హనుమకొండ, సెప్టెంబర్ 7: పారిపోయిన బాలిక ఐదేళ్ల తర్వాత బంధువుల చెంతకు చేరింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం తాటికొండ గ్రా మానికి చెందిన పాపన్న, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు శిరీష, కృష్ణవేణి. బాలికలు చిన్నగా ఉన్నప్పుడే విధి వక్రించి ప్రమాదవశాత్తు తల్లిదండ్రులు మరణించారు. దీంతో అనాథలుగా మారిన ఇద్దరు బాలికల్లో కృష్ణవేణిని మేనత్త, శిరీషను బాబాయి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ రోజు బాబాయి మందలించడంతో ఐదేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిన శిరీష వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్లో భిక్షాటన చేస్తుండగా గమనించిన రైల్వే పోలీసులు హనుమకొండ సుబేదారిలోని బాలికా సదనంలో చేర్చారు. ఈ క్రమం లో శిరీషను అడ్రస్ అడిగితే ఊరు పేరు తప్ప ఏమీ చెప్పకపోవడంతో అధికారులు హన్మకొండ లష్కర్‌బజార్ ఉన్నత పాఠశాలలో చేర్చగా, ప్రస్తుతం 9వ తరగతి చదువుతోం ది. ఇటీవల చైల్డ్ వెల్పేర్ కమిటీ చైర్మన్ అన్నమనేని అనిల్‌చందర్‌రావు బాలసదనాన్ని సందర్శించి బాలిక వివరాలు ఆరా తీయగా, తనది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం తాటికొండ అని చెప్పింది. దీంతో అనిల్‌చందర్‌రావు మహబూబ్‌నగర్ సీడబ్ల్యూసీకి ఫోన్ చేసి వివరాలు తెలియజేసి శిరీషకు సంబంధించిన బంధువులకు సమాచారం అందించారు. దీంతో బాలిక మేన బావ శరత్, అక్క కృష్ణవేణితోపాటు బంధువులు హనుమకొండకు రాగా, మంగళవారం అప్పగించారు. తన కుటుంబసభ్యులను చూసిన ఆనందంతో శిరీష పొంగిపోయింది. కాగా ఇంటికి వెళ్లిన తర్వా త విషయాన్ని మహబూబానగర్ జిల్లా చైల్డ్వెల్పేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని అనిల్‌చందర్‌రావు సూచించారు. బాలికను అప్పగించిన వారిలో చైల్డ్ వెల్ఫేర్ కమి టీ సభ్యులు డాక్టర్ పీ సుధాకర్, కే దామోదర్, కౌన్సిలర్ మాధవి, సోషల్ వర్కర్ జీ సునీత, ఓఆర్డబ్ల్యూ పీ విజయ్‌కుమార్ తదితరులున్నారు.