ఇప్పటికే వివిధ క్రీడా పోటీలకు వేదికైన ఓరుగల్లు మహానగరం, ఆటలకు సరికొత్త అడ్డాగా ఎదుగుతున్నది. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా మారిన వరంగల్‌లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా గ్రేటర్లో క్రీడాకారుల కోసం కొత్తగా నాలుగు మినీ స్టేడియంలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మాణానికి ప్రణాళికలు వేసింది. రూ.5కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ప్రక్రియ, సర్కారు ఆదేశాల మేరకు వేగవంతమైంది. వీటిలోనే ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు జీడబ్ల్యూఎంసీ కార్యాచరణ రూపొందించింది.
– వరంగల్, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో రెండో పెద్ద సిటీగా పేరుగాంచి, వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ మహానగరంలో ప్రజలకు అవసరమైన అన్ని వసతులను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్నది. తాగునీరు, రోడ్లు, రవాణా, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలతోపాటు పార్కులు, గ్రీనరీ, పరిశ్రమలు, శిక్షణ సంస్థలను నెలకొల్పుతున్నది. ఈ ప్రక్రియలో భాగంగా గ్రేటర్లో కొత్తగా నాలుగు మినీ స్టేడియంలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మాణానికి ప్రణాళికలు వేసింది. రూ.5కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై సర్కారు ఆదేశాల మేరకు ప్రక్రియ వేగవంతమైంది.
సిరిసిల్లలో పరిశీలన
వరంగల్ నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున మినీ స్టేడియంలను నిర్మించనున్నారు. ఇందుకోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే కార్పొరేషన్ అధికారులు సిరిసిల్లలోని మినీ స్టేడియంను పరిశీలించి వచ్చారు. అక్కడి స్టేడియం తరహా ప్రతిపాదనలను దాదాపు సిద్ధం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు వైపులా ఇప్పటికే స్టేడియంలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేలా జేఎన్‌ఎస్‌ను అభివృద్ధి చేశారు. మరో మినీ స్టేడియం ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి సీకేఎం కాలేజీ, కృష్ణ కాలేజీ గ్రౌండ్లను పరిశీలిస్తున్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలోని జక్కలొద్దిలో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జక్కలొద్దిలో వందల ఎకరాల ప్రభుత్వ స్థలంలో స్టేడియం నిర్మాణం కోసం స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. మామునూరులోనూ స్టేడియం కోసం ప్రతిపాదనలు రూపొందించారు. నగరానికి దూరంగా ఉన్న మామునూరులో స్టేడియం నిర్మిస్తే ప్రజలకు ఆశించిన మేరకు ఉపయోగం ఉండదని ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు జీడబ్ల్యూఎంసీ అధికారులకు సూచించారు. నగరానికి సమీపంలోని జక్కలొద్దిలోనే స్టేడియం నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పరకాల నియోజకవర్గ పరిధిలో మినీ స్టేడియం కోసం స్థలం ఎంపికపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మినీ స్టేడియంల కోసం స్థలం ఎంపిక పూర్తి కాగానే పనులు వెంటనే మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జీడబ్ల్యూఎంసీని ఆదేశించింది. దీంతో ప్రక్రియ వేగవంతమైంది.
స్పోర్ట్స్ హబ్‌గా వరంగల్
టూరిజం, ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న వరంగల్ నగరం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికతో హెల్త్ సిటీగానూ అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు స్పోర్ట్స్ రంగంలోనూ ప్రగతి దిశగా సాగుతున్నది. జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంను రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లతో అభివృద్ధి చేసింది. సింథటిక్ ట్రాక్‌తో అంతర్జాతీయ స్థాయి ఆటల పోటీలకు ఇప్పుడు జేఎన్ఎస్ సరికొత్త వేదికగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నాలుగు మినీ స్టేడియంలు నిర్మిస్తున్న నేపథ్యంలో నగరంలో క్రీడాకారులకు ప్రోత్సాహం అందనున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలు జక్కలొద్ది ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని హామీలు ఇచ్చినా అమలు చేయలేదు.
స్వరాష్ట్రంలోనే వరంగల్ నగరం అన్ని రకాలా అభివృద్ధి చెందుతున్నది. ఓరుగల్లులో క్రీడాకారులు, ప్రజల అవసరాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మినీ స్టేడియంలను నిర్మిస్తున్నది. ఇండోర్, అవుట్డోర్ క్రీడల్లో శిక్షణ ఇచ్చేలా వసతులు కూడా కల్పించనుంది. షూటింగ్ టార్గెట్ వాల్‌ను నిర్మించనున్నారు. దశల వారీగా ఇతర క్రీడా స్థలాలు, క్రీడాకారులకు వసతులు ఏర్పాటు చేయనున్నారు. వాకింగ్, రన్నింగ్ ట్రాక్, అథ్లెటిక్స్ జోన్, రైఫిల్, ఫిస్టల్ షూటింగ్ ట్రైనింగ్, ఇతర ఆటల కోసం నిర్మాణాలు చేపట్టడంతో పాటు పరికరాలను అమర్చనున్నారు. క్రీడలకు, క్రీడాకారుల అభివృద్ధికి మినీ స్టేడియంలు ఎంతగానో తోడ్పడనున్నాయి.