హనుమకొండ, సెప్టెంబర్ 5 : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉపాధ్యాయులు.. అదేస్ఫూర్తితో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రూపుదిద్దుకుంటున్న బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ కలెక్టరేట్లో డీఈవో కే నారాయణరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన గురు పూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ గత పాలకుల హయాంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని అనేక మంది విద్యార్థులు.. కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు.
సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు. మనబడి-మన బాధ్యత కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను తెలుసుకుని పరిష్కరించినట్లు వివరించారు. అంతేకాకుండా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 2 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చీఫ్‌విప్ తెలిపారు. సమాజ మార్పు కోసం అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులే మార్గ నిర్దేశకులని ఆయన కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సం ఒక సెప్టెంబర్ ఐదో తేదీకే పరిమితం కాకుండా, నిత్యం స్మరించుకోవాల్సింది విద్య నేర్పిన గురువులనని అన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే చిన్నప్పుడు చేసిన తప్పులను సరిదిద్ది క్రమశిక్షణ నేర్పిన ఉపాధ్యాయులే కారణమన్నారు. హనుమకొండలోని మర్కజీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 1001కి చేరిందంటే ఉపాధ్యాయులే కారణమన్నారు. అలాగే, దత్తత తీసుకున్న శాయంపేట పాఠశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ కంప్యూటర్ యుగంలో విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బోధనన చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు నిరంతరం అభ్యసించి బోధించాలని ఆయన కోరారు. సమాజంలో ఉపాధ్యాయుడికి మంచి గుర్తింపు ఉందని, పురాణాల నుంచి నేటి ఆధునిక యుగం వరకు ఉపాధ్యాయులదే అగ్రస్థానమని పేర్కొన్నారు. ప్రతిఒక్క విద్యార్థి భవిష్యత్‌ను తీర్చిదిద్దే వారే ఉపాధ్యాయులు అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందం ఆలపించిన పాటలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో చీఫ్‌విప్ దాస్యం వినియ్భాస్కర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస, ఎంఈవోలు రాంకిషన్‌రాజు, ఈ రవీందర్, ఏ వెంకటేశ్వర్లు, రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.