా రమేశ్‌నాయక్, భూక్యా వెంకన్న, యూత్ నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగెం మండలంలోని అన్ని గ్రామాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వాడవాడలా లంబోధరుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. దుగ్గొండి మండలంలోని 34 జీపీల పరిధిలో గణనాథులు కొలువుదీరారు. భక్తులు కొవిడ్ నిబంధనలతో పూజలు చేస్తున్నారు. వరంగల్ చౌరస్తా పరిధిలోని గణనాథులు విశేష పూజలందుకుంటున్నారు.
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షుడు నడికుడ జయంత్‌రావు వరంగల్ పోస్టాఫీస్ జంక్షన్లో కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవునూరి రామన్న ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను శుక్రవారం పంపిణీ చేశారు. రాష్ట్ర నాయకులు ఓదెల చంద్రారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసర్ల చంద్రమౌళి, జిల్లా కుమ్మర యూత్ అధ్యక్షుడు ఓరుగంటి చరణ్‌రాజ్ పాల్గొన్నారు. సకల విఘ్నాలను హరిస్తూ తొలి పూజలందుకునే బొజ్జ గణపయ్య ఖిలావరంగల్ పరిధిలోని వాడవాడలా కొలువయ్యాడు. రంగు రంగుల విద్యుత్ దీపాలు, వివిధ ఆకారాలతో తయారు చేసిన గణపతి దేవతా విగ్రహాలకు భక్తులు మంగళ నీరాజనాలు పలికారు.
ప్రత్యేక అనుమతులతో ఏర్పాటు
వర్ధన్నపేట మండలంలోని గ్రామాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో వినయక మండపాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకున్నారు. నల్లబెల్లి మండలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎస్సై బండారు వెంకటేశ్వర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాయపర్తి మండలంలోని 39 జీపీల పరిధిలో విఘ్నేశ్వరుడు భక్తజన మండళ్లు, యువజన సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతృత్వంలో కొలువుదీరి ప్రత్యేక పూజలందుకుంటున్నాడు. పర్వతగిరి మండలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెన్నారావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడలా బొజ్జ గణపతి కొలువుదీరాడు. ఈ సందర్భంగా మండపాలను అందంగా అలంకరించారు. గీసుగొండ మండలంలో వాడవాడన గణేశుడు కొలువుదీరాడు. ఈ సందర్భంగా మండపాలను ముస్తాబు చేశారు.