మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 16: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వార్డెన్ నుంచి రూ. రెండు లక్షల లంచం తీసుకుంటూ సోమవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రైల్వే గేట్ సమీపంలోని ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ కూనమళ్ల బాలరాజు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని 2019 నవంబర్‌లో అప్పటి జిల్లా కలెక్టర్ శివలింగయ్య సస్పెండ్ చేశాడు. అనంతరం బాలరాజు 2021 ఫిబ్రవరిలో మరిపెడ మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌కు వార్డెన్‌గా నియమితులయ్యారు. సస్పెండ్ అయిన దగ్గర నుంచి విధుల్లో చేరే వరకు రూ. 7 లక్షల 20 వేల వేతనం రావాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రావూరి రాజు చుట్టూ వార్డెన్ తిరుగుతున్నాడు. రూ. రెండు లక్షలు ఇస్తేనే వేతనానికి సంబంధించిన బిల్లు చేస్తానని రావూరి రాజు చెప్పాడు. దీంతో డబ్బులు ఇస్తానని బాలరాజు ఒప్పుకొని, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి లంచం అడుగుతున్నాడని వరంగల్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో వార్డెన్ బాలరాజు సోమవారం రూ. రెండు లక్షలు రెడీ అయ్యాయని రావూరి రాజుకు చెప్పగా, వాటిని మహబూబాబాద్‌లోని తన ఇంటి వద్దకు తీసుకురావాలని తెలిపాడు. ఈ క్రమంలో వార్డెన్ ఫోన్ చేయగా, పక్క ఇంటిలో వాచ్‌మన్ గురుచరణ్ ఉంటాడని, ఆయనకు డబ్బులు ఇవ్వాలని తెలిపాడు. వాచ్‌మన్‌కు బాలరాజు రూ. రెండు లక్షలు ఇవ్వగా, ఇంతలో రావూరి రాజు వచ్చాడు. దీంతో వీరిద్దరూ కలిసి డబ్బులు లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐలు క్రాంతి కుమార్, శ్యామ్‌సుందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.