బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 17, 2020 , 03:42:52

నిఘా పెంచండి

నిఘా పెంచండి
  • మావోయిస్టుల కదలికలపై దృష్టి పెట్టండి
  • అధికారులను సమన్వయం చేసుకోవాలి
  • పల్లె, పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలి
  • డీజీపీ మహేందర్‌రెడ్డి
  • ములుగు, భూపాలపల్లి పోలీస్‌ అధికారులతో సమావేశం

ములుగు జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా పెంచాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సోమవారం రెండు జిల్లాల అధికారులతో సమీక్ష  సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా గోదావరి పరివాహక అటవీ ప్రాంతమైన ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో మావోల కదలికలు పెరిగాయనే సమాచారం మేరకు నిర్వహించిన అంతర్గత సమీక్షలో మావోల కదలికలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించినట్లు తెలిసింది. మావోయిస్టుల యాక్షన్‌ టీంలు సంచరిస్తున్నాయనే వినికిడి మేరకు  పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్‌ అధికారులకు సూచించినట్లు సమాచారం. సమీక్ష అనంతరం నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. జిల్లాలో నేర నివారణ, నేరస్తులకు శిక్ష పడటం వంటి అంశాలతో పాటు రెండు జిల్లాలలో శాంతి భద్రతల పరిరక్షణ పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పోలీసులు ప్రజలతో మమేకమవుతూ అర్హులకు ఫలాలు అందేలా సహకరించాలని సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగస్వాములై అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. అలాగే  పల్లె, పట్టణ ప్రగతి ఉద్దేశాలు, లక్ష్యాలు ప్రజలకు అర్థమయ్యేలా పోలీసు శాఖ ద్వారా అవగాహన కల్పించాలని చెప్పారు.

రాష్ర్టానికే వన్నె తెచ్చేలా..

ఆసియా ఖండంలోనే పేరు ప్రఖ్యాతలుగాంచిన మేడారం జాతర నిర్వహణలో పోలీస్‌ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వర్తించిందని డీజీపీ మహేందర్‌ రెడ్డి  కొనియాడారు. విధి నిర్వహణలో తెలంగాణ రాష్ర్టానికి వన్నె తెచ్చారంటూ అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పని చేయడం వల్లే జాతర విజయవంతమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ శాఖకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ అన్ని వనరులను సమకూర్చిందన్నారు.  

వసతులపై ఆరా... 

ములుగు, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి కావాల్సిన వసతులపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వం పోలీస్‌ శాఖకు కావాల్సిన వసతులను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త జిల్లాలోని పోలీస్‌ శాఖకు అన్ని వసతులను కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో ఓఎస్డీలు సురేశ్‌కుమార్‌, శోభన్‌కుమార్‌, ఏఎస్పీలు సాయిచైతన్య, శరత్‌చంద్రపవార్‌, డీఎస్పీలు బోనాల కిషన్‌, సంపత్‌రావుతో పాటు సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.


logo
>>>>>>