ములుగు, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : నాడు వన్యప్రాణులకు నివాసంగా పేరొందిన ములుగు అటవీ ప్రాంతం గడిచిన 30 ఏళ్లకాలంలో తన విస్తీర్ణాన్ని కోల్పోయింది. స్మగ్లర్లు, వేటగాళ్లతో ఇటు అటవీ సంపద కరిగి కాగా, వన్యప్రాణుల సంఖ్యా తగ్గింది. దీంతో పత్తిపల్లి, రాయినిగూడెం, అంకన్నగూడెం, బుస్సాపూర్, మూడుచెక్కలపల్లి, పాకాల, ఓటాయి, కొత్తగూడ గ్రామాల పరిధి చుట్టూ ఉండే ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో దారి వెంట వెళ్లే బాటసారులకు కనిపించే వన్యప్రాణులు, చిరుతలు, పెద్దపులులు.. కాలక్రమంలో కనుమరుగయ్యాయి. ఇలా అంతర్ధానమైపోయాయనుకున్న సమయంలో చాలా ఏండ్ల తర్వాత మళ్లీ పెద్దపులుల జాడలు కనిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ములుగు జిల్లాలో మరోసారి వాటి సంచారం మొదలవడంతో అడవికి మంచి రోజులు రానున్నాయి.
మూడు జిల్లాల్లో సంచారం
ములుగుతో పాటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలాల పరిధిలో ఉన్న 98వేల ఎకరాల ఫారెస్టు బ్లాక్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అక్కడి పరిసర గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ములుగు ఫారెస్టు రేంజ్ అధికారులు ఆదివారం జగ్గన్నగూడెం అటవీ ప్రాంతంలో పాదముద్రలను కనుగొన్నారు. వాటిని పరిశీలించి అడవిలో సంచరిస్తున్నది పెద్దపులేనని నిర్ధారించారు. ఈమేరకు వాటి కదలికలను తెలుసుకునేందుకు ములుగు, నల్లబెల్లి, పస్రా, పస్రా వైల్డ్‌లైఫ్, గూడూరు ఫారెస్టు రేంజ్ ప్రాంతంలో కెమెరా ట్రాప్‌లు అమర్చారు. వీటి ఆధారంగా అడవిలో తిరుగుతున్నది ఒక పెద్దపులేనా? లేదా మరెన్ని ఉన్నాయన్నది తెలుసుకోవచ్చు. అంతేగాక వాటి వయస్సు, ఇతర వివరాలతో పాటు అంతరించిపోయిన జంతువుల జాడను కూడా ఈ కెమెరాల ద్వారా కనుగొంటారు.
పూర్వవైభవం దిశగా..
ప్రస్తుతం పలుచోట్ల పులి పాదముద్రలు తారసపడుతుండడంతో అడవులకు పూర్వవైభవం వచ్చినట్టేనని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. ఒక పులి అడవికి వెయ్యి ఎనుగుల బలం లాంటిందని, పులులు ఉన్న చోట అడవుల విస్తీర్ణం మరింత పెరిగి సకాలంలో వర్షాలు కురవడంతో పాటు జీవకోటి అవసరమయ్యే జలా లు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు. దట్టమైన అడవిలో ఉన్న పులి మనిషికి ఎలాంటి హాని చేయదని, దానికి కావాల్సిన ఆహారం దొరికినంత వరకు అడవిని విడిచి బయటకు రాదని అంటున్నారు. అలాగే పెద్దపులిని వేటగాళ్ల నుంచి రక్షించేందుకు త్వరలో గ్రామస్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
పూర్వం గుర్రాలపై నిజాం రాజుల పులుల వేట
పూర్వం నైజాం నవాబులు పులులను వేటాడేందుకు గుర్రాలపై ములుగు ప్రాంత అడవికి వచ్చేవారని అధికారులు చెబుతున్నారు. 1992 వరకు కూడా ములుగు అభయారణ్యంలో పెద్దపులులు సంచరించగా, కాలక్రమంలో అడవి విస్తీర్ణంతో పాటు జంతువులు తగ్గిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అటవీ సంరక్షణ కోసం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో పాటు వన్యప్రాణి చట్టాన్ని కఠినంగా అమలుచేసేందుకు అటవీ శాఖకు పూర్తి అధికారాలు కేటాయించారు. దీంతో పాటు జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఫారెస్టు అధికారులను, సిబ్బందిని నియమించి విధుల నిర్వహణకు వాహనాలతో పాటు నిధులు సమకూర్చారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం కొంత మేర పెరిగి గత ఏడాది కాలంగా పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంచారం పెరిగింది.
ట్రాప్ కెమెరాలు ఎలా పనిచేస్తాయంటే..
వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కెమెరా ట్రాప్‌లు అమర్చుతారు. బ్యాటరీ ద్వారా నడిచే ఈ ట్రాప్ కెమెరాలు ముఖ్యంగా వన్యప్రాణులు నీటి, ఆహారం, ఆవాసం వద్దకు వచ్చే చోట చెట్లకు బిగిస్తారు. ఈ కెమెరాలు తన వైపు వచ్చిన జంతువులను సెకను వ్యవధిలో ఫోటో తీస్తాయి. చెట్టు కొమ్ములు, ఆకులు అడ్డులేకుండా పకడ్బందీగా అమర్చే ఈ కెమెరాల ముందు పగలు, రాత్రి ఏదైనా వచ్చినట్లు కదలిక వచ్చిన వెంటనే ఫొటోలను ఆటోమెటిక్ సిస్టమ్ ద్వారా తీస్తుంది. అధికారులు ప్రతీ నాలుగు, ఐదు రోజులకు ఒకసారి ట్రాప్ కెమెరాల వద్దకు వెళ్లి బ్యాటరీలను మార్చి ఫొటోలను సేకరిస్తారు. ప్రస్తుతం ములుగు రేంజ్ పరిధిలో అటవీ శాఖ అధికారులు మంగళవారం ఐదు కెమెరాల ట్రాప్‌లు అమర్చారు. మరో వారం రోజుల్లో ఈ ట్రాప్ కెమెరాల ద్వారా పులి ఆనవాళ్లను పూర్తిస్థాయిలో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.