బుధవారం 27 మే 2020
Warangal-city - May 15, 2020 , 01:29:54

ఎర్రటెండలో కాల్వలకు నీళ్లు

ఎర్రటెండలో కాల్వలకు నీళ్లు

  • ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే
  • ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం
  • రైతులు గతానికి, ఇప్పటికి తేడా గుర్తించాలి
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ధర్మసాగర్‌, మే 14: ఎండలు మండిపోతున్న ప్రస్తుత దశలో కాల్వలకు నీళ్లు వదిలిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌తో కలిసి వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ సౌత్‌ కెనాల్‌ నుంచి నీళ్లను వదిలారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటి ఉద్యమ స్ఫూర్తితోనే ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నామన్నారు. ఇక నుంచి దేవాదుల ప్రాజెక్ట్‌ ద్వారా 365 రోజులు ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేస్తామన్నారు. ఇందులో భాగంగానే 46వ ప్యాకేజీ కింద వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గ పరిధిలోని 33 గ్రామాల సాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలు వదిలినట్లు చెప్పారు. రైతులు గత ప్రభుత్వాలకు, ఇప్పటికి తేడాను గుర్తించాలని, అప్పుడు నీళ్లు, కరెంట్‌ కోసం ఆందోళనలు చేపట్టేవారని, ప్రస్తుతం అన్నదాతల సంక్షేమానికి అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్‌ను ఇవ్వడంతో పాటు రుణ మాఫీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. 

కాల్వల ద్వారా సాగునీరు..

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని అన్ని చెరువులను ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ కాల్వల ద్వారా నింపి సాగునీరందిస్తామని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. వేలేరు మండలంలోని చెరువులు, కుంటలను వరద కాల్వ ద్వారా నింపేందుకు ప్రణాళికలు రూపొందించామని, పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ రైతులకు సాగునీరందించడమే ప్రభుత్వ ధ్యేయమని, దేవాదుల ప్రాజెక్ట్‌తో పొలాలన్నీ పచ్చగా మారుతున్నాయన్నారు. 18 ఏళ్ల కల నెరవేరిందని, సంగెం మండల రైతులు గోదావరి జలాలను చూసి సంతోషిస్తారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని 14 గ్రామాల చెరువులను నింపి ఆయకట్టు రైతులకు నీరందిస్తామని చెప్పారు. తక్కువ సమయంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వరంగల్‌ ఉమ్మడి జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ జిల్లా జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌ కుమార్‌, స్థానిక ఎంపీపీ నిమ్మ కవిత, దేవాదుల సీఈ బంగారయ్య, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo