గురువారం 04 మార్చి 2021
Warangal-city - Feb 03, 2021 , 01:20:54

58 టు 66

58 టు 66

గ్రేటర్‌లో డివిజన్ల పునర్విభజన 

2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రక్రియ

జీడబ్ల్యూఎంసీకి మున్సిపల్‌ శాఖ ఆదేశాలు

నగరానికి ఉత్తరం వైపు నుంచి మొదలు

దేశాయిపేట మళ్లీ ఒకటో డివిజన్‌..!

కార్పొరేషన్‌ ఎన్నికల దిశగా అడుగులు

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్లూఎంసీ) ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఇందులో కీలకమైన డివిజన్ల ప్రక్రియ త్వరలోనే మొదలుకానుంది. బల్దియా పాలకవర్గం గడువు మార్చి 14న ముగియనుండగా, ఆలోపు ఎన్నికలు నిర్వహించే ఆలోచనతో డివిజన్ల పునర్విభజనపై మున్సిపల్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జనాభా, ఓటర్ల నిష్పత్తి ప్రాతిపదికగా కొత్త డివిజన్లు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నగర భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఉత్తరం నుంచి మొదలుపెట్టి తూర్పు, దక్షిణం, పడమరలను కలుపుతూ పునర్విభజన పూర్తి చేయాలని, 2011 జనాభా ఆధారంగా వార్డులు విభజించాలని  స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో 58 డివిజన్లు ఉండగా ఆ సంఖ్య 66కు చేరనుంది. 

- వరంగల్‌, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) 

వరంగల్‌, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి)  : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ త్వరలోనే మొదలుకానుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర పరిధిలో 8,19,406 మంది జనాభా ఉన్నారు. 2016లో జరిగిన ఎన్నికలప్పుడు గ్రేటర్‌ పరిధిలో 58 డివిజన్లున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా మరో ఎనిమిది డివిజన్లు పెరగనున్నాయి. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ చట్టంలో ప్రభుత్వం పేర్కొంది. దీని ప్రకారం డివిజన్ల పునర్విభజనతోపాటు రిజర్వేషన్లను కొత్తగా ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రం యూనిట్‌గా పరిగణలోకి తీసుకునే గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యింది. జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా డివిజన్ల పునర్విభజన చేసి కొత్త రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. డివిజన్ల పునర్విభజన ముగిసిన తర్వాత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలుకానుంది. పునర్విభజన ప్రక్రియపై తేదీల వారీగా మున్సిపల్‌ శాఖ ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. 2016 ఎన్నికల సమయంలో ఒక్కో డివిజన్‌లో సగటున 11 వేల నుంచి 15 వేల వరకు జనాభా, 8వేల నుంచి 11 వేల వరకు ఓటర్లున్నారు. గత ఎన్నికల ప్రకారం 55వ డివిజన్‌లో అత్యధికంగా 15,536 మంది జనాభా ఉన్నారు. 30వ డివిజన్లో అతి తక్కువగా 12,762 మంది జనాభా ఉన్నారు. తాజాగా మరో 8 డివిజన్లు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని డివిజన్లలో వీలైనంత వరకు సమానంగా జనాభా, ఓటర్లు ఉండేలా పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. మున్సిపల్‌ శాఖ జారీ చేసే షెడ్యూల్‌కు అనుణంగా ముందస్తు నోటిషికేషన్‌తో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ మొదలవుతుంది. అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీల సూచనలు స్వీకరించిన అనంతరం కొత్త డివిజన్ల ఏర్పాటుపై మున్సిపల్‌ శాఖ తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. గ్రేటర్‌ వరంగల్‌ సిటీ ప్లానింగ్‌ విభాగం ఆధ్వర్యంలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ జరగనుంది. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని సిటీ ప్లానింగ్‌ అధికారులు తెలిపారు. 


VIDEOS

logo