పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా ఏర్పాట్లు
కలెక్టరేట్ సహా ఇతర కార్యాలయాలకు ‘కొత్త’ పేర్లు
వరంగల్, హనుమకొండ జిల్లా పేరుతో బోర్డులు
యుద్ధప్రాతిపదికన పాతవి తొలగింపు
త్వరలో అధికారిక సమాచారం
కొత్త జిల్లాల ప్రకారం జనాభా, విస్తీర్ణం, గణాంకాల నమోదు
శాఖల వారీగా పొందుపరుస్తున్న అధికార యంత్రాంగం
వరంగల్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైన హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా మార్పులు మొదలయ్యాయి. జిల్లా పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసిన మరుసటి రోజు నుంచే ఇటు కలెక్టరేట్ సహా అన్ని కార్యాలయాల బోర్డులు మారుతున్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్స్‌ను తొలగించి వాటిస్థానంలో కొత్త పేర్లతో శాఖలవారీగా అమర్చే ప్రక్రియ వేగవంతమైంది. అలాగే మారిన మండలాల ప్రకారం రెండు జిల్లాల్లో జనాభా(హనుమకొండ 9.08 లక్షలు, వరంగల్ 8.93 లక్షలు) విస్తీర్ణం, తదితర గణాంకాలతో పాటు శాఖలవారీగా అధికారిక సమాచారాన్ని యంత్రాంగం పొందుపర్చుతోంది.
పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అధికారిక మార్పులు మొదలయ్యాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు అన్ని శాఖల బోర్డుల మార్పు వేగవంతమైంది. ఆయా జిల్లాల్లోని మండలాల వారీ వివరాలతో జిల్లా గణాంకాలను రూపొందిస్తున్నారు. శాఖలవారీగా ఇప్పటివరకు ఉన్న గణాంకాలన్నీ మారనున్నాయి. ఈమేరకు అధికారిక సమాచారాన్ని ఒకటిరెండు రోజుల్లో పూర్తి స్థాయిలో రూపొందించేలా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన పునర్వ్యవస్థీకరణతో వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, దామెర, నడికూడ, శాయంపేట, ఆత్మకూరు మండలాలు వరంగల్ అర్బన్‌లో కలిశాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని వరంగల్, ఖిలా వరంగల్ మండలాలు వరంగల్ రూరల్ జిల్లాలోకి మారాయి. మండలాల సర్దుబాటుతో పాటు వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ జిల్లాగా.. వరంగల్ రూరల్ జిల్లా వరంగల్‌గా ప్రభుత్వం మార్చింది. మండలాల మార్పుచేర్పులు కావడంతో ఈమేరకు శాఖలవారీగా గణాంకాలన్నీ మారనున్నాయి. జనాభా, విస్తీర్ణం అన్ని కొత్తగా ఉండనున్నాయి.
హనుమకొండ జిల్లా జనాభా 9.08 లక్షలు, వరంగల్ 8.93 లక్షలు..
తాజా మార్పులతో వరంగల్ జిల్లాలో 13 మండలాలు, హనుమకొండ జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. వరంగల్ జిల్లా విస్తీర్ణం 1805 చదరపు కిలోమీటర్లు, హనుమకొండ జిల్లా విస్తీర్ణం 1688 చదరపు కిలోమీటర్లుగా ఉంది. వరంగల్ జిల్లా జనాభా 8.93 లక్షలు కాగా, వీరిలో పురుషులు 4.46 లక్షలు, మహిళలు 4.44 లక్షల మంది ఉన్నారు. హనుమకొండ జిల్లాలో జనాభా 9.08 లక్షలు ఉంది. వీరిలో 4.55 లక్షల మంది పురుషులు, 4.53 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. వరంగల్ జిల్లాలో 192 రెవెన్యూ గ్రామాలు, హనుమకొండ జిల్లాలో 163 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 2.26 లక్షల ఇండ్లు, హనుమకొండ జిల్లాలో 2.30 లక్షల ఇండ్లు ఉన్నాయి.
యుద్ధప్రాతిపదికన కలెక్టరేట్ బోర్డుల మార్పులు..
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా అధికారులు బోర్డులను మార్చారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్‌కు వరంగల్ జిల్లా కలెక్టరేట్‌గా మార్చుతూ బోర్డులు ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌ను హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌గా మార్చి బోర్డులు పెట్టారు. అన్ని శాఖల జిల్లా కార్యాయాలు, అధికారుల పేషీలతోనూ ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనంత త్వరగా బోర్డుల మార్పు ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా ల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు.